Sunday, August 1, 2021

"గురువు స్మరణ, సహజ ధ్యానం" - (By లీల గారు)

ఒకసారి నేను నాన్నగారి ఇంటికి వెళ్ళేసరికి నాన్నగారు అమలాపురం మాస్టర్ తో మాట్లాడుతూ, నన్ను చూసి లోపలకి రమ్మని ఇలా అన్నారు, "అమ్మ లీలా! నది ప్రవాహంలో పుల్లలు కొట్టుకెళుతూ ఉంటే పక్షులు వాలతాయి, కొన్ని పక్షులు వాలిన పుల్లలు ఆవలి ఒడ్డుకు చేరిపోతాయి. కొన్ని పక్షులు వాలిన పుల్లలు నీటిలో మునిగిపోతాయి అని చెప్పి అలా నువ్వు, భీమవరం పార్వతి సబ్జెక్టు చెప్పగలరు కానీ చెప్పటానికి భయపడుతున్నారు. మునిగిపోతారు ముందు మీరు ఇద్దరు ధైర్యంగా జీవించడం నేర్చుకోండి అని చెప్పి, తెలివి మైండ్లో ఉంటుందమ్మా, హృదయంలో జ్ఞానం ఉంటుంది. తెలివి ముఖ్యమే కానీ, జ్ఞానం హృదయంలో ఉంది అనే భావన ముఖ్యము", అన్నారు నాన్నగారు.

ఆ వాక్యం నాకు అద్భుతంగా అనిపించింది. అంటే హృదయంలో జ్ఞానం ఉంది అనే భావనకి దగ్గరగా మనము ఉంటే, భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు. ఆ భావన దగ్గర నేను ఉండగలిగితే, నాన్నగారంటే చైతన్యమే కాబట్టి అక్కడ ఉన్నది నాన్నగారే కావున నేను ఏమి చేసినా నాన్నగారే అనిపిస్తుంది. మొదట్లో నాన్నగారు నన్ను సత్సంగం చెప్పమన్నప్పుడు నాకు అప్పటికి భాషణలు అర్థం కాలేదు. అప్పుడు నాన్నగారితో నాన్నగారు నేను చెప్పను, నేను తప్పు చెప్పాను అనుకోండి, అది నమ్మేస్తారు కదా అన్నాను.

"లీల! భగవంతుని మీద భారం వేసి చెప్పు. అప్పుడు నీ నోటి ద్వారా తప్పు వచ్చినా భగవంతుడు ఏం చేస్తాడు అంటే, వినేవారికి అర్థం చేసుకునే బుద్ధిని ఇచ్చి వారికి అర్థం అయ్యేలా చేస్తాడు. నువ్వు అక్కడ భయపడవద్దు" అని చెప్పారు.

ఒకసారి నాన్నగారి దగ్గరకి వెళ్ళినప్పుడు చిన్న జరీ అంచు చీర కట్టుకుని వెళ్ళాను నాతో మాట్లాడేటప్పుడు చీర వైపుచూస్తూనే ఉన్నారు. ఆఖరున, "అమ్మ లీల మనము ధరించే వస్త్రాలు దగ్గర నిరాడంబరంగా ఉండాలి అమ్మ", అన్నారు. అప్పటి నుండి చీరల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండేదాన్ని. అంటే నాన్నగారు మనకు ఏదైనా చెబితే , ఆయన మాటల ద్వారా శక్తిని మనకి అనుగ్రహిస్తారు. అందువలన ఆయన దయతో ఆయన చెప్పినది ఆచరించగలుగుతాము. అలా ప్రతి విషయంలోనూ, ప్రతిక్షణం నాకు బోధ చెబుతూనే ఉన్నారు.

ఒకసారి నాన్నగారు అడిగారు, "ధ్యానం చేస్తావా అమ్మ?" తక్కువ నాన్నగారు, ఎప్పుడైనా చేస్తాను అని చెప్పాను.

నాన్నగారు: "ఇప్పుడు నువ్వు ధ్యానానికి కూర్చున్నావనుకో, అన్ని తలంపులని నొక్కిపెట్టి,అక్కడ నీ ఇష్టదైవాన్ని పెట్టుకుని ఏకాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తావు. నువ్వు కొంత సేపు చేసి బయటకు వచ్చిన తరువాత, అక్కడ నువ్వు నొక్కిపెట్టి ఉంచిన తలంపులన్నీ విజృంభిస్తాయి. అలా కాదు నేను నీకు సహజ ధ్యానం చెప్తానమ్మ అని, నువ్వు ఏది చేస్తున్నా, నువ్వు కాని తలంపు ఏది వచ్చినా ఆ తలంపుని విడదీసి నువ్వు వినే మహాత్ముల బోధ అక్కడ పెట్టి, అప్పుడు నీ మనసుని నువ్వు ఎక్కడైతే ఉండాలి అనుకుంటున్నావో అక్కడ పెట్టుకుంటూ ఉండి అలా జీవిస్తూ ఉండు, అదే సహజ ధ్యానం అమ్మ అని, అది నిన్ను తొందరగా నీ గమ్యానికి చేరుస్తుంది" అన్నారు.

నాకు పిల్లలు జ్ఞాపకం వస్తే, నాన్నగారు ఎవరూ ఎవరికీ ఏమీ కారు అనే వాక్యం చెప్పారు కదా, అనుకోని దానిని స్ఫురణకు తెచ్చుకొని వాళ్ళు కూడా గురువు బిడ్డలే అనుకొని వారిని ఆయనే చూసుకుంటారు అని మనసుకి చెప్పుకొని నాన్నగారి స్మరణలోకి వెళ్ళిపోవాలి అనుకున్నాను. ధ్యానంలో తలంపులని అణిచిపెట్టి ఉంచుతాము, కానీ ఇక్కడ తలంపులని విడదీస్తూ ఏదైతే సత్యమో దాని వైపు తిరుగుతాము.

నాన్నగారు! మనస్సు అంతర్ముఖం అవుతోంది గాని నేను అక్కడ దానిని స్థిరపరచలేక పోతున్నాను అని అడిగాను. అప్పుడు నాన్నగారు, "నీకు నేను ఆ పని చేసి పెడతానులే నువ్వు నీ పద్ధతి లో ఇప్పుడు ఎలా చేసుకుంటున్నావో అలా సాధన చేసుకోమ్మ" అని చెప్పారు. అంటే అక్కడ మనల్ని లోపలికి తీసుకువెళ్ళడం కోసం అలా బుజ్జగిస్తూ ఉండేవారు. మన పిల్లలు రెండు మూడు సార్లు బాడి చేసుకుంటే, శుభ్రం చేయడానికి విసుగు వచ్చి వదిలేస్తాం. కానీ నాన్నగారు మనం ఎన్నిసార్లు బాడి చేసుకున్నా, ఎంత తింగర పని చేసినా కానీ అమ్మ, అమ్మ అని ప్రేమగా అంటూ, మనల్ని బురదలో నుంచి బయటకు తీసుకువస్తూ ఉంటారు.

నాన్నగారు: "నీకు మరలా ఈ భూమి పైకి రావాలని ఉందా?. నీకు ఇంక బాధ్యతలు ఏమీ లేవు కదా, నువ్వు పన్ను కట్టక్కర్లేదు కదా అని నీకు ఆలోచనలు రావట్లేదు కదా" అన్నారు.

లీలగారు(భక్తురాలు): ఆలోచనలు వస్తున్నాయి నాన్నగారు అని చెప్పాను

నాన్నగారు: "ఏమి ఆలోచనలు వస్తున్నాయి?" అని అడిగారు.

లీలగారు(భక్తురాలు): జరిగిపోయిన గొడవలు గుర్తుకొస్తున్నాయి నాన్నగారు అన్నాను

నాన్నగారు: "జరిగిపోయినవి గుర్తుకు రాకూడదు, నీకు సమయం వృధా అయిపోతుంది అని చెప్పి, భగవాన్ గురించి నాకు చెబుతూ మనము కృష్ణుడు లీలలు గురించి చాలా అద్భుతంగా చెప్పుకుంటాము కానీ భగవాన్ భగవద్గీతలో కృష్ణుడు లీలలను అబద్ధం అని కొట్టిపారేశారు అమ్మ అని చెప్పి, భగవాన్ అంటే మనకు ఇష్టం కదా, నువ్వు జరిగిపోయిన గొడవలు ఇంకా గర్తు వస్తున్నాయి అంటున్నావు అవి అబద్ధం అన్నీ మర్చిపో" అన్నారు.

అప్పటి నుండి నాకు జరిగిపోయిన గొడవలన్నీ జ్ఞాపకం వస్తూ ఉంటే, నా తండ్రి కృష్ణుడు లీలలే అబద్ధం అన్నారు కదా, ఇవన్నీ కూడా అబద్ధమే అనుకుంటూ ఉండేదాన్ని, అలా నాన్నగారు నాకు ఆచరణలో పెట్టుకోవడానికి, నాకు అర్థం అవ్వడానికి ఉపమానాలు చెప్పి దానిని ఆచరణలో పెట్టుకోవడానికి సహకరించేవారు. ఒకసారి నాన్నగారు మహేంద్రనాథ్ గుప్తా గురించి చెబుతూ, రామకృష్ణ పరమహంస శరీరం వదిలేసిన తరువాత మహేంద్రనాథ్ గుప్తా 30 సంవత్సరాలు జీవించారు. ఆయన్ని ఒకరు వచ్చి ఇప్పుడు మీ గురువుగారు లేరు కదా మరి నీ సాధన ఏంటి అని అడిగారు. అప్పుడు ఆయన మా గురువు గారి గురించి చదువుతాను, మా గురువు గారి గురించి రాసుకుంటాను, మా గురువు గారి గురించి మాట్లాడతాను, మా గురువుగారిని ధ్యానం చేసుకుంటాను నా హృదయంలో నా గురువుకి తప్ప ఎవరికీ చోటు ఇవ్వను ఇదే నా సాధన అని చెప్పారు. అని నాన్నగారు నీకు అర్థం అయిందా లీలా అన్నారు, అంటే జరిగిపోయిన గొడవలు గుర్తొస్తున్నాయి అని చెప్పాను కదా, దానికి హృదయంలో గురువుకు తప్ప ఇంక దేనికి చోటు ఉండకూడదు అని నాకు తెలియజేశారు. హృదయంలో గురువుకి చోటు ఇచ్చేస్తే, వేరే దానికి చోటు ఉండదు కదా. నాన్నగారు మరుజన్మ రీలు మన చేతిలో ఉంది అని అంటారు ఆ వాక్యం నాకు చాలా ఇష్టం.

నాన్న గారు: లీలా! నువ్వు ఇప్పుడు బాబాకు ఐదు రూపాయలు ఇవ్వాలి అనుకున్నావు అనుకో, అది నువ్వు మర్చిపోయావు అనుకో ఏదో ఒక రోజు నీ దగ్గరకు వచ్చి నా అయిదు రూపాయలు ఇవ్వు అని బాబా అడుగుతాడు అప్పుడు నువ్వు ఏమి చెప్తావు అమ్మ అని, అలాగే తలంపుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రతి తలంపుకి ఈ జన్మలో కాకపోయినా మరో జన్మలో అయినా నువ్వు సమాధానం చెప్పి తీరాలి ఎందుకంటే మరుజన్మ రీలు నీ చేతిలోనే ఉంది. నీ చేతిలో ఉంది కాబట్టి నువ్వే బాగు చేసుకో, ఎవరూ వచ్చి నిన్ను బాగుచేయరు. నీ ప్రతి అడుగు కూడా ఆచితూచి వెయ్యి. కత్తి అంచు మీద ఎంత జాగ్రత్తగా నడుస్తాము, అంత జాగ్రత్తగా సాధనలో ఉండాలి ఒక్క తలంపే కదా అని జారవిడుచుకుంటే అది ఎన్నో తలంపులను తీసుకు వచ్చేస్తుంది అన్నారు.

విరూపాక్ష గుహలో వెలుగు చూడలేకపోయాను అని చెప్పాను కదా, దానికి కృష్ణుడు భగవద్గీతలో దివి సూర్య సహస్రస్య అంటాడు అంటే, వేయి సూర్యుల కాంతి ఒకేసారి భూమి మీద ప్రసరిస్తే ఎలా ఉంటుందో, ఆ పరమాత్మ కాంతి అలా ఉంటుంది అని ఆ కాంతిని కృష్ణుడు భగవద్గీతలో పదకొండవ అధ్యాయంలో పోలుస్తాడు. అటువంటి పరమాత్మ మన అందరి హృదయములలో అంతర్యామిగా ఉన్నాడు. అటువంటి కాంతి నేను ఎలా చూడగలుగుతాను. మన చేతిలో ఉన్న పని ఏమిటంటే, మన మనసులో మాలిన్యాన్ని కడుక్కోవటమే మన పని. సహజ ధ్యానమే మనల్ని గమ్యానికి తీసుకువెళ్ళి పోతుంది. నాన్నగారు చెప్పినట్లు జీవిస్తే సరిపోతుంది. మనకు అన్ని కోణాలు వికసిస్తాయి.

ప్రవచనం ముగిసిన తరువాత నన్ను పిలిచి ఇవాళ నీకు భగవాన్ మాట నచ్చిందా అమ్మ, మనకి ఇప్పుడు అర్ధం అయినా, అవ్వక పోయినా వంద సంవత్సరాల తర్వాత తరం వారికైనా అర్థం అవుతుంది అని చెప్పేసి వెళ్ళిపోయారు. నువ్వు ఇప్పుడు ఈ మార్గంలో ఉండి ఇలా తరించాలి అని నాన్నగారు నాకు చెప్పారు అనుకున్నాను.

No comments:

Post a Comment