Sunday, August 29, 2021

"ప్రేమస్వరూపులైన శ్రీనాన్నగారితో నా అనుబంధం" - (By శ్రీదేవి (బేబి), హైదరాబాద్)

జూలై 1991వ సంవత్సరం, అప్పుడు నేను జీవితంలో సమస్యలతో సతమతమవుతున్న రోజులు. చాలా సార్లు, నాకే ఎందుకు ఈ కష్టాలు, వీటికి అంతం ఉందా అనుకొనేదానిని. ఒకరాత్రి అతిగా ఆలోచిస్తూ అలసి నిద్రలోకి జారాను. ఒక కల ఎంతో స్పష్టంగా ఇప్పటికీ గుర్తు ఉంది. ఒక పెద్ద ఇంటిలో ఒక చిన్న గుంపు వ్యక్తులు ఎవరో మహాత్ముడి కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఆయన పుట్టపర్తి సత్య సాయిబాబా. వారిని చూడగానే నాలో మొదటి తలంపు, ఎంత బక్కపలచగా ఉన్నారు! బాబాని ఫోటోలో మాత్రమే చూసి చాలా బలిష్టమైన శరీరం అనుకొనేదానిని. ఆయన వేసుకున్న కాషాయ దుస్తులు పాదాలవరకూ కాకుండా, శిరిడీ సాయిబాబా లాగ మోకాలు దిగువ వరకే ఉన్నాయి. జుట్టు కూడా పలుచగా, ఫోటోలో ఉన్నట్టు ఒత్తైన గుబురు జుట్టులా కాకుండా, ఉంది. (ఈ వివరాలు అన్నీ ఇప్పటికీ స్పష్టంగా జ్ఞాపకం ఉన్నాయి. తరువాత పుట్టపర్తిలో దర్శనం చేసుకున్నప్పుడు కూడా సరిగ్గా కలలో కనిపించిన రూపమే). ఆ కలలో బాబా ఆ ఇంటిలో బస చేశారు. ఆ రోజు అంతా జరిగిన కార్యక్రమములో నేను ఒక ప్రేక్షకురాలిగా ఉన్నాను. ఆ కార్యక్రమము అంతా సరిగ్గా నాన్నగారు భక్తుల ఇళ్ళలో బస చేసినప్పుడు జరిగే క్రమములాంటిదే అని నాన్నగారితో అనుబంధం ఏర్పడిన తరువాత నాకు అర్ధం అయ్యింది. తరువాత ఆ దృశ్యం మారిపోయింది. నేనూ బాబా ఇద్దరమే కొండల మధ్య ఒక పచ్చని మైదానంలో ఉన్నాము. బాబా పక్కకు తిరిగి మోచేతిని నేలపై ఉంచి, అరచేతిపై తల ఆనించి పడుకొని ఉన్నారు. నేను పక్కనే కూర్చొని నా బాధలు కష్టాలు చెపుతూ, ఇక వాటిని భరించే శక్తి లేదు అన్నాను. “ఇంకొక మూడు నెలలు ఆగు” అని బాబా ఇంకోవైపు తిరిగిపోయారు. నిద్ర నుంచి మేల్కొని, ఎప్పుడూ లేనిది ఈ బాబా కలలోకి వచ్చారేమిటి అని ఆశ్చర్యపోయాను. అప్పటివరకూ నాకు స్వాములు బాబాలు అంటే అయిష్టత, పుట్టపర్తి బాబా అసలే ఇష్టం ఉండేది కాదు. ఏదైనా పుస్తకంలో వారి బొమ్మ కనపడితే వెంటనే పేజీ తిప్పేసేదానిని.

ఇది భగవంతుడి ప్రణాళిక. ముందు నా మనస్సులోనుంచి గురువులు, బాబాల పట్ల ఉన్న వ్యతిరేక భావాన్ని తొలిగించి, నాకు ఏ బాబా పట్ల ఎక్కువ అయిష్టత ఉందో, వారి ద్వారానే నాకు రాబోయే మంచి రోజులు, నా గురువుతో కలయిక, సూచన ఇచ్చారు. త్వరలోనే పుట్టపర్తిలో బాబాని ఒకసారి దర్శించుకొని, ఇప్పటికీ ఆయనని కృతజ్ఞతా భావంతో తలుచుకుంటాను.

రెండు నెలల తరువాత నాకు అనుకూలమైన ఉద్యోగం దొరికింది; అది ఒకరిమీద ఆధారపడకుండా జీవించటానికి ఆలంబన. ఇంకొక నెల తరువాత సెప్టెంబరు నెలలో నాన్నగారిని మొదటి సారి దర్శించాను. మా చుట్టాలలో కొంతమంది నాన్నగారి భక్తులు ఉన్నా, అప్పటివరకూ నాన్నగారి పేరు కానీ వారి గురించి కానీ నాకు తెలియదు.

అప్పట్లో నాన్నగారు నల్లకుంట సావిత్రిమామ్మగారి ఇంటిలో కానీ, బేగంపేటలో లక్ష్మి గారి అమ్మగారి ఇంటివద్ద కానీ బస చేసేవారు. కొత్తలో మా అమ్మ బలవంతం మీద ఇబ్బందిగా అయిష్టంగానే వెళ్ళేదానిని. ఈ విషయంలో అమ్మపట్ల ఎప్పుడూ కృతజ్ఞత గానే ఉంటాను. ఒకటి రెండు సార్లు నాన్నగారి ప్రవచనం విన్నాను. ఒక సారి ప్రవచనం ముగిసిన తరువాత, నాన్నగారికి నమస్కరించి బయటికి వెళ్తుంటే వెనక్కి పిలిచారు. నా ప్రవచనం నీకు నచ్చిందా అమ్మా, ఏమిటి ఈ ముసలాయన చెప్పిన మాటే మళ్ళీ మళ్ళీ చెపుతారేంటి అనుకున్నావా అని చిరునవ్వుతో అడిగారు. నేను పట్టుబడినట్లు కంగారు పడ్డాను, ఏంచేతంటే నాకు అదే తలంపు వచ్చింది. తరువాత నాన్నగారే వివరించారు, విన్న మాట అందరికీ హృదయానికి పట్టేవరకూ రిపీట్ చెయ్యాలి, ఎందుకంటే అందరికీ విషయం ఒకే స్థాయిలో అర్థం అవ్వదు.

కొద్ది రోజుల తరువాత నాన్నగారితో వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశం వచ్చింది. అది కూడా అమ్మే ఏర్పాటు చేశారు. అప్పుడు కూడా ఆవిడతో గొడవపడ్డాను నాకు చెప్పకుండా ఏర్పాటు చేసినందుకు! అయినా నాన్నగారిని కలిసాను. నాన్నగారు నాకేమైనా చెప్పాలని ఉంటే చెప్పమని ప్రోత్సాహంగా మాట్లాడారు. ఒకేసారి గట్టుతెగినట్టు ప్రవాహంలా నా పరిస్థితి అంతా వివరించాను. నాన్నగారు నావైపు దయగా చూస్తూ, ఎంతో సహనంగా ప్రశాంతంగా, నేనుచెప్పిందంతా విన్నారు. అసంకల్పితంగా నానోటినుంచి ఒక మాట వచ్చింది, “నాన్నగారూ నా కష్టాలు పోగొట్టమని ఇదంతా మీకు చెప్పటం లేదు, జీవితంలో వచ్చే కష్టాలని ఎదుర్కొనే శక్తిని ఇవ్వండి” అని. ఈ మాట చెప్పాలని ఈ ఆలోచన కానీ నాకు లేదు, నా ప్రమేయం లేకుండానే ఈ మాటలు వచ్చాయి. నాన్నగారి దయ, ఆయన కృపాకటాక్షాలు, నాలోపల లోతులలో దేనినో కదిలించి ఈ మాటల రూపంలో వచ్చాయి అని నా నమ్మకం.

నేను ఈ మాటలు అనగానే నాన్నగారి వదనం ఆనందంగా విప్పారింది. వెరీ గుడ్ అమ్మా వెరీ గుడ్ అన్నారు మళ్ళీ మళ్ళీ. నీకు తప్పకుండా సుఖం శాంతి కలుగుతాయి, ఇకనుంచి అంతా బాగుంటుంది అన్నారు. అమృతవాక్కులు పుస్తకం చదువు నీకు ఉపయోగపడుతుంది అన్నారు. నీకు ఎప్పుడు రాయాలనిపిస్తే అప్పుడు నాకు ఉత్తరాలు రాస్తుండు అని ఆయన పోస్టల్ అడ్రెస్ ఒక కాగితం మీద రాసిచ్చారు. ఇదంతా భగవంతుని అనుగ్రహం - ప్రాపంచిక జీవితానికి ఒక ఆధారం, ఆధ్యాత్మిక నిర్దేశం కోసం సద్గురువు దొరకటం.

తరువాత అవకాశం చిక్కినప్పుడల్లా నాన్నగారిని కలుస్తుండేదానిని, ఒక సంవత్సరంలో ఆయనతో బాగా అనుబంధం పెరిగింది. ఎంతో సున్నితంగా ఆయనే తనవైపు ఆకర్షించుకొన్నారు. నేను దూరంగా కూర్చొని ఉంటే ఎంతో ఆప్యాయంగా పిలిచి పక్కన కూర్చోపెట్టుకొనేవారు. మా ఇంటిలో వాళ్ళు కానీ, నా తెలిసినవాళ్ళు వెళ్లినప్పుడు, నాగురించి వాళ్ళని అడిగేవారు. నా ఉద్యోగం, ఆ సాధన గురించి ఆరా తీసేవారు. ఎప్పటికప్పుడు నాకు సూచనలు సలహా ఇస్తుండేవారు.

నాకు చిన్నతనము నుంచీ ఆధ్యాత్మికత పట్ల ఆకర్షణ ఉండేది, ఆధ్యాత్మిక గ్రంధాలు చదవటం అంటే ఇష్టం. అప్పుడప్పుడూ స్వామి చిన్మయానంద వంటి గురువుల ప్రవచనాలూ విన్నాను. అయితే నేను ప్రయత్నపూర్వకముగా గురువు కోసం చూడలేదు. నా గురువు, కాదు నా తండ్రి, తానే నాకు చేరువయ్యారు. అది వారి ప్రేమ, వారి కరుణ.

వారు పరిపూర్ణమైన గురువు. తన కృపాదృష్టితో నన్ను సరైన మార్గంలో ఉంచి, ఎంతో దయ చూపారు. అందరిపైనా అదే కరుణ, అది వారి స్వభావం. నాన్నగారు మా కుటుంబంలో అందరినీ ఆశీర్వదించి కరుణ కురిపించారు. నా తల్లి తండ్రులు, పిన్ని కూడా నాన్నగారికి సన్నిహిత భక్తులు. మిగతా కుటుంబసభ్యులు కూడా నాన్నగారిని తరచూ దర్శించి ఆయన ఆశీర్వాదం పొందారు. మా అమ్మ, ఇందిరగారికి, పది పదిహేను సంవత్సరాలు నాన్నగారు హైదరాబాద్ వచ్చినప్పుడు, వారికి భక్తులకి తన ఇంటిలో వసతి ఏర్పాటు చేయటం ఒక అపూర్వ అవకాశం, అరుదైన అదృష్టం.

అనుభవాలు


ఇరువైయారు సంవత్సరాలలో, నాన్నగారి సమక్షంలో ఎన్నో హృదయానికి హద్దుకొనే అనుభవాలు, ఎన్నో పాఠాలు. ప్రతి అడుగులో చేయూతనిస్తూ, ఆధ్యాత్మిక అభివృద్దికి, శాంతి, ఆనందాలకు దారి చూపారు. నాన్నగారి వద్దకి రాకముందు నాకు భగవంతుడు, ఆధ్యాత్మికత వంటి విషయాల గురించి సరైన అవగాహన ఉండేది కాదు. నాలో లోపాలు భౌతికజీవితంలోనూ భగవంతుడివైపు వెళ్ళటానికి కూడా అడ్డుగోడలుగా ఉండేవి.

నాకు మనస్సు ఫైల్యూర్ (ఓటమి) ఇష్టపడేది కాదు. ఏది చేసినా పర్ఫెక్ట్ గా ఉండాలి, ఎవరైనా మాట అంటే పడేదానిని కాదు. వ్యతిరేక పరిస్థితులు ఎదుర్కొలేని పిరికితనం. వీటివల్ల ఆత్మ విశ్వాసం ఉండేది కాదు. ఆత్మ న్యూనతా భావంతో ఎవరితో కలిసేదానిని కాదు. పైగా ప్రతి విషయానికి నన్ను నేను కించపరుచుకోవటం, చిన్నబుచ్చుకోవటం, అవి చాలా మంచి లక్షణాలు అనుకోవటం! ఇవి నెగెటివ్ క్వాలిటీస్ అని, మనస్సుకి రోగలక్షణాల వంటివి అని తెలియదు. నాన్నగారు ఈ జబ్బులకు ఒకటి తరువాత ఒకటి, ట్రీట్ మెంట్ మొదలుపెట్టారు. నా ఆలోచనలని సరిచేసి ఒక్కొక్కటీ తొలిగించటం మొదలుపెట్టారు.

ఇంకో సందర్భంలో S.R. నగర్ లో ఇప్పుడున్న అపార్ట్మెంటులు కట్టకముందు పాత ఇంటికి నాన్నగారు వచ్చారు. నేను ఆయనకి నమస్కరించగానే మళ్ళీ అదే తీక్షణమైన చూపుతో “నిన్ను నువ్వు హింస పెట్టుకోవటం కూడా జీవ హింసతో సమానం” అని తీవ్రంగా అన్నారు. వెంటనే ఉలిక్కి పడ్డాను, అవును కదా, నన్ను నేను కించపరుచుకోవటం కూడ ఒక రకమైన అహంకార లక్షణమే! అందరిలో ఉన్న జీవుడే నాలో కూడా ఉన్నది, అందరిలో ఉన్న చైతన్యమే నాలో కూడా ఉంది. ఇతరులలో మంచిని గుర్తించాలంటే, ముందు నాలో అది గుర్తించాలి. నామీద నాకు విశ్వాసం ఉండాలి. ఇవి నా దృక్పధాన్ని సరి చేసే సంఘటనలు.

నాన్నగారితో అనుబంధం, నాకు ఉద్యోగం రావటం ఒకేసారి జరిగాయి. అది నా జీవితంలో శుభ మలుపు – నాన్నగారి హోలీ కంపెనీతో పాటు, బ్రతుకు తెరువు, ఆర్ధిక స్వాతంత్రం రావటంతో జీవితానికి శాంతి సౌఖ్యాలు వచ్చాయి. కానీ అప్పటిలో అది గుర్తించే తెలివి లేక, నలుగురిలో ఉద్యోగం చేసే ధైర్యం లేక, నాన్నగారి దగ్గర ఉండిపోవాలని అనిపించేది. ప్రాపంచిక పనులన్నీ వదిలేస్తే ఆధ్యాత్మికంగా అభివృద్ది వచ్చేస్తుంది అనుకొనేదానిని. అది ఎస్కేపిజం (సమస్య నుండి పారిపోవటం) అని అప్పుడు తెలియదు. పని మానేసి ఏమి చేస్తావు అని అడిగేవారు నాన్నగారు. ఉద్యోగం మానకమ్మా, అది అవసరం. భగవంతుడు నీకు ఇచ్చిన అవకాశాలు ఉపయోగించు కొంటూ నువ్వు ఆత్మజ్ఞానం పొందాలి అని స్పష్టం చేశారు. నువ్వు శాంతిగా ఉంటే నేను సంతోషిస్తాను అనేవారు ఎంతో దయతో.

ఆయనతో అనుబంధం కలిగిన 5-6 సంవత్సరాలు తరువాత ఒక కష్టమైన నిర్ణయం తీసుకోవలసి వచ్చినప్పుడు, ఆయన పటం ముందు కూర్చొని, తండ్రీ నువ్వు ఏమైనా చెయ్యి, నేను ఎక్కడ ఉన్నా నాకు నీతో అనుబంధం చెదరకుండా నువ్వే రక్షించాలి అని ప్రార్ధించాను. విచిత్రంగా సమస్య వెంటనే విడిపోయింది.

నాన్నగారిని కలవక ముందు సమస్యలను తట్టుకొనే శక్తి లేక, “నాకే ఎందుకు ఇలా జరుగుతుంది” అనుకొనేదానిని. నాన్నగారు ఆ తలంపుని పూర్తిగా తీసేశారు. నాకు తెలియకుండానే, ఆయనని భౌతికంగా కలుసుకోక ముందే, ఈ సర్జరీ మొదలైపోయింది. అందుకేనేమో, మొదటి సమావేశంలోనే నా ప్రమేయం లేకుండా, ఆ ఆలోచనతో సంబంధం లేకుండా, “నా సమస్యని తీర్చమని కాదు, దానిని తట్టుకొని ఎదుర్కొనే శక్తి కావాలి” అనే పలుకులు నా నుండి వచ్చాయి. ఆ మాట అంటూనే నాకు ఆశ్చర్యం, నేనే అంటున్నానా అని. అయితే ఆ క్షణం నుంచే మనస్సులో ఆ భావం తగ్గిపోయి క్రమంగా తొలిగిపోయింది.

నాన్నగారు నాజీవితంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే ఎన్నోసంఘటనలు ద్వారా పాఠాలు నేర్పుతూ నాలో ఆత్మవిశ్వాసం కలిగించారు. మన ప్రయత్నం వల్ల తొలిగించుకోలేని అలవాట్ల నుంచి నాన్నగారి దయ వల్ల బయటపడి, ఆత్మవిశ్వాసం పెంచుకొని, జీవితంలో సంఘటనలని అంగీకరిస్తూ, శాంతిని పొందగలిగాను. నాన్నగారి దయ చాలా దూరం తీసుకొచ్చింది, క్రమంగా బాగుపడిపోతాము, ఆయన దయ ఎప్పుడూ ఉంది అని నమ్మకం కుదిరింది.

ఆచరణాత్మక ఉపదేశము


నాన్నగారి లో విశేషం ఏమిటంటే, భక్తుల పట్ల ఆయన చూపే పరిపూర్ణమైన ప్రేమ, ఇంకా విశిష్టమైన బోధ. ఆయనే ప్రేమ స్వరూపం. అపారమైన ప్రేమతో, కరుణాపూరిత మాటలతో, ఎన్నో సంఘటనల ద్వారా ఆధ్యాత్మిక పురోగతికి ఆచరణయోగ్యమైన దారిలో నడిపించారు.

ఆధ్యాత్మిక మార్గంలో ముఖ్యముగా అవసరమైనది సక్రమమైన ఆలోచన. రాంగ్ థింకింగ్ మన జీవితంలో కష్టాలకి ఎదురుదెబ్బలకి చాలావరకూ కారణం. నాన్నగారి టీచింగ్ ద్వారా మన ఆలోచనని సక్రమమైన మార్గంలో పెట్టడానికి చూసేవారు. భగవద్గీత లో కృష్ణ పరమాత్మ అర్జునుడి ఆలోచనని సరైన మార్గంలో పెట్టి, మనస్సుని లక్ష్యం పైన గురిపెటేటట్టు చేసినట్లే, నాన్నగారు కూడా జీవితం పొడుగునా మన తలంపులని సరైన మార్గం లోకి మళ్లించి, మన గురి చైతన్యం వైపు, స్వతంత్రమైన ఆనందం వైపు ఉండేటట్టు చూసేవారు.

నాన్నగారి టీచింగ్ లో ఇంకొక ముఖ్యమైన అంశం ప్రాక్టికాలిటీ (practicality). భక్తి, ఆధ్యాత్మికత అంటే అన్నీ విడిచిపెట్టి ఇల్లు వదిలివేయటం కాదు. అది రమణ మహర్షి వంటి శుద్ధాత్ములకి మాత్రమే వర్తిస్తుంది. ఆధ్యాత్మికత అంటే దైనందిన జీవితంలో మన ప్రవర్తన, జీవితంలో సంఘటలను ఎలా తీసుకొంటున్నాము చూసుకొని, వాటిని ఆధ్యాత్మిక పురోభివృద్దికి భక్తిని పెంచుకొని భగవంతుని వైపు ప్రయాణించటానికి ఉపయోగించుకోవటం.

ఇతరుల మీద ఆధారపడకుండా, బ్రతుకు తెరువుకి పని చేసుకోవటం అవసరమని, అన్నీ వదిలేసి బ్రతకటం కంటే, జీవితంలో సంఘటనలు ఎదుర్కొంటూ, వాటినుంచి పాఠాలు నేర్చుకొంటూ, మనకున్న సమయాన్ని భగవంతుడి వైపు ప్రయాణించటానికి ఉపయోగించుకోవాలని ఎన్నో రకాలుగా వివిధ సంధర్బాలలో బోధించారు. సన్యాసిగా అడివిలో బ్రతికేకన్నా, ఒక గృహస్థుగా జీవితంలో ఒడిదుడుకులని తట్టుకొంటూ సాధన చేసేవాడికి ఆత్మజ్ఞానం ముందు వస్తుంది అంటూ ఉండేవారు.

నాన్నగారితో అనుబంధం కలిగిన తరువాత, పెద్ద సమస్యలని తట్టుకో గలుగుతున్నాను, కానీ రోజువారీ చిన్న ఇబ్బందులు మాత్రం చికాకు పెడుతున్నాయి ఏమిటి విచిత్రంగా అని అనిపించేది. నాన్నగారు ఎన్నో సార్లు చెప్పేవారు, గురువు మన ప్రారబ్ధాన్ని తప్పించడు, అది ఎంత కష్టమైన బరువైనా అనుభవించాలి, కానీ గురువు కరుణతో ఆ బాధ తెలియకుండా మనని మత్తులో ఉంచుతాడని. అయితే మనకి పాఠాలు నేర్పటానికి, చెడువాసనలు తీసివేయటానికి మట్టుకు, దైనందిన జీవితంలో కుటుంబంలో వచ్చే సమస్యలను, సమాజంలో వ్యక్తుల వల్ల ఇబ్బందులను, మనమే ఎదుర్కొనేలా చేస్తాడు. తలుపు సందున పెట్టి నొక్కుతాడు భగవంతుడు, మనం బాగానే ఉన్నాము అనుకొంటే ఎవరో ఒకరిని గిల్లి వదిలిపెడతాడు అనేవారు కదా !

ఒకసారి నేను జిన్నూరు నుండి హైదరాబాద్ తిరుగు ప్రయాణం అవుతుండగా నాన్నగారు ప్రేమగా గుమ్మం వరకూ వచ్చి, “నీకు త్వరలో ఆత్మజ్ఞానం కలుగుతుంది అమ్మా, నువ్వు చైతన్య స్థితి పొందుతావు” అన్నారు. ఎంతో ఆనందం కలిగినా, ఆ మాటని చిరునవ్వుతో అందరికీ చెప్పినట్టే అన్నారు అన్నట్టు మామూలుగా తీసుకున్నాను. వెంటనే నాన్నగారు, “ఇది తేలిక మాట అనుకొంటున్నావా, నేను నిజంగా చెపుతున్నాను, నీకు తప్పనిసరిగా ఆత్మజ్ఞానం కలుగుతుంది, ఆత్మలో ఐక్యం అవుతావు, నువ్వే కాదు భక్తులందరూ పొందుతారు, అందరూ తరిస్తారు. అది ఈ జన్మలో కావచ్చు, మరుజన్మలో కావచ్చు, కొన్ని జన్మలు పట్టవచ్చు. ఈలోపల మనం చేయవలసినది చెయ్యాలి, ఎదురుచూసినట్టు ఉండకూడదు” అన్నారు.

ఒకసారి ‘నీకు సబ్జెక్టు బాగా అర్ధం అవుతోంది’ అన్నారు. “నేను ఆచరణలో ఫెయిల్ అవుతున్నాను, అర్ధం అయితే అవ్వను కదా” అని చెప్పాను. అప్పుడు నాన్నగారు ముందు సబ్జెక్టు తెలియాలి, దానిని పట్టుకొని ఎంజాయ్ చెయ్యాలి, నెమ్మదిగా అది నీ అవగాహనకి వచ్చి నిన్ను ప్రభావితం చేస్తుంది. అప్పుడు ఆచరించకుండా ఉండలేక ఆచరిస్తావు, కొంతకాలానికి అది నీ స్వభావం అయిపోతుంది అన్నారు. ఇంకొక సారి నువ్వు పని బాగా చేస్తావు అమ్మా అన్నారు. అప్పుడు అన్నాను, “పని పని కోసం చేయను, పర్ఫెక్ట్ గా చేస్తే ఎవరూ వెలెత్తి చూపరు, మాట పడక్కరలేదు అనుకొని చేస్తాను అన్నాను. అది కూడా త్వరలోనే దాటేస్తావు అమ్మా, పని పెర్ఫెక్ట్ గా చేయటం మొదటి అడుగు అన్నారు. ఆ ఆనందం ఎలా ఉంటుందో నాన్నగారి చిన్న చిన్న పనులు చేసినప్పుడు తెలిసింది.

పని ద్వారా నాన్నగారి అనుగ్రహం


సంధ్య అక్కతో సాన్నిహిత్యంలో నాన్నగారు చెప్పే చాలా విషయాలు నాకు అర్ధం అయేటట్టు చెప్పేవారు. గత పదేళ్లుగా ఆవిడ ప్రోత్సాహంతో భగవాన్ అరుణాచలం మీద వ్యాసాలు ఇంగ్లీషులో రాయటం మొదలుపెట్టి, ముందుగా సంధ్యక్క వదిన సుభద్రగారు నడిపిన అధ్యాత్మిక పత్రికకు 3-4 వ్యాసాలు పంపాను. నాన్నగారి ప్రవచనాలనుంచి మాటలు తీసుకొని ఈ వ్యాసాలు కూర్చేదానిని. అనుకోకుండా ఒకరోజు నాన్నగారి గురించి రాయాలి అనిపించింది. వెంటనే గంటలోపు క్లుప్తంగా ఆయన జీవితం, ముఖ్యమైన బొధనాంశాలు రాశాను. అది నేను రాయలేదు, లోపలినుంచి ఒక ప్రేరణ నాచేత రాయించింది. ఆ వ్యాసంలో అరుగు గురించి నాలుగు వాఖ్యాలు ఉన్నాయి.
సంధ్యక్క ఆ వాఖ్యాలు బాగున్నాయి ఇంకా వివరంగా రాయగలవా అన్నారు. సరే అన్నాను కానీ ప్రయత్నం చేయలేదు. కొన్ని వారాల తరువాత మళ్ళీ అదే బలమైన ప్రేరణ కలిగి, వెంటనే అరుగు వ్యాసం రాసి వర్మ గారికి పంపితే ఆయన నాన్నగారికి చూపించారు. జిన్నూరులో భక్తులు కోరికమీద తెలుగులో కూడా రాశాను. అది మొదటిసారి తెలుగు రాయటం! నాన్నగారు మెచ్చుకొని రెండు భాషలలోనూ బాగా రాసావు అమ్మా, నీలో భావాలు స్పష్టంగా డైరెక్ట్ గా చెప్పావు అంటూ, రాయటం కొనసాగించమని ప్రోత్సహించారు. తరువాత అదే ప్రేరణతో నాన్నగారి పేరులోని విశేషం వివరిస్తూ ఒక ప్రార్థన కూడా రాశాను. ఇవేమీ నేను ప్రయత్నపూర్వకంగా రాసినవి కాదు, నాన్నగారే రాయించారు. అందరి హృదయాలలో నేను ఉన్నాను అని చూపటానికి ఆయన అనుగ్రహం అలా పనిచేసింది.

రాయటం అలవాటు అవ్వటంతో, నాన్నగారి పోస్ట్ ఆఫీసు ప్రవచనాలు 2-3 రాసి ఇంగ్లీషులో అనువాదం చేశాను. ఈ ప్రవచనాలు రమణ భాస్కర ప్రచురణ మొదలుపెట్టటానికి ముందు చెప్పినవి. పాలకొల్లు సత్యనారాయయణ రాజు గారు ఈ పత్రికని మొదటినుంచి అంకితభావంతో నడుపుతున్నారు. ఆయనతో ప్రచురితం అవ్వని పూర్వపు ప్రవచనాలు మాటకిమాటగా రాస్తున్నానని, అవసరమైతే వాడుకోవచ్చని చెప్పాను. అప్పటికి నాన్నగారు ఆరోగ్యరీత్యా ప్రవచనాలు తగ్గించటంతో వాటిని సత్యనారాయణ రాజు గారు ప్రచురించటం ప్రారంభించారు. వర్మగారు పాత ప్రవచనాలు రాసే బాధ్యత తీసుకొని ఎంతో శ్రద్దతో కొనసాగిస్తున్నారు. అది శ్రమతో కూడినపని, ఎంతో సమయం వెచ్చించాలి. అయినా ఇదివరకు భీమవరం దేవిగారు, ఇప్పుడు వర్మ గారు చాలా తేలికగా చేస్తున్నారు. పత్రిక వైవిధ్యంగా ఉండటానికి నాన్నగారు వివిధ విషయాల మీద చెప్పిన మాటలు, మహాత్ముల గురించి చెప్పిన మాటలు, అక్షరమణమాలకు, గీతా శ్లోకాలకు ఆయన ఇచ్చిన వివరణలు వ్యాసాలుగా వేయటం కూడా మొదలు పెట్టారు. ఈ వ్యాసాలు రాసే పని కొంతవరకూ చేస్తున్నాను. నాన్నగారు కరుణతో మాకు ఈ పని చేసే అవకాశం ఇచ్చారు.

స్వాభావికంగా నేను ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతాను. పుస్తకపఠనం అంటే ఇష్టం. నాన్నగారి సంకల్పం వల్ల నాకు తగిన పని అప్పగించారు. ఆయన పని ద్వారా, ఎప్పుడూ ఆయన మాటలు వినటం, వాటిని మననం చేసుకొని అర్ధం చేసుకొని, యధాతధంగా రాయటం, ఒక అదృష్టం. మనసు గురి తప్పకుండా సరైన మార్గంలో ఉండటానికి ఇది ఉపయోగపడుతోంది. రేపు విందాములే అనుకొని తప్పించుకోలేము. ఈ పనిలో భక్తులకి ఉపయోగపడాలని సంకల్పం ఉన్నా, నేను మాత్రం నిశ్చయంగా ప్రయోజనం పొందుతున్నాను!

మనమందరమూ నాన్నగారి కుటుంబం


ఎందరో భక్తులు నాన్నగారి పని శ్రద్దగా అంకిత భావంతో చేస్తున్నారు. నాన్నగారి మాట సజీవంగా ఉండేలా, ప్రపంచమంతా వ్యాప్తి చేసి ఇంకా ఎందరికో ఉపయోగపడాలని మంచి సంకల్పంతో కృషి చేస్తున్నారు. పాత భక్తులు వారి రచనల రూపంలో, కాసెట్టుల రూపంలో నాన్నగారి మాటని భద్రపరిస్తే, వాటిని వెబ్సైట్లు ద్వారా, యూట్యూబ్ ద్వారా, వ్యాప్తం చేసి, పదికాలాలు ఉండేలా యువభక్తులు కృషి చేస్తున్నారు. మీడియా టెక్నాలజి పూర్తిగా ఉపయోగిస్తూ నాన్నగారి బోధలోని మచ్చుతునకలు ప్రతిరోజూ వెదజల్లుతూ, నాన్నగారు తయారు చేసిన టీచర్లు ఆన్లైన్ సత్సంగాలు నడుపుతూ, నాన్నగారి సమక్షం ఎప్పుడూ ప్రత్యక్షంగా ఉండేలా చూస్తున్నారు. జిన్నూరులో నాన్నగారు నివసించిన పరిసరాలలో వారి జ్ఞాపకాలు భద్రపరచటం, భక్తులకి సంతోషదాయకం. నాన్నగారి భౌతిక కుటుంబ సభ్యుల ప్రేమతో బాధ్యత తీసుకొని చేయూత ఇవ్వటం భక్తుల అదృష్టం. మనమందరమూ నాన్నగారి కుటుంబం!

ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః

No comments:

Post a Comment