Tuesday, December 21, 2021

"మీ సంకల్పమే నా సంకల్పం" - (By సుజాత గారు)

నీ ఇష్టమే నా ఇష్టం గా, నీ సంకల్పమే నా సంకల్పంగా ఒకటిగానే ఉండాలి :

మా మావయ్యగారు, నాన్నగారు చిన్ననాటి నుండి స్నేహితులు. మా మరిది గారి పెళ్ళికి మా మావయ్యగారు నాన్నగారిని ఆహ్వానించారు. అలా మా ఇంటికి మొదటిసారి నాన్నగారు వచ్చారు. అదే నేను నాన్నగారిని మొట్ట మొదటి సారి చూడటం. మా మావయ్య గారు వల్లనే మాకు నాన్నగారు లభించారు. అలా నాన్నగారు మా ఇంటికి వచ్చినప్పుడు చాలా మంది భక్తులు నాన్నగారిని దర్శనం చేసుకోవటానికి వచ్చి, నాన్నగారికి పాద పూజ చేస్తూ నమస్కారాలు పెడుతూ ఉండేవారు. భక్తి అనేది లోపల ఉండాలి గాని ఇలా పైకి వ్యక్తపరచటం ఏమిటి అనుకునేదాన్ని. మొదట్లో మేము నాన్నగారిని గురువుగా కాకుండా, మావయ్య గారికి స్నేహితుడిగా మాత్రమే చూసేవాళ్ళం. కానీ క్రమంగా ఆయన మమ్మల్ని ఆకర్షించుకొని, ఆయన వైభవం అర్థమయ్యేలా చేశారు. నాన్నగారు మా మరిది గారి పెళ్ళికి వచ్చినప్పుడు, మేడమీద జరిగిన ఉపన్యాసంలో అక్షరమణమాల గురించి చెప్పారు. ఆరోజు నేను సబ్జెక్టు బాగా ఎంజాయ్ చేశాను. తరువాత నాన్నగారు ఉండగా, ఎవరో భక్తులు నాతో ఈ బిల్డింగ్ చాలా బాగుంది మీరు చాలా బాగా కట్టుకున్నారు అని అన్నారట. అప్పుడు నేను అక్షరమణమాల కన్నా ఈ బిల్డింగ్ అందంగా ఉందా? అని అన్నానట. నేను అన్నానో, లేదో నాకు జ్ఞాపకం లేదు కానీ, నాన్నగారు మాత్రం ఎప్పుడూ సుజాత అన్న ఆ మాట నా హృదయంలో ఉండి పోయింది అనేవారు. మనల్ని పవిత్రం చేయడానికి అలా ఏదో ఒక రకంగా, ఏదో ఒంపు పెట్టుకుని మన అందరినీ తలుస్తూ ఉంటారు.

నాన్నగారు నన్ను భగవద్గీత చదవమన్నారు. నాన్నగారు నా జీవితంలో ప్రవేశించినప్పటి నుండి ప్రతిరోజు భగవద్గీత చదివేదాన్ని. పుస్తకం తెరవగానే ఏ శ్లోకం వస్తే ఆ శ్లోకాన్ని చదువుతూ నాన్నగారు బోధిస్తున్నట్టుగా భావించి, దాని అర్థాన్ని కూడా అర్థమయ్యేలా చేయమని ప్రార్థించే దానిని. అలా దాని తాత్పర్యం మననం చేస్తూ ఉంటే, అది అనుభవంలోకి కూడా వచ్చేది. ఒకసారి నాన్నగారు కోయంబత్తూర్ లో ఉన్నప్పుడు ఫోన్ చేశాను. అప్పుడు నాన్నగారు ఏమి చదువుతున్నావు అమ్మా అని అడిగారు. భగవద్గీత లో రెండవ అధ్యాయం చదువుతున్నాను అని చెప్పాను. వెరీ గుడ్, వెరీ గుడ్.. అని, మంచి చేసినవాడికి దుర్గతి లేదని కృష్ణుడు చెప్పాడు అమ్మా అన్నారు.

ఒకరోజు నాకు సడన్ గా ఈరోజు నీ భర్తకు మరణం వస్తే..! అనే తలంపు వచ్చింది. వెంటనే దేహాలు అన్నీ చనిపోతాయి కాని ఆత్మకు చావు పుట్టుకలు లేవు అనే వాక్యం స్ఫురించింది. ఆ రోజు రాత్రి నా భర్త కి హార్ట్ ఎటాక్ వచ్చింది. అదే సమయానికి నాకు లోపల ఆత్మకి చావు పుట్టుకలు లేవు చనిపోయేది శరీరమే అనే వాక్యం బాగా మననం జరుగుతూ ఉంది. ఆ తరువాత నా భర్తని ఆస్పత్రిలో చేర్చి ఇంజక్షన్ ఇచ్చారు. అది రియాక్షన్ ఇచ్చింది. తరువాత మరొక ఇంజక్షన్ ఇచ్చారు. అప్పుడు అంతా సర్దుకుంది. ఆ తరువాత సౌరిస్ అమ్మగారు విభూది పంపించారు. అంతా ఈశ్వరుడి ప్రణాళిక ప్రకారం జరిగింది. నాకు రామనామం అంటే చాలా ఇష్టం. అందువలన నా భర్త హాస్పత్రి లో ఉన్నప్పుడు రామనామం ఎక్కువ చేస్తూ ఉండేదాన్ని. రామనామం చెయ్యడం వలన నా భర్త ఉన్న గది అంతా చాలా ప్రశాంతంగా ఉండేది. మరలా ఇంకొక సారి హార్ట్ ఎటాక్ వచ్చింది. దానికి ఇంజక్షన్ ఇవ్వడం, తరువాత హైదరాబాద్ వెళ్ళటం జరిగింది. ఆయన ఆరోగ్యం కుదుటపడిన తరువాత తిరిగి వచ్చేసాము.

కొన్ని రోజుల తరువాత నా భర్త హైదరాబాద్ లో ఉన్నప్పుడు మూడవసారి హార్ట్ ఎటాక్ వచ్చింది. మా ఆడపడుచు భర్త వెంటనే ఆయనని ఆస్పత్రిలో చేర్పించారు. ఈ సంగతి మాకు తెలియదు. తర్వాత నాన్నగారు భక్తులలో ఒకరు నాకు ఫోన్ చేసి నా భర్తకు హార్ట్ ఎటాక్ వచ్చింది అన్న విషయం చెప్పారు. అది వినగానే నేను ఏమి మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోయాను. ఈ లోపు మా మావయ్య గారు, అత్తయ్య గారు నాన్న గారికి ఫోన్ చేసి చెప్పారు. నాన్నగారు అది విని మీ అబ్బాయికి ఏమీ అవ్వదు అనే భరోసా ఇచ్చారు. అందరూ వచ్చినప్పటికీ, నేను నిశ్శబ్దంగానే ఉన్నాను. నాకు ఆ సందర్భం అంతా ఏదో ఒక సినిమా రీలు జరుగుతూ ఉన్నట్టు అనిపించింది. తరువాత హైదరాబాదు నా భర్త దగ్గరికి వెళ్ళేసరికి నాకు దుఃఖం వచ్చేసింది. ఆ సమయంలో ఆయనకీ చాలా సీరియస్ అయ్యి, దాదాపుగా దేహం నుండి విడిపోయారు. ఆ తరువాత ఆయన నాతో ఆ సంఘటనను గురించి ఈ విధంగా చెప్పారు. "నేను దాదాపు నా దేహం నుండి విడిపోయాను. విడిపోయినప్పుడు విపరీతమైన శాంతి అనుభవమైంది. ఆ మహా శాంతిని నేను వర్ణించలేను. నేను చనిపోయేటప్పుడు గిలగిలా కొట్టుకుంటూ చనిపోయానని వీరందరూ అనుకుంటున్నారు. కానీ చావులో ఇంత సౌదర్యం ఉందా! ఇంత శాంతి ఉందా! ఎంత బావుందో ఈ మరణం అని అనుకుంటున్నాను. ఈ లోపు ఓం నమో నారాయణాయః అనే నామం జరుగుతోంది. అలా జరుగుతూ ఉంటే సుజాత నన్ను ఎప్పుడు బయట వ్యవహారాలేనా, భగవంతుడిని స్మరించుకోవటం అంటూ ఉండదా! మనల్ని రక్షించేవాడు భగవంతుడే అని ఎప్పుడూ అంటూ ఉంటుంది. ఇప్పుడు నామం జరుగుతూ ఉంది అనుకున్నాను. అదే సమయంలో దేహంలోకి నేను ప్రవేశించటం జరిగింది. అలా జరిగిన తరువాత మీరందరూ నాకు జ్ఞాపకం వచ్చేసారు" అని ఆయనకు కలిగిన అనుభవాన్ని నాతో పంచుకున్నారు. అది విని, కేవలం గురువు అనుగ్రహం వలన మాత్రమే అలా జరిగింది అనుకున్నాను. నా భర్తకి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తక్కువ. అందువల్ల నేను ఆయనతో, నాన్నగారు మీకు మూడు సార్లు ప్రాణంపోసారు. మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెబుతూ ఉంటాను. నాకు మరణం అంటే భయం లేదు అంటారు. మరణం అంటే భయం లేదు కానీ, చనిపోయేటప్పుడు ఆరోగ్యంగా చనిపోవాలి కదా! శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం ఇవి రెండే మనకు ఆస్తులు అని ఆయనకి చెబుతూ ఉంటాను.

ఇవి అన్నీ జరిగిన తరువాత, నాన్నగారి దగ్గరికి శృంగవృక్షం లో ప్రవచనం జరిగేటప్పుడు వెళ్ళాను. నన్ను చూసి నీవు చాలా ధైర్యంగా ఉన్నావమ్మా అన్నారు. మీ అనుగ్రహం, మరియు మీరు చెప్పిన ఆ వాక్యాలు నన్ను అలా ధైర్యంగా నిలబెట్టాయి కానీ, అది నా తెలివితేటలు వల్ల కాదు నాన్నగారూ అని మనసులో అనుకున్నాను. ఉన్నదానికి లేకపోవటం అంటూ లేదు! లేనిదానికి ఉండటం అంటూ లేదు! ఈ వాక్యము యొక్క రుచి అప్పుడు అలా చూపించారు. కానీ పూర్తిగా మనోనాశనం అయితే గాని దాని అందాలు మనకు తెలియవు. మధ్య మధ్యలో గురువు దయవలన అలా రుచి చూస్తూ ఉంటాము.

మా ఇంట్లో ఒక మామగారు ఉండి వంట చేసేవారు. నాన్నగారు వచ్చినప్పుడు నేను నాన్నగారికి భోజనం వడ్డించే దానిని. నాన్న గారు ఒకసారి నాతో మీ ఇంట్లో మామ ఉన్నారు కదా! ఆవిడే నీకు ఆస్థి అన్నారు. ఆవిడి ఇంట్లో నా సొంత మనిషిలా ఉండి అన్నీ చూసుకునేవారు. కాబట్టి నేను నాన్నగారి దగ్గరకు వచ్చినా, సత్సంగాలకి వెళ్ళినా ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. అందువల్ల నాన్నగారు నాతో, ఆ మామగారు నీకు ఆస్థి అమ్మా అనేవారు. ఇప్పుడు ఆవిడ లేని లోటు నాకు తెలుస్తోంది. ఆవిడ పెట్టిన చారు అంటే నాన్నగారికి చాలా ఇష్టం. సత్యవతమ్మ గారూ మీరు పెట్టిన చారు చాలా అద్భుతంగా ఉందండి అనేవారు.

మాది ఉమ్మడి కుటుంబం. కొంచెం కుటుంబము పెద్దది అయిన తరువాత మా అత్తయ్య గారు వేరే ఇంటికి వెళ్ళారు. ఒకసారి నాన్నగారు మా అత్తయ్య గారి ఇంటికి వచ్చినప్పుడు, పూజ గదిలో నాన్నగారికి పాద పూజ చేశారు. ఆ పూజ గదిలో ఒక మందిరం ఉంది. ఆ మందిరంలో రాముడి పట్టాభిషేకం ఫోటో ఉంటుంది. నాన్నగారు ఆ మందిరాన్ని చూసి ఇది సుజాతకి ఉంచేయండి అని చెప్పారు. మా మరిది గారి పెళ్ళికి దేవుడు సామాగ్రి తీసుకుంటూ, మా అత్తయ్య గారు నన్ను కూడా నాకు నచ్చింది తీసుకోమన్నారు. నాకు అక్కడ ఉన్న వాటిలో రాముడి పట్టాభిషేకం ఫోటో బాగా నచ్చి అది తీసుకున్నాను. మనల్ని అనుగ్రహించడానికి సత్యమే అనేక రూపాలు ధరించి వచ్చింది కాబట్టి నాకు అందరి దేవుళ్ళు సమానమే. మనం తరించటానికి ఏదో ఒక రూపం, ఒక నామం సరిపోతుంది. నాన్నగారు అద్వైత వాసన రావడం కూడా చాలా కష్టం అన్నారు. వినటంలో మన లోపం ఏమైనా ఉందేమో కానీ, ప్రవచనాల ద్వారా నాన్న గారు మనకు అన్నీ బోధించారు. ఇప్పుడు మనకి ఆచరణ మొదలయ్యింది అనిపిస్తోంది. నాన్నగారు దేహంతో ఉన్నప్పుడు కూడా ఆచరించే వాళ్ళము కానీ, ఏదైనా సమస్య వచ్చేసరికి నాన్నగారికి చెప్పుకునే వాళ్ళము. ఇప్పుడు వెనక్కి తిరిగి మన హృదయానికి చెప్పుకోవటం అనే నిజమైన ఆచరణ మొదలయ్యింది అనిపిస్తుంది.

నాన్నగారి భక్తులు అంటే నాకు చాలా ఇష్టం. కానీ నాన్నగారి దగ్గర లక్ష్మి ఎందుకో ప్రత్యేకంగా అనిపించేవారు. లక్ష్మి దేహం వదిలేసిన తరువాత, నాన్నగారు వైజాగ్ వచ్చినపుడు నువ్వు లక్ష్మి గురించి ఒక మాట చెప్పు సుజాతా అన్నారు. అప్పుడు నేను నాన్నగారితో ఒకసారి లక్ష్మి విరూపాక్ష గుహ నుండి కిందకు దిగి ఆంధ్ర ఆశ్రమం వైపు వెళ్తుంటే, మీరు కారులో వెళుతూ లక్ష్మిని పిలిచి కారులో ఎక్కించుకుని, అమ్మా లక్ష్మీ మన కంటే తెలివైన వారు, మనకంటే ధనవంతులు, మనకంటే ఎంతో గొప్ప గొప్ప వారు చాలా మంది ఉన్నారు కానీ మనల్ని ఇక్కడికి పిలిపించుకొని అరుణాచలేశ్వరుడు ఎందుకు ఆకర్షించుకున్నాడో..! అరుణాచలేశ్వరుడు మనల్ని అందరినీ తన చెంతకు చేర్చుకుని, చింతన నేర్పి అప్పుడు తన స్వరూపాన్ని ఇస్తాడు అమ్మా, మనందరం అదృష్టవంతులం అమ్మా! అని మీరు లక్ష్మి తో అన్నారట నాన్నగారూ. లక్ష్మి చెప్పిన ఈ వాక్యం నా హృదయంలో ఉండిపోయింది అని చెప్పాను. ఒకసారి నాన్నగారి సమక్షంలో నా మనసులో చెడు తలంపులు, మంచి తలంపులు వచ్చేస్తున్నాయి. అప్పుడు నాన్నగారు ప్రవచనంలో ఆ చెడు తలంపులు నీవు కాదు, మంచి తలంపులు నీవు కాదు అని చెప్పారు. హైదరాబాద్ భక్తులు ఒకరు నాన్నగారు గురించిన అనుభవాలను రాయమన్నారు. అది విని నేను ఒక గదిలో కూర్చుని రాస్తూ ఉంటే, నాన్నగారు వచ్చి కంగారు ఏమి లేదు నెమ్మదిగా రాయమ్మా అన్నారు. విష్ణు సహస్రనామాలలో భగవంతుడి చూపు మన పై పడితే చాలు మన పని అయిపోతుంది అని ఉంటుంది. ఆ వాక్యం గురించి నాన్న గారిని అడిగాను. దానికి నాన్నగారు ఏమీ సమాధానం చెప్పకుండా, నేను నీ తండ్రి లాంటి వాడిని నీకు ఏ సందేహం వచ్చినా నన్ను అడుగు అన్నారు.

ఒకసారి నాన్నగారు కోయంబత్తూరు వెళ్ళినప్పుడు నాకు కూడా వెళ్ళాలనిపించింది కానీ ఇంట్లో పరిస్థితులు అనుకూలించక వెళ్ళటం కుదరలేదు. అప్పుడు మనసులో నాన్నగారూ మీరు అంతటా వ్యాపించి ఉన్నారు. మీరు అక్కడ ఏదైతే బోధిస్తున్నారో అది నాకు కూడా అందాలి. మీకు సాధ్యం కానిది ఏదీ ఉండదు కదా! అనుకున్నాను. అక్కడ నాన్నగారు ఏమేమి చెబుతున్నారో అవి అన్ని నాకు భగవాన్ పుస్తకం చదువుతున్నప్పుడు ఏదో ఒక రూపంలో వచ్చేస్తూ ఉండేవి. నా స్నేహితురాలు పద్మ నాన్నగారు మీకు ఇమ్మన్నారు అని చెప్పి ఒక చిన్న కొటేషన్ తో కూడిన లామినేషన్ ఫొటో నాకు ఇచ్చారు. ఆ కొటేషన్ ఏమిటంటే Experience teaches us that love does not consist of two people looking at each other but of looking together in the same direction. అంటే నీ ఇష్టమే నా ఇష్టం గా, నీ సంకల్పమే నా సంకల్పంగా ఒకటే ఉండాలి కానీ, రెండూ ఉండకూడదు అనే కొటేషన్ తో ఉన్న ఫోటో నాకు పంపించారు. అది నేను పూజగదిలో పెట్టుకున్నాను. ఇప్పటికీ అది చూసి చాలా ఆనందపడుతూ ఉంటాను. ఈ వాక్యం నన్ను బాగా వెంటాడుతుంది. భగవంతుడికి సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు. మనకి భగవంతుడు కావాలి అనే ఆకలి ఉండాలే కానీ భగవంతుడు మనల్ని బాగు చేయటానికి, ఆయన స్వరూపం ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. నాన్నగారు జ్ఞానం గురించి ఎక్కువ బోధించేవారు.

మొదటి సారి అరుణాచలం వెళ్ళినప్పుడు గిరి ప్రదక్షిణ చేస్తూ, కుబేర లింగం దగ్గరకు వచ్చేసరికి నాన్నగారు అక్కడ కూర్చుని ఉన్నారు. నేను కొంచెం మానసికంగా, శారీరకంగా సున్నితంగా ఉంటాను. అప్పుడు నాన్నగారు నాతో నీకు కాళ్లు నొప్పులు పెడుతున్నాయా అమ్మా అని అడిగారు. చాలా నొప్పులుగా ఉన్నాయి నాన్నగారూ అని చెబితే, నాన్నగారు నువ్వు రూమ్ కి వెళ్ళిన తరువాత కొబ్బరి నూనె రాసుకో తగ్గిపోతుంది అని ప్రేమగా చెప్పారు. నాన్నగారు నాతో మొదట నువ్వు మూడుసార్లు అరుణాచలం వద్దాము అనుకున్నావు కదా! కానీ రాలేకపోయావు అన్నారు. నాన్నగారు ఆ మాట ఎందుకు అన్నారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు.

నాన్నగారు వచ్చిన ప్రతిసారీ స్టేషన్ కి వెళ్ళి నాన్నగారిని తీసుకురావటం, తిరిగి వెళ్ళేటప్పుడు నాన్నగారితో పాటు స్టేషన్ కి వెళ్ళటం అలవాటు. అలా ఒకసారి నాన్నగారితో పాటు స్టేషన్ కి వెళ్ళినప్పుడు నాన్నగారు ట్రైన్ ఎక్కి గుమ్మం దగ్గర నిలబడి నా వైపు చూస్తున్నారు. నేను ఎటో చూస్తూ నాన్నగారి వైపు చూశాను. అప్పుడు నాకు లోపల నుండి, ఒకవైపే కాదు రెండు వైపులా కలిస్తే తొందరగా పని అయిపోతుంది. రెండు చూపులు కలిస్తే తొందరగా పని అయిపోతుంది అనే తలంపు వచ్చింది. అంటే మనం ఈశ్వర సంకల్పాన్ని గౌరవిస్తూ ఉంటే మన పని అయిపోతుంది. ఈశ్వర సంకల్పాన్ని గౌరవించము అనుకోండి మన ప్రారబ్దం మనకు చెప్పు దెబ్బలు కొట్టి గౌరవించేటట్టు చేస్తుంది. ఈ చావు, పుట్టుకలు ఎప్పటి వరకు అంటే ఆయన్ని అంగీకరించే వరకు! అప్పటి వరకు చావు, పుట్టుకలు తప్పవు.

ఒకసారి అరుణాచలంలో ఉండగా అందరము కలిసి అరుణాచలేశ్వరుడి గుడిలోకి వెళ్ళాము. అక్కడ మా మావయ్యగారు , మా చిన్న మావయ్య గారు కూడా నాన్నగారిని చూడగానే సాష్టాంగ నమస్కారం చేశారు. అప్పుడు నాన్నగారు నన్ను పిలిచి వీరు ఇద్దరు గురువుని చూడగానే అక్కడ ఉన్న స్థలం మురికిగా ఉందా లేదా అనేది కూడా చూడకుండా సాష్టాంగ నమస్కారం చేసి గురువుకి సరెండర్ అయిపోతారు అమ్మా! వారి భక్తి అటువంటిది అని చెప్పారు. మా అమ్మాయి వివాహ సమయంలో కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికి, అవి నా మనసుని తాకకుండా, నాన్నగారి దయవలన ఆయన సబ్జెక్టు నిరంతరం వింటూ హాయిగా నిద్రించేదాన్ని. ఒక్కసారి మా అత్తయ్య గారు నన్ను ఏదో అంటే నా మనసు చివుక్కు మనిపించి, తిరిగి నేను ఒక మాట అన్నాను. తర్వాత నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ విషయం చెప్పాను. అప్పుడు నాన్నగారు అమ్మా, ఇంకెప్పుడూ మీ అత్తయ్యను ఏమి అనకు. పడ్డవాడు ఎప్పుడూ చెడ్డవాడు కాదు. పడటం మంచిది. తిరిగి అనకూడదు. ఇంకెప్పుడూ అనకు. ఈసారికి ఏదో అయిపోయింది అన్నారు. అదొక పాఠంగా తీసుకున్నాను. అరుణాచలంలో ఉండగా ఒకసారి నాకు టీ తాగాలని తలంపు వచ్చింది. అప్పుడు నాన్నగారు పై నుంచి కిందకు దిగుతూ, నన్ను చూసి సుజాత నీకు టీ తాగాలని ఉందా అని అడిగి నవ్వేశారు. మన గురించి మనకు తెలియదు కానీ, మనలో ఏం జరుగుతుందో ఆయనకు తెలుస్తుంది.

ఒకసారి అరుణాచలంలో నేను రమణాశ్రమంలో ఉన్నాను. నువ్వు ఎక్కడ ఉన్నావు అని నాన్నగారు నన్ను అడిగారు. రమణాశ్రమంలో ఉన్నాను అని చెప్పాను. వెరీగుడ్ అని చెప్పి, ఈ దేహం ఎంత నిజమో, ఈ కొండ కూడా అంతే నిజం అని చెప్పారు. అలా ఎందుకు చెప్పారో నాకు అర్థం కాలేదు. కొండ మీద ఇష్టం లేకుండా, గురువు మీద ఇష్టం లేకుండా ఆ మాట మనకు ఎక్కడ అర్థం అవుతుంది అనుకున్నాను. నాన్నగారు ఒకసారి "భగవాన్ కి పైకి భక్తి, లోపల అంతా జ్ఞానం. ఈ జ్ఞాన మార్గంలో నడిచే వారంటే ఆయనకి కళ్ళు ఇంత అయిపోతాయి, జ్ఞానం గురించి మాట్లాడుతుంటే భగవాన్ కి ముఖంలో ఒక వెలుగు వచ్చేస్తుంది" అని గిరి ప్రదక్షణ చేస్తున్నప్పుడు చెప్పారు. ఒకసారి నాన్నగారితో గుడిలోకి వెళ్తే, గోత్రనామాలు అడిగి పూజారి పూజ చేశారు. అప్పుడు నాన్నగారు ఈ గోత్ర నామాలతో మన దేహ బుద్ధుని ఇంకా పెంచేస్తారు, అవి అన్ని వ్యవహారికంగా జరుగుతాయి అన్నారు. అంటే ఇవి ఏమి నిజం కాదు అని చెప్పకుండా చెప్పారు అనిపించింది.

ఒకసారి అరుణాచలంలో భక్తులు ఎవరో గోదానం చేసుకుంటున్నారు. అప్పుడు నాన్నగారు నన్ను పిలిచి గోదానం ఎవరు చేస్తుంది? మిథ్యా నేను చేస్తుంది, ఈ దానాలు అన్నీ నిజం కాదు. నేనుని దానం చేయుటమే నిజమైన దానం అని చెప్పారు. నేనెవడను కూడా ఎక్కువగా ఎంజాయ్ చేసేదాన్ని, నాకు ఏదైనా ఒక వాక్యం నచ్చితే దానిని తరుచూ చదివి ఎంజాయ్ చేసేదాన్ని. నేను ఒకసారి నాన్నగారితో నారాయణపేట వెళ్ళాను, అక్కడ నాన్నగారు నన్ను హే భగవాన్, జయ భగవాన్ అనుకోమని చెప్పారు. పైకి అనకు లోపల అనుకో అన్నారు. నారాయణపేటలో శబరి తిరిగిన చోటుకి మమ్మల్ని తీసుకు వెళ్ళారు, అవి అన్నిచూపించి, తరువాత నన్ను పిలిచి ఇప్పుడు మనం శబరి ఉన్న స్థలం అవీ చూశాం కదా! అవి అన్ని మనకు మాత్రలు లాంటివి, గురువు అనుగ్రహం ఇంజక్షన్ లాంటిది అమ్మా,.ఆ అనుగ్రహం వలన తక్షణమే ఇప్పుడే ఇక్కడే నీకు శాంతి అందుతుంది అన్నారు. గురువు దయ అటువంటిది.

నాన్నగారికి వండి పెట్టాలి అనిపించేది. నాకు రుచిగా వండటం రాదు. వండినప్పుడు ఒక్కటి కూడా సరిగ్గా కుదిరేది కాదు. బాలేదు అని నాన్నగారు చెప్పేసేవారు. పద్మ దగ్గర నేర్చుకో అనేవారు. అలా నేర్చుకున్న తర్వాత ఒకసారి బీరకాయ కూర వండి పెడితే చాలా బాగుందమ్మా అన్నారు. ఆ తరువాత నుండి మనకు రాని పని దగ్గరకు మనం వెళ్ళకూడదు, ఎవరికైతే వచ్చో వారు చేస్తారు అనుకొని నేను వంట జోలికి వెళ్ళటం మానేసాను. ఏదైనా సరే మనం భాధ పడకుండా, మనల్ని సంతృప్తిపరుస్తూ మనల్ని లోపల ఉన్న నిజం దగ్గరకి తీసుకువెళ్ళే ఘనత ఆయనకే చెందుతుంది. అలా మనల్ని ప్రేమిస్తూ, మన లోపాల్ని చూపిస్తూ, వాటినుండి విడుదల చేస్తూ అద్వైత శిఖరాలకు మనందరినీ మోసుకుని వెళుతున్నారు మన నాన్నగారు. డ్యూటీ ని సరిగ్గా చేయమని నాన్నగారు నాకు ఎలా ట్రైనింగ్ ఇచ్చారంటే, మా అత్తగారి తల్లిని తీసుకుని ఒకసారి జిన్నూరు వెళ్ళాము. నాన్నగారు అరుగు మీద కూర్చున్నారు దర్శనం చేసుకుని మా అత్తగారు తల్లిని వదిలేసి నేను మెట్లు దిగిపోయాను. నాన్నగారు నన్ను పిలిచి మామని దగ్గర ఉండి తీసుకు వెళ్ళు అని చెప్పారు. అప్పటి నుండి పెద్ద వారి పట్ల నేను చేయగలిగే పని ఉంటే చేయటం నేర్చుకున్నాను. అది కూడా గురువు దయే. డ్యూటీని సరిగ్గా చేయడం అనేది కూడా నాన్నగారే నేర్పించారు. మా బాబు కొంచెం ఇన్నోసెంట్, వాడిని చూసుకోవడానికి చాలా సహనం ఉండాలి. అప్పుడు కూడా సహనం అనేది నాన్నగారు నాకు నేర్పించారు. ఒకసారి వైజాగ్ లో ఒక భక్తులు ఇంటికి నాన్నగారు వచ్చారు. అప్పుడు వంట చేసి తీసుకెళితే బాగుండును అనిపించినా, పట్టించుకోకుండా వెళ్ళిపోయాను. అప్పుడు నాన్నగారు రూమ్ లో నుండి వచ్చి జిన్నూరు వెళ్ళిపోతూ ప్రేమ అడగదు, అజ్ఞానం అడుగుతుంది అని చెప్పారు. అప్పుడు నేను, హృదయం వంట చేసి పట్టుకెళ్ళమని చెప్పింది. కానీ నాకు ఉన్న వాసన హృదయం చెప్పిన మాటను విననివ్వకుండా చేసేసింది అనుకున్నాను. ఆ విధంగా నాన్నగారు ఎప్పటికప్పుడు బోధిస్తూ ఉండేవారు. ఒకసారి నాన్నగారు గోపాలపట్టణంలో ఉన్నారు. అక్కడికి వెళుతూ మనవలకి కట్టే LIC పనులు ఉంటే అవి అన్ని చూసుకుని ఆయన దగ్గరకు వెళ్ళాను. వెళ్ళగానే నాన్నగారు మాట్లాడుతూ నీ మనవలకి నీవు కట్టే LIC లు కంటే "రైట్ స్పీచ్, రైట్ యాక్షన్, రైట్ బిహేవియర్" నిన్ను హృదయంలోనికి తీసుకెళ్తాయి అన్నారు.

ఒకసారి నాన్నగారు నువ్వు కాశీ రాలేదు కదా అమ్మా, నిన్ను సారనాథ్ తీసుకెళ్తాను అన్నారు. ఎందుకు అన్నారో తెలియదు కానీ నాన్నగారు దేహం వదిలేసే ముందు సారనాథ్ నిన్ను తీసుకెళ్తానమ్మా అన్నారు. ఒకసారి ఏదో చిన్న ఫంక్షన్ కి వెళ్ళి అక్కడ వాళ్ళకి ఒక చిన్న కవర్ ఇస్తుంటే ఇచ్చేవాడు భగవంతుడే, పుచ్చుకునేవాడు భగవంతుడే అని తలంపు వచ్చింది. అప్పుడు నాన్నగారు పక్కనే ఉన్నారు. నాకు ఆ తలంపు రాగానే నాన్నగారు వెరీగుడ్ వెరీగుడ్ అన్నారు. ఇదంతా కూడా నాన్నగారు మన జీవితంలో ప్రవేశించడం వలనే గానీ మన తెలివితేటలు వలన కాదు.

No comments:

Post a Comment