Sunday, November 7, 2021

"నాన్నగారు సాక్షాత్తు శివ స్వరూపమే" - (By భవాని గారు)

ఒకసారి నా భర్తతో కలిసి రామకృష్ణ మఠానికి వెళ్ళాను. అక్కడే మొట్టమొదటిసారి చిక్కడపల్లి స్వరాజ్యం గారు నన్ను చూసి నీకు భక్తి ఎక్కువ ఉన్నట్టు ఉంది. నువ్వు సత్సంగానికి వస్తూ ఉండు అని చెప్పారు. అప్పటి నుండి నా ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైంది. చిక్కడపల్లిలో పప్పాగారి సత్సంగం జరుగుతూ ఉండేది. అక్కడ రామ నామము ఎక్కువ చేసేవారు.

రాందాస్ పప్పాగారి శిష్యులలో ఒకరైన కృష్ణాభాయి మాతాజి గురు వైభవం అనే పుస్తకం రాశారు. అందులో జ్ఞాని లక్షణాలను వర్ణించారు. అది చూసి మనము గురువు గురించి అన్వేషణ చేయాలి అనే ఆలోచన నాలో కలిగింది. అప్పటి నుండి గురువు కోసం నా అన్వేషణ మొదలయ్యింది. నాన్నగారు ఫోటో ఒకటి అభయ హస్తంతో ఆశీర్వదించినట్టు ఉంటుంది. అందులో ఆ హస్తము సర్పాన్ని పోలి ఉంటుంది. ఆ హస్తంతో గత జన్మలో నాకు అనుబంధం ఉన్నట్టు అనిపించేది. నాన్నగారు పరిచయం అవ్వకముందు ఆ హస్తం నన్ను ఆశీర్వదించినట్టు నేను అందులో ఒదిగిపోతున్నట్టు అనిపిస్తూ ఉండేది. నాకు అలా ప్రేమించే గురువు కావాలి అనుకునే దానిని.

ఒకసారి మా అమ్మగారి ఇంట్లో పూజ గది శుభ్రం చేస్తుంటే,అక్కడ భగవాన్ చిత్రపటం కనిపించింది. ఆ పటం చూడగానే 'నన్ను చూడు, నన్ను చూడు' అని భగవాన్ అంటూ ఆ పటం కూర్చున్నట్టు ఉంది. అప్పుడు మా తండ్రి గారిని పిలిచి మీకు ఈ భగవాన్ చిత్రపటం ఎవరిచ్చారు అని అడిగి, నేను ఈయనను చూడాలి అన్నాను. మా స్నేహితుడు ఒకరు నన్ను నాన్నగారి దగ్గరకు తీసుకువెళ్ళారు. నాన్నగారు నాకు ఈ ఫోటో ఇచ్చారు అని చెప్పారు. నాన్నగారు అంటే ఎవరు అని మా తండ్రి గారిని అడిగాను. ఆయన ఒక జ్ఞాని అని చెప్పారు.అంతటా వ్యాపించి ఉన్నవాడు జ్ఞాని అని, జ్ఞాని లక్షణాలలో కృష్ణాభాయ్ మాతాజీ వర్ణించారు. మా తండ్రి గారు అయన స్నేహితుడిని నాన్నగారి దగ్గరికి తీసుకు వెళ్ళమని అడిగితే, ఆయన ఏమి సమాధానం చెప్పలేదు. అలా ఆయన సమాధానం చెప్పకపోయేసరికి, నాన్నగారు జ్ఞాని అంటున్నారు కదా, ఆయన జ్ఞాని అయితే ఇప్పుడు మనమిద్దరమూ మాట్లాడుకునేటప్పుడు కూడా ఉంటారు కదా, నాకు కనుక నిజమైన భక్తి ఉంటే నన్ను ఆయనే దగ్గరికి రప్పించుకుంటారు అని మా తండ్రి గారికి చెప్పి, హైదరాబాద్ వెళ్ళటానికి టికెట్ తీయమన్నాను. తరువాత ట్రైన్ ఎక్కించడానికి మా తండ్రిగారు వచ్చారు. నాకు కొంచెం అనారోగ్యంగా ఉండటం వలన, సీట్లో కూర్చో పెట్టిన తరువాత, నువ్వు ఇంత అనారోగ్యంగా ఉంటే, నేను నిన్ను ఎలా పంపించగలను అని తిరిగి ఇంటికి తీసుకు వచ్చేశారు. మరుసటి రోజు తెల్లవారుజామున నాలుగు గంటలకి మా నాన్నగారి స్నేహితుడు ఫోన్ చేసి, నాన్నగారి దగ్గరికి వెళ్దాము రెడీగా ఉండండి అని చెప్పారు. నాన్నగారు చూడటానికి సాధారణ వ్యక్తిలా కనిపిస్తారు కాని మీరు అలా అనుకోవద్దు అని మా తండ్రిగారి స్నేహితుడు మాకు చెప్పారు. మేము కారు దిగి వెళుతూ ఉంటే, అప్పటికే నాన్నగారు అరుగుమీద మా కోసం ఎదురు చూస్తున్నట్టు అక్కడే తిరుగుతూ కనిపించారు. నాన్నగారు మమ్మల్ని చూడగానే రెడ్డిగారు మీరు వచ్చి 15 రోజులు కూడా కాలేదు మరలా వచ్చారు ఏమిటి అని అడిగారు. అయితే మా తండ్రిగారు, మీరు భగవాన్ ఫోటో ఇచ్చారు కదా నాన్నగారు అది చూసి మా అమ్మాయి మీ దగ్గరకి తీసుకు వెళ్ళండి అని అడుగుతోంది అని చెప్పారు. ఆ ఫోటో మిమ్మల్ని తీసుకువచ్చింది రెడ్డి గారు అన్నారు నాన్నగారు. ఫోటో తీసుకు రావటం ఏమిటి నాన్నగారు నాకు అర్థం కాలేదు అన్నారు మా తండ్రిగారు. అప్పుడు నాన్నగారు ఈ అమ్మాయిది, నాది జన్మ, జన్మల బంధం రెడ్డి గారు అన్నారు. తరువాత నాన్నగారు మాతో మాట్లాడటం మొదలు పెట్టారు. నాకు తెలియకుండానే నా నేత్రాలు వెంబడి కన్నీరు ధారలుగా కారుతున్నాయి. నువ్వు హైదరాబాదులో ఉంటావా అని అడిగి, హైదరాబాద్ కి ఎన్ని ట్రైన్లు ఉంటాయి ఇలా అడుగుతూ ఉంటే ఇదేంటి నాన్నగారు జ్ఞాని కదా అన్నీ తెలిసి ఉంటాయి కదా ఇలా ఎందుకు అడుగుతున్నారు అని అనుకున్నాను. అంటే నాకు అప్పటికీ నాన్నగారు జ్ఞాని అని తెలుసు కానీ అది ఆపాదించుకోవడం తెలియలేదు. నాన్నగారు నాతో మేము కూడా హైదరాబాదు 27వ తారీఖున వస్తున్నాము అని చెప్పారు. సరే, నాన్నగారు మీరు వచ్చినప్పుడు అడ్రస్ ఇవ్వండి మేము వస్తాము అని చెప్పి , రామారావు గారి దగ్గర అడ్రస్ తీసుకున్నాను. నువ్వు ఏమి చేస్తూ ఉంటావు అని అడిగారు నాన్నగారు. నేను రామదాసు పప్పాగారి సత్సంగం జరుగుతూ ఉంటుంది అక్కడికి వెళ్తాను అని చెప్పాను. తరువాత కొన్ని పుస్తకాలు, క్యాసెట్లు ఇచ్చి ఇవి మీ సత్సంగానికి ఉపయోగపడతాయి పట్టుకువెళ్ళు అని చెప్పారు. నేను పుస్తకాలు చదవను నాన్నగారు అన్నాను. ఇవి ఉపయోగపడతాయి పట్టుకువెళ్ళు అని మరలా చెప్పేసరికి ఆ పుస్తకాలు తీసి పక్కకు పెట్టుకున్నాను. నీకు ఏమి ఇష్టము అని అడిగారు. నాకు పాటలంటే చాలా ఇష్టం నాన్నగారు, పాడాలని ఉంటుంది గానీ నా స్వరం అంతగా బాగోదు అందుకు నేను పాడినా ఎవరు వినరు అని చెప్పాను. నీకు రమణపాటల పుస్తకం ఇస్తాను అందులో రమణ పాటలు ఉంటాయి, అవి పాడుకో అని చెప్పి దానితో పాటు నేను ఎవరు అనే ఒక చిన్న పుస్తకం తీసుకొని వచ్చారు. ఆ పుస్తకం ఇచ్చి ఇది నీకు అర్థమయినా, అర్థం కాకపోయినా చదువుకొని రోజు తల కింద పెట్టుకొని పడుకో అని చెప్పారు. నాన్నగారు పాటల పుస్తకం ఇచ్చినప్పటినుండి ఆ పాటలు పాడే దానిని అప్పటినుండి నా స్వరం బాగుంది అని అందరూ నా పాటలను వినేవారు.తరువాత హైదరాబాద్ వచ్చేశాను.

స్వరాజ్యం గారి ఇంటికి సత్సంగానికి వెళ్ళి వారితో, మన పప్పా ఎలా అయితే ఉంటారో, నాన్నగారు కూడా అలాగే ఉన్నారు అని చెప్పాను. అది విని స్వరాజ్యం గారు చాలా ఆనందపడ్డారు. ఇంకో వారం రోజుల్లో హైదరాబాద్ వస్తారు అని చెప్పాను. ఆ వారం రోజులు కూడా అందరూ గోపికలు కృష్ణుడు కోసం ఏ విధంగా అయితే ఎదురుచూస్తారో అలా ఆర్తిగా ఎదురు చూశారు. నేను తీసుకువెళ్ళిన పుస్తకాలు అందరూ పట్టుకొని వెళ్ళారు. నాన్న ఉవాచ అనే పుస్తకం స్వరాజ్యం గారి చేతికి వచ్చింది. ఆ పుస్తకంలో "నా దర్శనం అయిన తరువాత మీకు జ్ఞానం లభించకపోతే ఆ దోషం నాది కాని మీది కాదు" అనే వాక్యం స్వరాజ్యం గారి చదివి, దోషం ఆయన మీద వేసుకుని మాట్లాడుతున్నారు అంటే, అది సామాన్యం కాదు, ఆయన మహానుభావుడు అన్నారు.27 వ తారీఖున నాన్నగారు చెప్పిన అడ్రస్ కి చేరుకున్నాము. కానీ నాన్నగారు మరునాడు వస్తారని తెలుసుకుని మరలా మరుసటి రోజు వెళ్ళాము.

నాన్నగారికి స్వరాజ్యం గారిని పరిచయం చేశాను. నాన్నగారు అమ్మ స్వరాజ్యం ఇంత ఎండలో వచ్చారా అమ్మా అన్నారు. అప్పుడు స్వరాజ్యం గారు నాన్నగారు పాదాలు పట్టుకుని మేము భగవంతుని చూడటానికి, దేవాలయానికి వచ్చాము నాన్నగారు అన్నారు. నాన్నగారు ఆ మాట విని చాలా ఆనందపడ్డారు. నాన్నగారు తమ భక్తులకు ఏ మార్గము ఇష్టమో ఆ మార్గం యొక్క వైభవాన్ని వివరిస్తూ భక్తులను సన్నిహితంగా చేసేసుకుంటారు. నాన్నగారు చిక్కడపల్లి సత్సంగానికి వచ్చినప్పుడు రామ నామం చేసాము. అది చూసి మీరు అంతా వైకుంఠాన్ని దింపేసారు అమ్మా అని చెప్పి రామ నామము హృదయం మీద మనసుని పెట్టి చెయ్యాలమ్మా అన్నారు. నాన్నగారు చెప్పినప్పటి నుండి అలాగే చేయడం మొదలుపెట్టాము. నాన్నగారు వచ్చే ఒక ఆరు నెలల ముందు వరకు పుట్టమ్మ గారు అనే భక్తురాలు మా సత్సంగానికి వచ్చేవారు. ఆమె డైరెక్టుగా పప్పా దగ్గర మంత్రం తీసుకున్నారు. ఆవిడ అన్నారు రామ నామము చేయండి,రాముడిని ధ్యానం చేయండి. మీ ఇంటికి ఎవరైతే వస్తున్నారో వారిని రాముడిలా భావించి సేవ చేసుకోండి అని చెప్పారు. అలా చేస్తే ఆ రాముడే మీ ఇంటికి వస్తాడు. రాముడే మీకు జ్ఞానం ఇస్తాడు అని స్వరాజ్యం గారికి చెప్పారు. అలా చెప్పిన తర్వాత సరిగ్గా ఆరు నెలలకి నాన్నగారు చిక్కడపల్లి రావటము తటస్థించింది. స్వరాజ్యం ఆంటీ నాన్నగారికి చిక్కడపల్లి భక్తులని పరిచయం చేసిన తరువాత, నాన్నగారు మా అందరికీ జ్ఞానము ఇచ్చేయండి అన్నారు. అయితే అక్కడ సన్నజాజుల మాలలు వేసి నాన్నగారు ఫోటోకి పెట్టాము. ఆ మాల మధ్యలోకి ఊడి పడిపోయింది. సరిగ్గా నాన్నగారు అదే సమయానికి మౌనంగా చూస్తూ ఉన్నారు.ఆ మాల తెగిన శబ్దం కూడా వినవచ్చింది. అలాగేనమ్మ అన్నారు నాన్నగారు. నాన్న గారి దగ్గరికి వచ్చిన తరువాత ఆత్మ యొక్క వైభవం తెలిసింది. ఆయన సమక్షంలో తండ్రి వైభవాన్ని చూస్తూ ఉంటే,లోపల ఉన్న సత్యాన్ని తెలుసుకోగలము కానీ లేకపోతే అది మనకు సాధ్యపడదు.

నాకు, నా భర్తకి నాన్నగారు మంత్ర దీక్ష ఇచ్చేటప్పుడు నా భర్తని మీకు ఏ దేవుడు అంటే ఇష్టం అని అడిగారు. ఆయన ఏమీ మాట్లాడలేదు. తర్వాత నాన్నగారు మీకు రాముడంటే ఇష్టమని రామనామం ఇచ్చారు. నాన్నగారు ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక భక్తురాలి ఇంట్లో అందరూ కూర్చుని ఉండగా మీలో మోక్షం ఎవరికైనా కావాలా అని అడిగారు. నాన్నగారు నాకు మోక్షం కావాలి అని నిలబడ్డాను. అప్పుడు నాన్నగారు ఈ అమ్మాయి మోక్షము అడుగుతోంది అన్నారు. అక్కడ ఉన్న భక్తులు అందరూ నాన్నగారు అన్న ప్రతీ మాటకీ నవ్వుతున్నారు, నాకు ఓ పక్క నుండి దుఃఖం వచ్చేస్తుంది. కానీ నాన్నగారు నాకు నిజంగానే మోక్షం కావాలి అన్నాను. అప్పుడు నాన్నగారు అన్నారు ఇది పుస్తకం పైత్యంలా ఉందండి అన్నారు. ఆ మాట నాన్నగారు ఎందుకు అన్నారో అప్పుడు తెలియలేదు కానీ ఇప్పుడు అర్ధమవుతోంది. అప్పట్లో పుస్తకంలో చదివిందే నాన్నగారిని అడిగాను.

నల్లకుంటలో రేణుగారి హాల్లో నాన్నగారు ప్రవచనం జరుగుతోందని భక్తులందరూ వెళ్ళారు. నాకు కొంచెం ఆరోగ్యం సహకరించక ఇంటిలో ఉండిపోయాను. అంతకు ముందు రోజు రాత్రి వచ్చిన భక్తురాలు మా ఇంటికి వచ్చి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాన్నగారు చిత్రపటాని చూపించి ఈయన ఎవరు అనుకుంటున్నావు నా అంశే అని నాకు స్వప్నంలోకి వచ్చి చెప్పారు. ఇప్పుడు భక్తులందరూ వెళ్లిపోయారు దయచేసి నన్ను నాన్నగారి దగ్గరకు తీసుకుని వెళ్ళు, నీకు ఆరోగ్యం ఎలా ఉన్నా సరే నేను జాగ్రత్తగా తీసుకుని వెళతాను అని చెప్పారు. అలా ఆ రోజు నాన్నగారు సంకల్పం వలన ఇద్దరం రేణుకా గారి హాల్ కి వెళ్ళాము. నాన్నగారి దగ్గరకు వెళ్ళిన తరువాత ఆ భక్తురాలుని నాన్నగారికి పరిచయం చేశాను. అప్పుడు నాన్నగారు ఆమెను నీవు ప్రవచనం అయ్యేంతవరకు కూర్చో తర్వాత మీ ఇంటికి వెళదాము అని చెప్పారు.

మా పాప కడుపులో ఉన్నప్పుడు నాకు ఆరోగ్యం బాగాలేదు అది చూసి అందరూ పుట్టే శిశువు ఏమైనా అంగవైకల్యంతో పుడుతుంది ఏమో అని భయపడ్డారు. ఆ సమయంలో నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు తెలియకుండానే దుఃఖం వచ్చేసింది. నాతో పాటుగా ఉన్న నా తల్లిదండ్రులు నన్ను ఓదార్చటానికి ప్రయత్నం చేస్తే, నాన్నగారు వారిని వారించి వద్దని చెప్పి తనకి ఎంతసేపు అలా దుఃఖం బయటకు వస్తుందో రానివ్వండి అన్నారు. అలా కొద్ది సేపటి తరువాత దుఃఖం ఆగింది. అప్పుడు నాన్నగారు ఏమైందమ్మా అని అడిగారు. నాన్నగారు నాకు ఆరోగ్యం బాగా లేదు అందువలన పుట్టే బిడ్డకు అది ఏమైనా ఎఫెక్ట్ అయ్యి పుట్టే బిడ్డ అంగవైకల్యంతో పుట్టవచ్చు అని అందరూ అంటున్నారు. అందుచేత నాకు భయం వేస్తోంది అని చెప్పాను. దానికి నాన్నగారు కళ్ళు మూసుకుని మౌనంగా ఉండి నా గర్భం వైపు చూస్తూ, నీ గర్భంలో పెరుగుతున్న శిశువు బంగారంలా ఉందమ్మా అని చెప్పారు. అప్పుడే నాకు ఆడపిల్ల పుడుతుంది అని అర్థం అయ్యింది. ఆ మాట వినగానే నాకు ఏమి అనిపించిందంటే నా గర్భంలో ఉన్న శిశువు నాన్నగారే బంగారంలా చేసి ఉంచారు అనిపించింది. అలా నాన్నగారు స్కానింగ్ తీసిన డాక్టర్ లా చెప్పారు. అప్పటినుండి నా ప్రసవం అయ్యేవరకు నాన్నగారు ఎప్పుడు వచ్చినా అక్కడికి భక్తులు తీసుకువచ్చిన దానిమ్మ పండ్లును నన్ను పిలిచి నాకు ప్రసాదంగా ఇచ్చేవారు. నాకు తొమ్మిదో నెల వచ్చిన తర్వాత ఒకరోజు లోపల శిశువుకి కదలికలు లేవు అని ఆస్పత్రిలో చేరాను. అదే సమయంలో నాన్నగారు హైదరాబాద్ లోనే ఉన్నారు. నాన్నగారు ఇక్కడ చాలా రోజులు ఉంటారు కానీ నాకు చూసే భాగ్యం లేదు అని నాన్నగారు పాదాలు ఫోటో చూస్తూ, దుఃఖిస్తూ ఉన్నాను. మరుసటి రోజు ఉదయాన్నే డాక్టర్ వచ్చి, లోపల పరిస్థితి అంతా బానే ఉంది మీరు వెళ్ళవచ్చు అని చెప్పారు. వెంటనే నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోయాను. నాన్నగారు నన్ను చూడగానే దగ్గరికి పిలిపించుకుని కూర్చోపెట్టుకుని అరుణాచల కరుణాలయా అని నా భర్త రాసిన పాటను పాడించుకున్నారు. రాత్రంతా నేను దుఃఖించినందువలన నాన్నగారు అలా ప్రేమతో ప్రతిస్పందించారు అనిపించింది.

మా అమ్మగారి ఇంట్లో నాన్నగారి ప్రవచనాలు జరిగేవి. అలా జరుగుతున్నప్పుడు మా అబ్బాయి అక్కడ ఉన్న వారితో కలిసి నామం చేస్తూ ఉండేవాడు. అలా ఒకసారి నామం చేస్తూ ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ఈలోపు భక్తులందరూ భోజనానికి వచ్చారు. నేను వాడికి భోజనం పెడదామని వాడిని వెతుక్కుంటూ వస్తున్నాను. మా అబ్బాయి పక్కనే నాన్నగారు కూర్చుని ఉన్నారు. నాన్నగారు నన్ను చూసి వీడు మన బాలశివుడు అమ్మా అన్నారు. మా అబ్బాయి ఈ మధ్య పాడిన పాటకి భక్తులందరూ చాలా బాగా పాడాడు అని ఫోన్ చేసి వారి ప్రేమని తెలియజేసారు. నాన్నగారి యొక్క అనుగ్రహ వెల్లువ వాడి మీదికి భక్తుల ప్రేమ రూపంలో పంపిస్తున్నారు ఏమో అనిపించింది. అమ్మాయికి మూడో నెల వచ్చిన తర్వాత నాన్నగారి చేత నామకరణం చేయించాము. విజయలక్ష్మి అనే పేరు పెడతాను అమ్మా. ఎక్కడికి వెళ్ళినా విజయం సాధించుకుని వస్తుంది అని చెప్పారు. అప్పుడు నా భర్త నాన్నగారి మీద అష్టోత్తరం రాశారు. నాన్నగారు పాదపూజ చేసుకుంటూ అష్టోత్రం చదివాము. అలా చదువుతూ ఉంటే, మా చిక్కడపల్లి భక్తులందరూ ఆనంద భాష్పాలు రాల్చాము. నాన్నగారు ఏది చేసినా వైభవంగానే ఉంటుంది. అలాగే నాన్నగారు ఈ పాటలను రాయించుకోవడం కూడా ఆయన వైభవంగానే ఉంది. నాన్నగారు హైదరాబాద్ వచ్చినప్పుడు మా పాపకి అక్షరాభ్యాసం చేయించాలి అనుకుని ఒక భక్తురాలిని నాన్నగారు రేపు ఉదయం అందుబాటులో ఉంటారా అని అడిగాను. ఆమె నాకు తెలియదు అని చెప్పారు. నాకు ఎందుకో తెలియకుండానే దుఃఖం వచ్చింది. తర్వాత నాన్నగారి దగ్గరికి లోపలికి వెళ్ళాను. అప్పుడే నాన్నగారు బయటకు వస్తూ నన్ను పిలిచి ఎలా ఉన్నావు భవాని అని అడిగారు. నాన్నగారు అలా అడగగానే పాపకి రేపు అక్షరాభ్యాసం మీచేత చేయ్యిద్ధామనుకుంటున్నాను నాన్నగారు అని చెప్పాను. రేపు మేము ఫలానా భక్తురాలు ఇంటిలో ఉంటాము. నన్ను అక్కడికి పాపని తీసుకుని రమ్మని చెప్పారు. ఆ మాట విని నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే మన మనసులో ఏమి అనుకుంటామో అది ఆయనకి తెలుస్తూ ఉంటుంది.

నాన్నగారు ఒకసారి ప్రవచనానికి వచ్చినప్పుడు మా కుటుంబ సభ్యులు ముప్పై మంది ఉంటారు వారికి మాత్రమే వంట చేసాము. వచ్చిన భక్తులందరినీ మా అమ్మగారు భోజనం చేయమని అడుగుతూ ఉంటే, నా మనసులో అందరిని భోజనం చేయమని అడుగుతున్నారు చేసినది సరిపోదేమో అనుకుంటూ ఉన్నాను. మేము చేసిన వంట నాన్నగారి దయవలన అక్షయపాత్రలా అయ్యి వచ్చిన భక్తులందరికీ సరిపోయింది. తరువాత శివాలయానికి నాన్నగారితో కలిసి వెళ్ళాము. అక్కడ నందీశ్వరుడు దగ్గర నాన్నగారి ఎదురుగా నిలబడి ఉన్నాను. అప్పుడు నాన్నగారు అందరూ ఈశ్వరుడు ఉన్నాడు అని లోపలికి వెళ్ళిపోతారు కానీ ఈశ్వరుడు ఎక్కడ ఉంటాడు అంటే భక్తులలో ఉంటాడు అన్నారు. భక్తులను గౌరవిస్తే భగవంతుడిని గౌరవించినట్టే. భక్తులను గౌరవించకుండా భగవంతుని గౌరవిస్తే ఆయనను గౌరవించినట్లు అవ్వదు అని నాకు చెప్పారు. అలా నాలో ఉన్న దోషాన్ని నాకు తెలియ చేసి దాన్ని నివృత్తి చేశారు. నాన్నగారు ఒకసారి గొల్లలమామిడాడ వచ్చేటప్పుడు మధ్యదారిలో బలభద్రాపురం అనే గ్రామంలో సాయిబాబా దేవాలయం ఉంది. ఆ దేవాలయానికి విరాళాలు రాకపోవటం వలన అభివృద్ధి చెందలేదు. నాన్నగారు వస్తున్నారని తెలిసి ఆ గుడిలో పూజారి గారు మా తండ్రి గారితో నాన్నగారిని ఒక్కసారి గుడికి తీసుకొని రమ్మన్నారు. అలా నాన్నగారు వెళ్ళి అక్కడ ఉన్న బాబా విగ్రహాన్ని తదేక దృష్టితో చూస్తూ ఉండిపోయారు. అక్కడ ఉన్న హుండీలో ఎంతోకొంత విరాళం సమర్పించి రెడ్డిగారు రేపటినుండి మీ గుడి అభివృద్ధిలోకి వస్తుంది విరాళాలు వస్తాయి అని చెప్పారు. నాన్నగారు ఆ గుడిని అంత ప్రేమతో తిలకిస్తూ ఉంటే, మనము మహాత్ముల దగ్గరికి పవిత్రులము అవ్వటానికి వెళతాము, మహాత్ములు అటువంటి స్థలానికి పవిత్రత ఇవ్వటానికి వెళతారు అనిపించింది. తదుపరి కాలంలో ఆ గుడి చాలా అభివృద్ధిలోకి వచ్చింది. తర్వాత అయ్యప్పస్వామి గుడికి వెళ్ళి అక్కడ నుండి ద్వారపూడిలో ఉన్న బాబా గుడికి వెళ్ళాము ఆ రోజు గురువారం అవ్వటం వలన ప్రసాదాలు ఇచ్చారు. నాతో పాటు కొంతమంది మన భక్తులు కూడా ఉన్నారు. మా అందరికీ నాన్నగారు తీర్థం ఇచ్చారు. తరువాత మా చేతిలో ఉన్న ప్రసాదాలు ఎక్కడైనా కూర్చుని తిందాము అనుకుంటున్నాము. అప్పుడు నాన్నగారు మా అందరి ప్రసాదాలు తీసుకొని నాకు ఇచ్చి మా తండ్రి గారిని పిలిచి మీరు ఇక్కడ కూర్చొని ముందు ఈ ప్రసాదం స్వీకరించండి అని చెప్పారు. మా తండ్రి గారు లేదు నాన్నగారు తరువాత తింటాను అన్నారు. కానీ నాన్నగారు ముందు మీరు తినండి, తిన్న తర్వాత బయలుదేరుదాము అని చెప్పారు. మా తండ్రిగారు నాన్నగారు వచ్చిన ఆనందంలో భోజనం చేయలేదట ఆ విషయం నాకు తరువాత తెలిసింది. నాన్నగారిది ఎంత ప్రేమో అనిపించింది.

తరువాత ఒకసారి అరుణాచలం వెళ్ళినప్పుడు, మెడిటేషన్ హాల్ లో కూర్చుని ఉన్నాము. నాన్నగారు నాకు దృష్టిని ఇస్తూ ఉంటే, అప్పుడు ఉన్న అవగాహన బట్టి ఏ సాధకుడు అయినా కొంచెం సిద్ధంగా ఉన్నాడు అంటే వాడి పని పూర్తి అయిపోతుంది అనిపించేది. నాన్నగారి ద్వారా ప్రసరించే ఆ దృష్టి అంతా తీక్షణంగా ఉంది. నాకు నాన్నగారు రెండు నేత్రాలు కనిపించటంలేదు ఒకటే నేత్రం కనిపిస్తోంది అది రాక్షసి నేత్రంలా అనిపించి, నాకు భయం వేసింది. నాకు సర్వస్వము నాన్నగారే, నా మనసు సహకరిస్తేనే కదా నాన్నగారి దగ్గరికి వెళ్తాను లేదంటే వెళ్ళలేను అని నా మనసుకి భయం పట్టుకొని నాన్న గారి దగ్గరకి వెళ్దామని అని వెళ్ళేసరికి నాన్నగారు రూమ్ లోకి వెళ్ళిపోతున్నారు. అప్పుడు పరుగున వెళ్ళి నాన్నగారు మీ కన్ను రాక్షస కన్నులా కనిపించి నాకు భయం వేసింది అని చెప్పాను. నువ్వు ఏమీ కంగారు పడకమ్మా కాసేపు విశ్రాంతి తీసుకొని వచ్చి మెడిటేషన్ హాల్లో కూర్చుని ఈ పాయింట్ గురించి మాట్లాడుకుందాము అని చెప్పి లోపలికి వెళ్ళారు. మధ్యాహ్నం వచ్చిన తరువాత నాన్నగారు గురువుకి శత్రువులు ఎవరూ ఉండరు అమ్మ నీ అహంకారమే నీకు శత్రువు. దానికి ఎలాగైనా కనపడనివ్వు, నువ్వు ఏమీ కంగారు పడకు అని చెప్పారు. అప్పుడు లోపల నా మనసు సర్దుకుని భయం తొలగింది. మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా నాన్నగారు ఎప్పుడు వస్తే అదే మంచి రోజు అనుకునే వాళ్ళం ప్రత్యేకంగా మంచి రోజు చూసే వాళ్ళం కాదు. మా అమ్మాయి ఫంక్షన్ అలాగే జరిగింది, గృహప్రవేశము కూడా అలాగే జరిగింది. గృహప్రవేశ సమయంలో నాన్నగారు చాలా నీరసంగా ఉన్నారు అందువలన నాన్నగారు రెస్ట్ తీసుకోండి మధ్యాహ్నం నుండి మా ఇంటికి వెళదాము అని చెప్పాను. నాన్నగారు నా వైపు కూడా చూడకుండా నేను 12లోపు భవాని ఇంటికి వెళ్ళాలి అని చెప్పి మంజునాద్ లో మంజునాథుడు ఎలా అయితే అడుగుపెడతాడో అలా మా గృహాములో నాన్న పాదం మోపారు. మొత్తం ఇల్లంతా తిరిగి చూసారు. మా తల్లిదండ్రులకు ఒక సమయంలో ఆర్థిక సమస్యలు వచ్చాయి. ఎవరో ఒక భక్తురాలు వచ్చి నెల్లూరులో ఉన్న గొలగమూడి వెంకయ్య స్వామి గురించి చెప్పి అక్కడికి వెళ్ళమన్నారు. నేను మా చెల్లి అక్కడికి వెళ్ళి 111 ప్రదక్షిణాలు చేస్తుంటే, నాకు తలనీలాలు ఇవ్వాలి అనే ఆలోచన వచ్చి, తలనీలాలు సమర్పించడం జరిగింది. తర్వాత హైదరాబాద్ వచ్చేసాము. మేము వచ్చిన తరువాత నాన్నగారు వచ్చారు అని దర్శనానికి వెళ్ళాము. నన్ను చూడగానే నాన్నగారు కళ్ళు పెద్దవి చేసుకుని కారణం లేకుండా తలనీలాలు ఎందుకు సమర్పించావు అని అడిగారు. స్త్రీలు ఎవ్వరూ తలనీలాలు సమర్పించవలసిన అవసరం లేదు అని చెప్పారు. మరుసటి రోజు కూడా ఇంగ్లీషులో మరలా అదే చెప్పారు. నాన్నగారు నాకు ఆ రోజు ఏమని తెలియజేశారు అంటే, అక్కడ ఇక్కడ ఉన్న భగవంతుడు ఒక్కటే, వేరు కాదు. ప్రారబ్ధాన్ని ఖర్చు పెట్టించడానికి నీ జీవితంలోకి గురువు వచ్చాడు నీవు తప్పించుకోలేవు. నీకు అన్నీ నేనే అని నాకు తెలియజేశారు. రాముడిని, కృష్ణుడిని, బాబాని చూడకపోయినా నాన్నగారు అది అంతా పూర్ణం చేసేసారు. నాన్నగారి సమక్షం చాలు అనిపించేది.

నా భర్త ఉద్యోగానికి రాజీనామా ఇవ్వాలి అనుకున్నారు. నాన్నగారు నన్ను నాభర్తని అరుణాచలం రమ్మని కబురు పంపారు. మేము అరుణాచలం వెళ్ళిన తరువాత ప్రత్యేకంగా నా భర్తను నాన్నగారు గదిలోకి పిలిచి మీరు ఉద్యోగం మానవద్దు అని చెప్పి మాట్లాడారు. కానీ నా భర్త ఎంత చెప్పినా వినకపోయేసరికి చివరికి నాన్నగారు ఇది శివుడి ఆజ్ఞ మీరు ఉద్యోగం చేయవలసిందే అని చెప్పారు. మేము హైదరాబాద్ వచ్చేసిన తర్వాత కూడా నా భర్త చెవిలో అదే మాట తరచు వినిపిస్తూ ఉండేదట. అయినా సరే, రిజైన్ లెటర్ తీసుకొని ఆయన ఆఫీస్ కి వెళ్ళి బాస్ కి ఇచ్చారు. అక్కడ ఆ బాస్ నువ్వు ఈ లెటర్ ఇస్తే నా శవాన్ని దాటి వెళ్తావు అని ఆయనకి తెలియకుండానే అన్నారట. ఇంటికి వచ్చిన తర్వాత నాకు చెబితే ఆ భాస్ ద్వారా నాన్నగారు అనిపించారు అనుకున్నాను. నాన్నగారు నా భర్తని ఒక ఎనిమిది సంవత్సరాలు ఉద్యోగం చేయమన్నారు కానీ రిటైర్ అయ్యేంతవరకు చేస్తాను అని నా భర్త అన్నారు. నాన్నగారి దయవలనే మేము ఈ రోజుకి కూడా ఆనందంగా ఉన్నాము. ఒకసారి అరుణాచలంలో నాన్నగారు రామకృష్ణుడి దగ్గరకి ఎవరో ఒక భక్తుడు వచ్చి మీరు మీ 18 మంది శిష్యులను తల్లిలా చూసుకుంటున్నారు అని అన్నాడట అని చెబుతూ నా వైపు చూసి కళ్ళు పెద్దవి చేసుకుని నన్ను జీవ లక్షణాలతో ఉన్న ఆ తల్లితో పోలుస్తావా అని అన్నారు. ఇంకా గట్టిగా అంటే నా గుండె ఆగిపోదును నాన్నగారు అని నా మనసులో అనుకుంటున్నాను. ఈ లోపు నాన్నగారు ఆ భక్తుడు కూడా అలాగే గుండె ఆగిపోదును అనుకున్నాడట అన్నారు. ఒకసారి కృష్ణుడి గురించి చెబుతూ నాన్నగారు ఆ తన్మయత్వంలో ఉన్నారు. అప్పుడు మా అమ్మాయి విజయ ఫోన్ చేసి నాన్నగారికి నమస్కారాలు చెప్పమంది. నేను లేచి నిలబడి నాన్నగారు మీకు విజయ నమస్కారాలు చెప్పమంది అన్నాను. నాన్నగారు నెమ్మదిగా ఎవరు విజయ అంటే, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు ఆ గోల నీకేలా అన్నారు. ఆ రోజున నాన్నగారు మేడ మీద నుంచి గదిలోకి వెళ్ళటానికి రెండు గంటల సమయం పట్టింది ప్రతి భక్తుడు దగ్గర ఆగుతూ కృష్ణుడి గురించి మాట్లాడుతూ వెళ్ళారు. నాన్నగారు ఏ మహాత్ముడు గురించి మాట్లాడినా, ఆ మహాత్ముడు అయ్యి మాట్లాడేవారు. అందుకే మనము ఆయన సన్నిధిలో కరిగిపోయే వాళ్ళము. నాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ నాన్నగారు సత్సంగాల ద్వారా నాన్నగారి ప్రవచనాలతో చాలా సహాయం లభించేది.

మా అమ్మాయి చదువు నిమిత్తం కేరళ వెళ్ళవలసి వచ్చింది. కానీ అక్కడ నాన్ లోకల్ సమస్య వస్తుందని భయపడి నాన్నగారితో విన్నవించుకుంటే, ముందు పరీక్ష రాయనివ్వు తరువాత చూద్దాము అన్నారు. నాన్నగారి దయ వలన మా అమ్మాయి చదువుకి ఏ ఆటంకమూ కలగలేదు. నాన్నగారు సర్వసమర్థుడు, ఈ సృష్టిలో ఏ పని అయినా ఆయనకు సాధ్యమే. నాన్నగారితో పాటు కాశీ వెళ్ళి, అక్కడ నుండి గయకు వెళ్ళాము. గయలో విష్ణుపాదాని చూసి నాన్నగారు పాదాలను చూస్తే అచ్చుగుద్దినట్టు నాన్నగారి పాదాలు విష్ణు పాదాలు లాగానే అనిపించాయి. కాశీలో కొంత మంది భక్తులతో కలిసి అక్కడ కొన్ని ఘాట్లు ఉంటే గంగానదిలో పడవలో దర్శనం చేసుకోవటానికి వెళ్ళాము. వర్షం పడటం వలన అన్ని పడవలు ఆగిపోయినా, మా పడవను నడిపే అతను మాత్రం మమ్మల్ని తీసుకు వెళ్ళటానికి అంగీకరించాడు. మధ్యలో ఒక గుడి ఉంటుంది. ఆ గుడి దగ్గర నుండి పడవ ముందుకి కదలడం లేదు. ఆ పడవ నడిపే వ్యక్తి చాలా భయంతో, పడవను కదపటానికి ప్రయత్నిస్తున్నాడు. అక్కడ ఉన్న భక్తులులో ఒకరు ఆ పడవ నడిపే వారిని ఏమయింది అని అడిగితే, పడవ ముందుకి కదలటం లేదు. మెలి తిరుగుతోంది ఇలా తిరిగితే నీరు పడవని ముంచేస్తుంది అన్నాడు. అయినా కానీ మన భక్తుల ముఖాలాలో ఎవరికీ మరణ భయం కనిపించలేదు అందరూ చాలా ఆనందంగా రామనామము చేసుకున్నాము, అమ్మవారి మీద పాటలు పాడుకున్నాము. మాకు ఈ సంఘటన జరిగే సమయంలో అక్కడ నాన్నగారు మా గురించి ఎక్కడికి వెళ్ళారు అని అడిగారట. ఎవరికీ చెప్పకుండా దేవాలయాలు దర్శనార్థం వెళ్ళారు నాన్నగారు అని అక్కడ ఉన్న భక్తులు చెప్పారట. నాన్నగారు ఆ మాట వినగానే, నిద్ర పోకుండా చెయ్యి పైకి ఎత్తి అభయ హస్తం చూపిస్తూనే ఉన్నారట. ఈ లోపు పడవనడిపే ఆయన దగ్గరలో ఉన్న ఘాట్ లోకి పడవలో ఉన్న తాడుని విసిరాడు ఆ తాడుని ఆ ఘాట్ లో ఉన్న వ్యక్తులు అక్కడ ఉన్న గునపానికి గట్టిగా మెలిపెట్టి పడవను నెమ్మదిగా ఆ ఘాట్ దగ్గరకు లాగారు. అలా నాన్నగారి దయతో మేము అందరము ప్రమాదం నుండి తప్పుకుని ఘాట్ దగ్గరికి చేరుకున్నాము. మా అమ్మాయికి సంబంధించిన ప్రతీ విషయము నాన్నగారే స్వయంగా చూసుకుంటున్నారు అనిపిస్తుంది. తన వివాహ విషయం ఎప్పుడైనా ప్రస్తావిస్తే మీ అబ్బాయికి మీరు చూసుకోండి కానీ అమ్మాయి విషయానికి వస్తే నాకు చెప్పండి. నేను ఆలోచించి చెబుతాను దాన్నిబట్టి చేద్దాము అన్నారు. నాన్నగారు షష్టిపూర్తికి చిక్కడపల్లి భక్తులు అందరం జిన్నూరు వెళ్ళాము. కన్నమ్మ గారు మమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా భోజనానికి ఆహ్వానించి చాలా ప్రేమగా స్వయంగా ఆమె వడ్డించారు. మేము ఇక చాలు కన్నమ్మ గారు మా కడపు నిండిపోయింది అంటే, నేను మీ కడుపు నింపుతాను, నాన్నగారు మీ మనస్సులు నింపుతారు అన్నారు. నాన్నగారు శివ స్వరూపమే కదా, శివుడి దగ్గర అమ్మవారు మాత్రమే ఉండగలరు. అలా కన్నమ్మ గారు అమ్మవారి స్వరూపం. నాన్నగారు కన్నమ్మ గారితో చిక్కడపల్లి భక్తులు అని ఉంటారు, వారందరూ గోపికలు అన్నారట.

No comments:

Post a Comment