Monday, August 16, 2021

"కృషితో కృప" - (By లీల గారు)

నాన్నగారు భక్తులకి ఎన్ని వాసనలు ఉన్నప్పటికీ చమత్కారానికి కూడా వారిని ఒక్క మాట అనేవారు కాదు. ఎన్ని జన్మలు పుణ్యం చేసుకువచ్చామో, మనకు ఈ రోజు ఇలాంటి గురువు దొరికారు. కానీ ఈ అవకాశాన్ని మనం జారవిడుచుకోకూడదు. మన వైపు నుండి కృషి బాగా పెరగాలి అనిపిస్తూ ఉంటుంది. నాకు ఏదైనా కష్టం వస్తుంది అనగానే ముందే నాన్నగారు నాతో నీ స్వరూపం శాంతి, ఆనందం నువ్వు శాంతిలో నుంచి బయటకు రావద్దని చెప్పేసేవారు. వంతెన కింద నీరు సమానంగా ఎలా ప్రవహిస్తూ వెళ్ళిపోతుందో, అలా నువ్వు శాంతిలో నుంచి బయటికి రాకపోతే నీకు వచ్చే కష్టాలు అలా వెళ్ళిపోతుంటాయి అని చెప్పేవారు. పవిత్రతలో నుండి శాంతి వస్తుంది, శాంతిలో నుంచి సుఖం వస్తుంది, సుఖానికి తల్లి శాంతి, శాంతికి తల్లి పవిత్రత, అందుకని మనకి పవిత్రత పునాదిగా ఉండాలి. నువ్వు ఒక మాట మాట్లాడితే నీకు శాంతి రావాలి ,ఇతరులకు శాంతి వచ్చేలా ఉండాలి అలా మనం జీవించాలి అని నాకు బోధిస్తూ, నువ్వు సత్సంగం చెప్పేటప్పుడు వినేవారికి ఆ శబ్దానికి అర్థం స్ఫురించేలాగా చెప్పగలగాలి, నీ అనుభవాన్ని జోడించి చెప్పాలమ్మ అని అంటూ, నువ్వు ఏదైనా ఒక కష్టం నుంచి కానీ, ఒక అనుభవం నుంచి బయటకు వచ్చి నీ అనుభవాన్ని జోడించి సత్సంగం వినేవారికి చెప్పావు అనుకో అమ్మ లీల , రేపు వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చింది అనుకో నువ్వు పడ్డ కష్టం వాళ్ళు పడకుండా తేలికగా బయటకు వస్తారు అమ్మ అందుకు నీ అనుభవాన్ని జోడించి చెప్పాలి అనే వారు నాన్నగారు.

సబ్జెక్టు పట్టుకొని జీవిస్తే ప్రాణ ప్రయాణ సమయంలో ఎలా వెళ్తానో కూడా స్వప్నంలో చూపించారు నాన్నగారు. రామా రామా అంటూ శరీరాన్ని వదలడం ఈ జీవుడు చూడటం స్వప్నం లో చూపించారు. సబ్జెక్ట్ యొక్క వైభవం అది. మాట దేవుడై ఉంది అన్నారు నాన్నగారు. మొదట్లో నీ అవతారం ఏమిటి అని నేను అడిగే దాన్ని కదా, లోపల షిరిడి బాబా నాన్నగారు ఒకటిగా, నాన్నగారు భగవాన్ ఒకటిగా, నాన్నగారు శివుడు ఒకటే అని అలా చూపించేవారు. ఒకసారి నాన్న గారిని నేను నాకు స్వప్నంలో చూపిస్తున్నారు కదా నేను భౌతికంగా మీ వైభవాన్ని అలా ఎందుకు చూడలేకపోతున్నాను అని అరుణాచలంలో అడిగాను, నీకు తర్వాత చెప్తానులే అన్నారు. తరువాత నేను గిరిప్రదక్షిణ కి వెళుతూ ఉంటే, గాఢనిద్రలో మనస్సు హృదయానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి అప్పుడు పరమ పవిత్రంగా ఉంటుంది. అప్పుడు నాన్నగారు వైభవం స్వప్నంలో తెలియజేసింది. జాగ్రదావస్థలోకి వచ్చేసరికి మనసు దేహంతో కలిసిపోయి మలినం అయిపోయింది కదా నాన్నగారి వైభవం నాకు ఎలా తెలుస్తుంది అనుకున్నాను అలా నేను అడిగిన ప్రశ్నకు ఆ గిరి ప్రదక్షిణలో నాన్నగారు నా స్పురణకు వచ్చేలా చేశారు. అంటే, నా మనసులో మాలిన్యం నేను కడుక్కుంటూ భౌతికంగా జీవిస్తే, నా దైనందిన జీవితంలో నా ఆలోచన,మాట, చేత ద్వారా నేను పవిత్రురాలుని అయినప్పుడు నాన్నగారు వైభవం నాకు అర్థం అవుతుంది అని తెలిసింది. తర్వాత ఒకసారి నాన్నగారు మనస్సు అంతర్ముఖం అవ్వకుండా గురువు వైభవం ఎవరికీ అర్థం కాదు అని చెప్పారు.

నాన్నగారు : రామాయణము లీలకి ఇచ్చినా చదవట్లేదు, లీల జ్ఞాని అయిపోయింది అన్నారు.

లీలగారు(భక్తురాలు): ఆ మాటకు నాకు దుఃఖం వచ్చి, ఒక కాగితం మీద పూర్వం రామాయణ, భాగవతాలు చదివాను, నాన్నగారు అప్పుడు నేను నా సమస్యను పరిష్కరించుకోలేకపోయేదాన్ని ఇప్పుడు మీ సమక్షంలో మీ ప్రవచనాలు విన్న తర్వాత నా సమస్యలను నేను పరిష్కరించుకోగలిగాను. నేను రామాయణం చదవలేదు నాన్నగారు నన్ను క్షమించండి అని వ్రాసి ఇచ్చాను.

నాన్నగారు: రెండుసార్లు చదివి హృదయం మీద చెయ్యి వేసుకుని లీలా నువ్వు రాసింది నేను ఒప్పుకుంటున్నాను అమ్మ అని 'మన బోధంతా మనసుకు ట్రైనింగ్, ఈ గాథలు అన్నీ బాధలను తీసుకువస్తాయి అని భగవాన్ చెప్పారు . మన ఇంట్లో బాధలే మనం పడలేకపోతున్నాము, మళ్ళీ మనకు ఆ బాధలు ఎందుకు , మన సబ్జెక్టు మనకు సరిపోతుంది.' నువ్వు చెప్పింది నాకు చాలా బాగా నచ్చింది అమ్మ లీల అన్నారు.

ఒకసారి నాన్నగారు రామకృష్ణుడు గురించి అరుగుమీద చెబుతున్నారు. అప్పుడే రాజకీయ నాయకులు ఎవరో ఇద్దరు వచ్చారు నాన్నగారు కొద్దిసేపు వారితో మాట్లాడిన తరువాత, వారు వెళ్ళిపోయాక, నాన్న గారు "దీన్నే రామకృష్ణుడు ఈగల భక్తి అన్నాడు. ఇప్పటివరకు మనం సబ్జెక్ట్ చెప్పుకున్నాము, కానీ వారు వచ్చేసరికి రాజకీయాలు మాట్లాడవలసి వచ్చింది".

లీలగారు(భక్తురాలు): నాన్నగారు! రామకృష్ణుడుకి చెయ్యి విరిగినప్పుడు డాక్టర్లు అందరిని నా చెయ్యి ఎప్పుడు తగ్గుతుంది అని తిట్టేవారు. ఏ భక్తులు వచ్చినా నా చెయ్యి ఎప్పుడు తగ్గుతుంది, నేను అమ్మకి దణ్ణం ఎప్పుడు పెట్టుకోవాలి అని అడుగుతూ ఉండేవారు. అప్పుడు ఒక భక్తుడు రామకృష్ణుడితో, స్వామి మీరే భగవంతుడు కదా! మీరు సంకల్పించుకుంటే తగ్గిపోతుంది అన్నాడు. దానికి రామకృష్ణుడు ఇది నాకు అమ్మ చేసిన మేలు నేను ఇలా ఉంటే లౌకిక భక్తులందరూ పారిపోతారు, నిజమైన భక్తులు ఉంటారు అన్నాడు. అలా మీరు కూడా మమ్మల్ని మాయ చేస్తున్నారు కదా అన్నాను.

నాన్నగారు: నవ్వుతూ, రామకృష్ణుడికి కపటం ఎలా ఉంటుందో తెలియదు అమ్మ, ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తాడు. ఇప్పుడు నువ్వు ఉన్నావనుకో నిన్ను పుస్తకం చదివినట్లు చదివేసి, నీలో ఏమున్నాయో అన్నీ చెప్పేస్తాడు. అంటే, ఎలా మాట్లాడాలో కూడా తెలియదు అమ్మ రామకృష్ణుడికి, వెనకాల భక్తులు ఎలా మాట్లాడాలో నేర్పించేవారు.

లీలగారు(భక్తురాలు): అలా రామకృష్ణుడు వైభవం నాన్నగారు చెప్పటం వలన అర్థమైంది కానీ లేకపోతే మనకు తెలియదు.

నాన్నగారు: అమ్మ లీలా, నువ్వు ఒకటిగా ఉన్నావా లేక రెండుగా ఉన్నావా?

లీలగారు(భక్తురాలు): నేను రెండుగా ఉన్నాను అని చెప్పాను.

నాన్నగారు: రెండు ఎందుకు అయ్యావు?.

లీలగారు(భక్తురాలు): దేహం నేను అనుకోవటం వలన నాన్నగారు అన్నాను.

నాన్నగారు: అందులో నుండి ఎలా విడువడగలవు?

లీలగారు(భక్తురాలు): గురువు దయవల్లనే విడువడగలను గాని నా అంతట నేను రాలేను నాన్నగారు అన్నాను.

నాన్నగారు: గురువు దయ నీకు ఎలా కలుగుతుంది?

లీలగారు(భక్తురాలు): మాట, చేత,పని అంతా నా గురువు చెప్పినట్టు నేను జీవించగలిగితే నా గురువు దయ నాకు కలుగుతుంది నాన్నగారు అన్నాను.

నాన్నగారు: నువ్వు బానే చెప్పావు అమ్మ

ఒకసారి చించినాడ మీటింగ్ కి వెళ్ళాను నాన్నగారు లోపల హైదరాబాద్ భక్తులతో మాట్లాడుతున్నారు. నేను ఆ గుమ్మం దగ్గర నిలబడి ఉన్నాను. అక్కడే ఉన్న ఒక భక్తురాలు నన్ను చూసి, నాన్నగారు ఉన్న గదిలోకి పంపించారు. అక్కడ ఉన్న భక్తులను చూసి, వీరందరూ పెద్దవారు నాన్నగారు వారితో మాట్లాడుతున్నారు, ఇప్పుడు నాతో మాట్లాడుతారో లేదో, అని మనసులో అనుకుంటూ ఉన్నాను. ఈలోపు నాన్నగారు నాకు తృప్తి కలిగేలాగా పలకరించి లోపల గారెలు ఉంటే అవి నాతో తెప్పించుకొని ఆయన ఎదురుగా నన్ను తినమని నాకు ఇచ్చారు. తరువాత ప్రవచనానికి సమయం అయిందని ఆయన బయటకు వెళుతూ ఒక అడుగు వెనక్కి వేసి కళ్ళు పెద్దగా చేసి నా వైపు చూస్తూ, ఇప్పుడు శాంతిగా ఉన్నావా అని అడిగారు. అంటే అక్కడ లోపల ధనవంతులైన వారు ఉన్నారు. వారు పెద్ద వారు, వారు ఉన్నప్పుడు నాన్నగారు మనతో మాట్లాడతారా లేదా అనుకున్నాను కదా, అందుకు నాన్నగారు ఇప్పుడు శాంతిగా ఉన్నావా అనగానే, నాకు చాలా దుఃఖం వచ్చి, నా తండ్రిని నేను ఎంత భేద భావంతో చూశాను అనుకున్నాను. అలా నా మనసులో ఉన్న ఆ భేద భావాన్ని తొలగిస్తూ , నాకు ఆయన మీద ఉన్న విశ్వాసాన్ని మరింత ధృఢం చేశారు. మరలా ఎప్పుడూ నాకు ఆ తలంపు రాలేదు, మన లోపల ఉన్న పెద్ద , పెద్ద బండరాళ్లు లాంటి వాసనలను కూడా గురువు సమక్షంలో ఆయనే కరిగించేస్తారు. ఇప్పుడు నాన్నగారు చెప్పినట్లు మనం జీవిస్తూ, మనం కృప గురించి ఆలోచించకుండా కృషి పెంచుకుంటే, సులభంగా గడపలు దాటినట్టు మనం లోపల దాటేయగలుగుతాము. మధ్య మధ్యలో గొప్పులు తగులుతాయి తగిలిన ఆగకూడదు మనకి గమ్యాన్ని చూపించారు కదా నాన్నగారు.

నాన్నగారు: నువ్వు సాధనలో అభివృద్ధిలోకి రావాలంటే ఈ మూడు మాటలు నేర్చుకో లీల. 

1. దేహం వచ్చింది అంటే ప్రారబ్దం తప్పదు రాముడు అంతటివాడికే విధి తప్పలేదు, ఓర్పుతో భరించడం నేర్చుకో అన్నారు. 

2. రెండవది ఏంటంటే, నీ దైనందిన జీవితంలో వ్యక్తి భావన పల్చబడేటట్టు చూసుకో. 

3. మూడవది ఏంటంటే, ప్రపంచం మాయ అనే స్ఫురణ కలిగి ఉండు. 

ఈ మూడు నీ దైనందిన జీవితంలో ఆచరిస్తూ వెళుతూ ఉండు. జ్ఞానం మాట గాని, ఆ తలంపు గాని వద్దు. నీ పని నువ్వు చేసుకుంటా ఉంటే, సహజంగా అయిపోతుంది. అసలు నీకు ఈ ప్రయాణంలోనే శాంతి, ఆనందం వచ్చేస్తుంది.

నాన్నగారు ఒక 30 నిమిషాలు మమ్మల్ని కూర్చోమని ఈశ్వరుడు అందరి హృదయాలలో ఉండి, బొమ్మలను ఆడిస్తున్నట్టు జీవులను ఆడిస్తున్నాడు, ఎక్కడ నుండి ఆడిస్తున్నాడు అని అన్వేషణ మొదలు పెట్టండి.ఈ అన్వేషణ వలన మీకు ఏకాగ్రత వస్తుంది. ఈ అన్వేషణ ఎటువంటిదంటే, మీ చేతిలో డబ్బులు ఉంటే, మీరు వస్తువు ఎంత సులభంగా కొనుక్కుంటారో, అలా ఈ అన్వేషణ మిమ్మల్ని సులభంగా సత్య వస్తువు దగ్గరకు చేరుస్తుంది అని చెప్పారు. ఏదైనా ఒక మాట నాన్నగారు చెబితే, సత్సంగంలో నాలుగు రోజులు వరుసగా దాని గురించే మాట్లాడుకునే వాళ్ళం. నాన్నగారు అలా చెప్పించే వారు. అలా కొద్ది రోజులు ఉనికి గురించే మాట్లాడాను. సత్యంగా ఉండటం మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అసత్యం దూరం అయిపోతుంది అని నాన్నగారు చెప్పారు. ఉనికి గురించి నాలుగు రోజులు చెప్పేసరికి అది నాకు అనుభవం ఉండాలి కదా నాన్నగారు అనుకున్నాను. నాలుగవ రోజు స్వప్నంలో నేను ఇంట్లో రోజూ అభిషేకం చేసే గిరి సృష్టి అంతా ఆక్రమించేసి ఉంది. నేను చాలా పెద్దగా అయిపోయాను. ఆ వెనకాల ఉనికి యొక్క వెలుగు ఉంది. దాని ఆధారంతో ఈ సృష్టి అంతా కనిపిస్తోంది. ఆ ఉనికి ఉండటం వలన ఈ సృష్టి జరుగుతుంది అని ఒక శబ్దం వినిపించింది. అలా నాన్నగారు సత్సంగంలో చెప్పుకున్న వాక్యాన్ని చివరలో ఆచరణలో చూపిస్తూ ఉండేవారు.

ఈ జన్మలో మనము ఎవరో మనం తెలుసుకోవడానికి ఆ రుచి ఒక్కసారైనా చూడాలి అని అనుకోవడంలో తప్పేముంది అనిపిస్తుంది. నాన్నగారు వినయం, ప్రేమ నేర్చుకోమన్నారు. మనం సత్యం వైపు నడుస్తూ ఉంటే, ఈ దైవీసంపద అంతా దానంతట అదే వస్తుంది. నాన్నగారు ఎవరు ఎవరికీ ఏమీ కారు అనే వాక్యాన్ని మంత్రం కింద అనుకోమనేవారు. మన జీవిత విధానంలో మన నాన్నగారు చెప్పినట్లు జీవిస్తేనే ఎంతోకొంత మన అంతర్ముఖ ప్రయాణానికి సాధ్యం అవుతుంది. ఒకసారి నాన్నగారి దగ్గరకి ఒక భక్తులు వచ్చి నాన్నగారు మీరంటే అందరికీ విశ్వాసం ఉంది. నాకు ఎందుకు అంత విశ్వాసం లేదు అని అడిగారు. అప్పుడు నాన్నగారు అంత పూర్ణ విశ్వాసం ఎవరికీ ఉండదు అమ్మ, పూర్ణ విశ్వాసం జ్ఞానంతో సమానమైనది అని, రెండు మూడు సార్లు విశ్వాసం కలిగి అది జారవిడుచుకంటే, అది జారిపోతుంది ఉండదు. విశ్వాసం ఆ రోజుకారోజు పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి అది ఒక్కసారిగా కలుగదు అన్నారు. భగవాన్ మనసుమీద నిఘా అంటారు, నాన్నగారు మన సబ్జెక్ట్ అంతా మనసుకు ట్రైనింగ్ అన్నారు. అంటే నిఘా వేరు, మనసు ట్రైనింగ్ వేరు కాదు. నాన్నగారు కిందకి దిగి మన స్థాయికి వచ్చి, మనకు అర్థం అయ్యేలాగా అన్ని మార్గాలు నుండి చెప్పుకొచ్చారు. అదే భగవాన్ ఒక్క మాటతో చెప్పేస్తారు.

నాన్నగారు శరీరం వదిలిపెట్టే ఒక వారానికి ముందు నేను వైజాగ్ నుండి చూడడానికి వచ్చాను. వచ్చేటప్పుడు ట్రైన్ లో నాన్నగారు ఎలా ఉంటారో అనే భయం వలన రాత్రి నిద్ర పట్టలేదు. కానీ తెల్లవారుజామున కొంచెం నిద్రపట్టి ఒక స్వప్నం వచ్చింది. స్వప్నంలో నాన్నగారు, నేను ఉన్నాము. ఎవరో ఇద్దరు భార్యాభర్తలు కొత్తవాళ్ళు నాన్నగారి పాదపూజ చేసుకోవడానికి వచ్చారు. నేను నాన్నగారికి కుర్చీ వేసి అన్నీ పెట్టాను, నాన్నగారు వచ్చి కూర్చున్నారు. నేను ఆ భార్య, భర్తలు తో ఇదే ఆఖరి పూజ! ఇకనుండి పాద పూజలు లేవు అని చెప్పాను. నాన్నగారు తుండు నాకు ఇస్తే, అది పట్టుకున్నాను. వారిద్దరూ పాదపూజ చేసుకున్న తరువాత నాన్నగారు ఇంట్లోకి వెళ్ళిపోతూ ఆయన చెయ్యి నా శిరస్సు మీద ఎంతోసేపు నొక్కిఉంచారు. అదే నాన్నగారు నన్ను చివరిసారిగా ఆశీర్వదించారు. నాకు చాలా తృప్తిగా అనిపించింది. నాన్నగారు మన పై చూపించే దయని మన మాటలలో తెలియ చేయలేము. జీవితంలో ఏ విధంగా జీవించాలి, ఎలా ఉండాలో అన్నీ నేర్పించారు. జ్ఞానంలో అందరూ సమానమే, జ్ఞానం వచ్చినవారు అందరూ ఒకటే. కాని మన స్థాయికి దిగి వచ్చి, మనతో మమేకమై, మనకి అంత ప్రేమగా చెప్పినవారు నాన్నగారు తప్ప మరి ఎవరు ఉండరు అనిపిస్తుంది.

No comments:

Post a Comment