Thursday, September 12, 2019

"చెయ్యి పట్టి నడిపిన మన నాన్న" - (By సతీష్ గారు)

నాన్నగారు సమక్షంలో గడిపిన బంగారు క్షణాలు

భౌతికమైన కష్టాలు చాలా పడ్డాను. వృత్తిపరంగా , ఆర్థికంగా చాలా కష్టాలు పడినా నాన్న గారితో పాటు ప్రయాణించిన ఈ పదిహేను సంవత్సరాల కాలంలో ఆయన ఉండటంవల్ల, నాకు భౌతికమైన కష్టాలు వచ్చినా, లోపల నాకున్న శాంతి ఎప్పుడు చెదరలేదు. భౌతికంగా కష్టాలలో ఉన్నప్పుడు జున్నూరులో ఆయన దగ్గర కూర్చుని చాలా ఆవేదన గా ఉండేవాడిని. నేను ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉన్నప్పుడు, నువ్వు ప్రశాంతంగా స్తంభానికి జారబడి కూర్చో. తర్వాత నీతో మాట్లాడుతాను అని చెప్పి, నేను ప్రశాంతంగా అయ్యాకానే నాతో ఏదైనా చెప్పేవారు. తరువాత నేను Kuwait కి వెళ్ళాను, కానీ వీసా ఇబ్బంది వల్ల వచ్చేశాను. మరుసటి రోజు అరుణాచలం వచ్చాను. అప్పుడు అక్కడ ఉష అక్క నాన్నగారితో, వీసా ప్రాబ్లెం వల్ల సతీష్ వచ్చేసాడు అని అంటే , ఆయన ఇవి ఏమీ పట్టనట్టు ఎంతో సరదాగా ఆయన కువైట్ రాజు గురించి మాట్లాడుతున్నారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇదేమిటి కష్టపడి ఎక్కడెక్కడో తిరిగి వచ్చాము, ఇప్పుడు నా గురించి చెప్పకుండా కువైట్ రాజు గురించి వాళ్ళతో మాట్లాడుతున్నారు ఏంటి అనుకున్నాను. నాకు అప్పుడు అర్ధం కాలేదు. కాని తర్వాత రాను,రాను అర్ధమయ్యింది. మనకి ఏదైనా కష్టం వస్తే, అది చాలా పెద్దదిగా కనిపించవచ్చు కాని జ్ఞానికి ఇదంతా తీసేసిన సినిమానే కదా!

నేను ఇక్కడకు వచ్చేసిన తర్వాత భౌతికంగా ఇబ్బందులు ఉన్నా కానీ ఆ తరువాత ఒక సంవత్సరం నేను ఖాళీగా ఉన్నాను. రోజు విడిచి రోజు జిన్నూరు వెళ్ళేవాడిని. ఆయన సన్నిధి ఎక్కువ ఉపయోగించుకున్నాను. అలా రోజు నేను నాన్నగారి దగ్గరికి వెళ్ళటం వలన నాన్నగారికి చాలా దగ్గర అయ్యాను. లోపల శాంతి గా ఉన్నా భౌతికంగా కూడా బ్రతకాలి కదా! ఇలా రోజు వచ్చి వెళ్ళిపోతున్నాను అని ఉష అక్కతో అంటే అప్పుడు అక్క ఒక మాట చెప్పారు అదేమిటంటే : "సతీష్ ఇది గోల్డెన్ పిరియడ్, ఆయన అవకాశం ఇచ్చారు కాబట్టి నువ్వు దగ్గర ఉన్నావు. నువ్వు బిజీ అయిపోయి, ఆయన దగ్గరకు రాకుండా ఉండే రోజులు కూడా వస్తాయి అన్నారు." తరువాత అదే జరిగింది. అప్పుడు చాలాసార్లు రాలేకపోయినా ఉష అక్క మాటే గుర్తొచ్చేది. నాన్నగారి ఆఖరి రోజులలో ఒక 15 రోజులు ఆయన దేహం ఉన్నప్పుడు ఆయన దగ్గర ఉండగలిగాను కదా! అదే నేను వేరే దేశంలో ఉండి ఉంటే నాకు వీలుపడేది కాదు.

ఆఖరి రోజులలో నాన్న గారు మంచం మీద ఉన్నప్పుడు రాత్రుళ్లు కూడా అక్కడే గడిపేవాళ్ళము. ఒక రోజు రాత్రి ఆయన ఒక అరగంట కూడా పడుకోలేదు. చాలా బాధపడుతూ ఉన్నారు. అలాంటి సమయంలో నన్ను గుర్తు పడతారు అని కూడా నేను అనుకోలేదు. నేను నాన్నగారి పక్కనే కూర్చున్నాను. అప్పుడు ఏమన్నారంటే , మల్కిపురంలో సత్సంగం జరుగుతుందా అని అడిగారు. అప్పటికే ఒక సంవత్సరం ముందు నుండి ప్రతి శనివారం భీమవరం నుండి మల్కిపురం వెళ్లి అక్కడ గుడి దగ్గర సత్సంగం చెప్పుకునేవాళ్ళం . నాన్నగారికి ఆరోగ్యం బాగోలేనప్పుడు నుంచి భీమవరం నుండి జిన్నూరు వచ్చేవాడిని, మల్కిపురం వెళ్ళే వాడిని కాదు. అయితే నాన్నగారు అంత అనారోగ్యంగా ఉన్న ఆ సమయంలో కుడా మల్కిపురంలో సత్సంగం జరుగుతుందా అని అడిగారు. నేను వెళ్ళటం లేదు నాన్నగారు మీ దగ్గరకే వస్తున్నాను అని చెప్పాను. నీకు వీలు అవ్వకపోతే అమలాపురం మాస్టర్ని వెళ్లమని అడగవచ్చు కదా అన్నారు. అప్పుడు నాకు అనిపించింది ఇంత ఇబ్బంది లో కూడా ప్రత్యేకించి ఆయన సత్సంగానికి అంత ప్రాముఖ్యతను ఇచ్చారు కదా అని నాకే బాధ అనిపించింది. చిన్న దాన్ని కూడా ఆయన అంత పిన్ పాయింట్ గా చెప్పటం నాకు ఆశ్చర్యమేసింది. నాన్నగారు దేహం వదిలేసిన నాలుగైదు నెలలు తర్వాత భీమవరంలో ఉద్యోగం మానేసి మల్కిపురం వచ్చేసాను ఏదో వ్యాపారం గురించి. గత సంవత్సరం నుంచి కూడా సత్సంగం చాలా బాగా జరుగుతోంది. నాన్నగారి అనుగ్రహం వలన సబ్జెక్టు మేము బాగా చెప్పుకోగలుగుతున్నాము. అంత అనుగ్రహం ఎలా కురిపిస్తున్నారో మాకే అర్ధం అవ్వటం లేదు.

నీలో ఉన్న అహంకారము, మమకారములను విడిచిపెట్టటమే త్యాగం

నాన్నగారు లక్కవరంలో ఉన్న సరస్వతి శిశు మందిరం స్కూల్ కి వచ్చేవారు. అక్కడ నాన్నగారి టీచింగ్ చెప్పేవారు. నాన్నగారు వారికి డొనేషన్స్ కూడా ఇచ్చేవారు. నేను చిన్నప్పుడు ప్రైమరీ ఆ స్కూల్లో చదువుకున్నాను. ఆ స్కూల్లో ఫస్ట్ సెకండ్ క్లాస్ నుంచి రామాయణం, మహాభారతం నేర్పుతారు. అలా నేర్పటం వలన అవి నాకు చిన్నప్పుడే కొంతవరకు అవగాహన ఉంది. నాకు షిరిడి బాబా అంటే ఇష్టం ఉండేది. అప్పట్లో ఎలా ఉండేది అంటే, మనం సేవ చేసుకోవటానికి బాబా లాంటి గురువు లేడు కదా అని అనిపిస్తూ ఉండేది. సత్పురుషుల దగ్గర ఉండాలి వారి సేవ చేసుకోవాలి అనే వాసన చిన్నప్పుడు నుంచి ఉంది. ఆ కోరిక నాన్నగారు నాకు ఆఖరి రోజులలో తీర్చేరు అని అనిపించింది. అప్పటి నుండి మనస్సు బాహ్యానికి వెళ్ళటం తగ్గింది. నిరంతరం నాన్నగారు గైడెన్స్ లోపల నుండి ఇవ్వటం వలన లోపల అశాంతి గాని ,వెలితిగాని లేదు. నాన్నగారు దేహం వదిలిన తర్వాత ఇప్పుడు అందరిలోను నాన్నే కనిపిస్తున్నారు. ఆయన ఉనికి ఇప్పుడు ఇంకా ఎక్కువ తెలుస్తోంది. జీవుడి రూపంలోనూ ఆయనే ఉన్నారు అనే భావన దృఢ పడిపోవటం వలన జిన్నూరు వెళ్ళినా, వెళ్లకపోయినా నాకు బాధ కలగటం లేదు. ఇంతకుముందు 15 రోజులకు ఒకసారైనా వెళ్లాలి అనిపించేది. ఇప్పుడు వెలితి ఉండటం లేదు. నాకు అర్థమైంది ఏమిటంటే నాన్నగారు ఎక్కడో సత్సంగంలో త్యాగం గురించి చెప్పారు.త్యాగం అంటే ఏదో ఒకటి వదిలేయటం కాదు నిన్ను నీవు వదులుకోవడమే త్యాగం అన్నారు. అంటే మన false existence ని ఆయనకి అప్పగించేస్తే మనం త్యాగి అవుతాము. ఎంత అద్భుతమైన టీచింగ్ అని అనిపిస్తుంది.

నాకు చనువు ఇచ్చి, దగ్గరికి తీసుకున్నది నాన్నగారే

ఈ ప్రయాణంలో మొదట్లో నాకున్న ఇబ్బంది ఏమిటంటే నాన్నగారు మనకి జిన్నూరు లో దొరికేసారు కదా. మన అందరికి ఒక తండ్రిలా ఉండేవారు ఆయన, నాకు మాత్రం భగవాన్ అన్నా, భగవాన్ టీచింగ్ అన్న అల్టిమేట్గా అనిపించేది. నాన్నగారి దగ్గరకు వచ్చిన కొత్తలో అందరూ అరుగు మీద కూర్చుని నాన్నగారు ఏం చెప్పినా శ్రద్ధగా విని, ప్రేమగా ఉండేవారు. నాకు చిన్నప్పుడు ఏమనిపించేదంటే వీళ్ళు అందరూ గురువు పట్ల ఇంత ప్రేమగా ఉన్నారు. భౌతికమైన గురువు పట్ల ప్రేమ ఉండాలి కదా నాకు నాన్నగారంటే గౌరవం ఉంది కానీ ప్రేమ రావటం లేదు ఏంటి. కనిపించని భగవాన్ మీద తెలియని అనుబంధం ఉంది కనిపించే నాన్నగారి మీద ప్రేమ రావటం లేదు ఏంటి అని చాలా బాధపడే వాడిని. ఒక మూడు నాలుగు సంవత్సరాలు తరువాత నాన్నగారి దగ్గర భయం తగ్గి చేరువయ్యాను. అప్పుడు భగవాన్, నాన్నగారు వేరు కాదు. వారి రూపాలు వేరు కాని, వారి ఉనికి ఒక్కటే అని నాకు అర్ధమైనది. అప్పటి నుండి నాకు సఫరింగ్ లేదు.

నాకు ఆయన మౌనం అందేది. కొన్ని సార్లు ఏమైనా సందేహం వచ్చినప్పుడు అడగలేక అడిగితే ఆయన కళ్ళల్లోకి చూసి చెప్పేవారు. ఆయన చెప్పటం మొదలు పెట్టిన మరుక్షణం మనస్సు అణిగిపోయేది . ఆయన ఏమి చెప్పారో తెలిసేది కాదు కానీ ఆయన కళ్ళల్లో అనుగ్రహం ఆ సైలెన్స్ మాత్రం నా హృదయానికి పట్టేసేది. అంటే సంశయం నశించి, ఉన్నస్థితి అర్థం అయ్యేది. మనం ఏమీ కష్టపడక పోయినా మనల్ని ఏ స్థాయిలో కూర్చోపెట్టారు అనేది ఇప్పుడు అర్థమవుతోంది. నాన్నగారు మలయమారుతం అనేవారు. సహజంగా గాలి వీస్తున్నప్పుడు నీకు విసినకర్ర తో పని ఏమిటి అనే వారు కదా. చివరికి ఏమిటంటే భగవాన్ చెప్పే టీచింగ్ లో సారమంతా కూడా నాన్నగారు మనకి తెలియకుండానే అలవాటు చేసేసారు అనిపిస్తోంది. 

మొదట్లో నాన్నగారు మీటింగులు వింటున్నప్పుడు దేహం నువ్వు కాదు, మనస్సు నువ్వు కాదు అంటుంటే నాకు భయం వేసేది. అప్పట్లో నేను ఇది కాదన్నప్పుడు నేనేంటో నాకు తెలియటం లేదు కదా నేను దేహం కాదన్నప్పుడు నేనేమిటో అది నేను అవ్వాలి కదా అని చాలా సఫరింగ్ పడ్డాను. అంటే నేను ఎవరో తెలియకుండా ఇలా బతికేసేనా ఇంతకాలం అనిపించేది. చిన్నపుడు స్కూల్ కి వెళ్ళేటపుడు అనిపించేది నేను అసలు ఎక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను. కానీ అప్పుడు ఎవరిని అడగాలో తెలిసేది కాదు. స్వర్గం,నరకం అనేవి ఉన్నాయి అని ఎవరైనా చెప్పినా కూడా అవి ఉన్నాయి అని ఏ మాత్రం నమ్మకం కలిగేది కాదు .

మన అహంకారాన్ని, మన స్వభావాన్నిగురు పాదాల దగ్గర అర్పణ చేసుకోవటం మాత్రమే మనకు గతి. నాన్నగారు ఒకసారి కాశి లో ఇలా అన్నారు. "మేము సాధన చేస్తున్నాము అని మీ భుజాన మీ నేనుని వేసుకుని తిరుగుతున్నారు ఇంక సాధన ఏమిటి .మీ నేనుని ఒక పక్కన పడేసి, అప్పుడు చేయండి సాధన" అని.

చివరిగా, గురు వైభవం ఇట్టిది అని మాటల్లో ఎలా చెప్పగలం. జరిగింది , జరుగుతున్నది ,జరగబోయేది అయన లీల మాత్రమే అయినప్పుడు మనకి, మన ఉనికికి ఇంకా చోటేది ,అయన లీలా ప్రవాహంలో సాక్షీ మాత్రంగా ఈ సృష్టిని అయన ప్రతిరూపంగా చూస్తూ మనం కరిగిపోవటం మాత్రమే మన గురువుకి మనం ఇవ్వవలసిన గురు దక్షిణ .

"సత్యజ్ఞానం లేని ఈ జన్మఫలమేమి ఒప్పగా రావేల అరుణాచల"

శ్రీ నాన్న పరమాత్మనే నమః

1 comment: