Sunday, October 3, 2021

"శ్వాస పోయినా విశ్వాసం చెదరకూడదు" - (By శ్రీనివాస్ గారు)

నాన్నగారిని మనం పట్టుకున్నాము అనడం కంటే, నాన్నగారే మనల్ని పట్టుకున్నారు అనటమే సరియైనది. ఎందుకంటే! మనం నాన్నగారిని పట్టుకుంటే ఎప్పుడో వదిలేసేవాళ్ళము. ఆయనే మనల్ని పట్టుకోవడం వలన మనకి ఆయన మీద ఇష్టాన్ని, ప్రేమని ఆయనే కలిగించుకుని, ఈ జీవితానికి సరిపడే తీపి జ్ఞాపకాలను నింపారు. నాన్నగారు మన చెయ్యిపట్టి నడిపించారు అనే మాట కంటే, ప్రతి సంఘటనలోను మనల్ని ఎత్తుకుని తీసుకెళ్తున్నారు అని సత్వగుణంలో ఉన్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి మనం రజో, తమో గుణాల్లో ఉన్నప్పుడు దానిని గుర్తించలేము. మోక్ష జ్ఞానాల గురించి మాట్లాడలేకపోయినా, నాన్నగారి సమక్షంలో గడిపిన కొన్ని మధురమైన సంఘటనలు మీతో పంచుకుంటాను.

మొట్టమొదటిగా నేను నాన్నగారి దగ్గరకు వెళ్ళడానికి, అలా వెళ్ళినప్పుడు ఆయనతో గడిపే అవకాశం లభించడానికి కారణమైన, నా కుటుంబ సభ్యులకు, నాన్నగారి భక్తులకు, అలాగే నాన్నగారి కుటుంబ సభ్యులకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాన్నగారితో నాకు ఏర్పడిన ఈ అనుబంధం ఈ జన్మలోది కాదేమో, అది పూర్వజన్మ సుకృతం అనిపిస్తుంది. మనం పూర్వ జన్మలో చేసుకున్న సాధనను బట్టి మనకు ఏ కుటుంబంలో జన్మను ఇవ్వాలి అనేది ఈశ్వరుడు నిర్ణయిస్తాడు అని నాన్నగారు చెబుతారు కదా! అలా నాన్నగారి దయవలన, భక్తుల కుటుంబంలో జన్మించడం జరిగింది.

నాకు సుమారు నాలుగు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు శ్రీ నాన్నగారిని మొట్టమొదటిసారిగా శృంగవృక్షంలో మా అమ్మగారితో పాటు దర్శించుకున్నాను. అప్పటికి మా కుటుంబ సభ్యులకు నాన్నగారిని తరచూ దర్శించుకునే భాగ్యము ఉండేది కాదు. మరొకసారి నేను నాలుగవ తరగతి చదువుతున్నప్పుడు, శృంగవృక్షంలో అరుణాచల జ్యోతికి నాన్నగారి దర్శనం చేసుకున్నాను. ఆ తరువాత మా తండ్రి గారి వృత్తిరీత్యా మా కుటుంబం నౌడూరు అనే గ్రామము రావటం జరిగింది. అలా ఆ గ్రామము వెళ్ళటమే, మా జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ ఊర్లో మా ఇంటి ప్రక్కనే నాన్నగారు భక్తులు ఉండడం వలన, తరచూ మా అమ్మగారు వారితో పాటు శ్రీ నాన్నగారి దర్శనానికి వెళుతూ, మమ్మల్ని కూడా తీసుకొని వెళ్ళేవారు. అప్పుడు నేను 8వ తరగతి చదువుతున్నాను. నాకు అప్పట్లో భక్తి తెలియకపోయినా, నాన్నగారు చాలా ప్రేమగా పలకరించి, ఆయన మీద ఇష్టాన్ని, ప్రేమను కలుగజేసుకున్నారు. నా చదువు విషయంలో తగిన సలహాలు ఇస్తూ మార్గనిర్దేశం చేసేవారు. నా పదవ తరగతి అయిన తరువాత, ఇంటర్మీడియట్ లో నాన్నగారు నన్ను MPC గ్రూపు తీసుకోమన్నారు. అలా నాన్నగారి సలహాతో గుడివాడ హాస్టల్లో ఉండి ఇంటర్మీడియట్ చదువుకున్నాను. ఆ సమయంలో ఒకసారి నాన్నగారు అరుణాచలం నుంచి భీమవరం వస్తుంటే, తెల్లవారుజామున గుడివాడలో నాన్నగారిని దర్శనం చేసుకోవటానికి రైల్వేస్టేషన్ కి వెళ్ళాను. ట్రైన్ వచ్చిన తరువాత నాన్నగారు ఉన్న భోగీ లోకి వెళితే, ఆ సమయంలో నాన్నగారు ఇంకా నిద్రలేవలేదు అని, అక్కడ ఉన్న భక్తులు దూరం నుండి నమస్కారం చేసుకోమన్నారు. నాన్నగారు సడన్ గా మేల్కొని నన్ను అత్యంత ప్రేమతో ఆశీర్వదించారు. అది చాలా చిన్న సంఘటనే అయినప్పటికీ, నాకు అది మరచిపోలేని మధురమైన సంఘటన. ఆ సంఘటన ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నా, నాన్నగారు నాపై ఎంతో ప్రేమ కురిపించారు అనిపిస్తూ ఉంటుంది. అలా చదువుకునే రోజుల్లో ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడైనా ప్రవచనాలు ఉంటే వెళ్ళేవాడిని. అప్పుడు నాన్నగారు ఎంతో ప్రేమగా నా యోగ క్షేమాలు అడుగుతూ, ఆయనపై ప్రేమ కలిగేటట్టు చేసుకున్నారు. నాకు ఇంటర్ అయిన తరువాత నాన్నగారితో కలిసి నేను మొట్టమొదటిసారిగా అరుణాచలం వెళ్ళాను. తర్వాత ఇంజనీరింగ్ నూజివీడులో చదువుకున్నాను. కాలేజీకి సెలవులు ఇచ్చినప్పుడు నాన్నగారి దర్శనానికి వెళ్లేవాడిని. నాకు నాన్నగారు చెప్పే సబ్జెక్ట్ తెలియకపోయినా, ఆయన చూపించే ప్రేమకు ఆయన వైపుకు ఆకర్షితుడిని అయ్యేవాడిని. ఇంజనీరింగ్ పూర్తి అయిన తరువాత, ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తూ హైదరాబాదులో ఉండేవాడిని. అలా నాన్నగారు హైదరాబాద్ వచ్చినప్పుడు, నాన్నగారి దగ్గరికి వెళ్ళేవాడిని.

తర్వాత నాకు మాచర్ల ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్ గా జాబ్ వచ్చింది. నాన్నగారు కొమ్మరలో ఉంటే ఆశీర్వాదము తీసుకుందామని వెళ్ళాను. నేను వెళ్ళేసరికి నాన్నగారు మరొక చోటకు వెళదామని బయలుదేరుతున్నారు, నన్ను చూసి నన్ను ఆశీర్వదించి, అక్కడ నుండి కారులో ఆయనతో పాటు కలిసి ప్రయాణం చేసే అవకాశం ఇచ్చారు. అలా ప్రతి సంఘటనలోనూ ఆయనే మనకి ఆయనపై ప్రేమ కల్పిస్తూ, నెమ్మది నెమ్మదిగా ఆయన వశం చేసుకున్నారు. మాచర్లలో లెక్చరర్ గా ఒక సంవత్సరం పని చేశాను. తర్వాత భీమవరం కాలేజీలో లెక్చరర్ గా జాయిన్ అయ్యాను. అప్పటి నుండి నాన్నగారి దర్శనభాగ్యం బాగా కలిగేది. భీమవరం చుట్టుపక్కల నాన్నగారు చెప్పే ప్రవచనాలకి వెళ్ళేవాడిని, అలా తరచూ నాన్నగారి దర్శనానికి వెళ్ళడం జరిగేది. అలా ఒక సంవత్సరం అయిన తర్వాత నాకు M.Tech చదవటానికి హైదరాబాదులోని, తిరుచునాపల్లిలో రెండు చోట్ల సీట్లు వచ్చాయి. నాకు ఎక్కడ జాయిన్ అవ్వాలో అర్థం అవ్వక, నాన్నగారిని అడుగుదామని వెళ్ళి అడిగాను. అప్పుడు జిన్నూరు లో నాన్నగారు అరుగు మీద కొంత మంది భక్తులు కూర్చుని ఉన్నారు. వారిలో ఒక ఇంజనీర్ గారు కూడా ఉన్నారు, నాన్నగారు వారిని అడిగి, వారి సలహా తీసుకుని, నన్ను తిరుచునాపల్లి లో జాయిన్ అవమని చెప్పారు. ఆ విధంగా నాన్నగారి ఆశీర్వాదంతో తిరుచునాపల్లి వెళ్ళాను. ఆ సమయంలో నాన్నగారు అరుణాచలం వచ్చినప్పుడు, నేను కూడా వెళ్ళి నాన్నగారి దర్శనం చేసుకుని వస్తూ ఉండేవాడిని. ఒకసారి హాస్టల్ లో మధ్యాహ్నం పడుకొని ఉన్నాను. అప్పటికీ ఈ జ్ఞానం, మోక్షం అనే వాటి మీద నాకు ఏమీ తపన ఉండేది కాదు. అప్పుడు నాకు ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో నాన్నగారి పాదంతో నా మనసుని నొక్కిపెట్టి, లోపలికి పంపిస్తున్నారు, కానీ నాకు పవిత్రత లేకపోవటం వలన, ఉక్కిరిబిక్కిరి అయ్యి బయటకు వచ్చేస్తున్నాను, నాన్నగారు లోపల వస్తువు ఎంత పవిత్రంగా ఉందో, నువ్వు కూడా అంత పవిత్రంగా ఉంటే అది లభిస్తుంది అని చెబుతున్నారు, అలా ఆ స్వప్నం కరిగిపోయింది. ఇది నాన్న గారి దయ వలన కలిగిన, మొట్టమొదటి ఆధ్యాత్మిక అనుభూతి. M.Tech చదువుకునే సమయంలో, నాన్నగారి దగ్గరికి వచ్చినప్పుడు నాన్నగారు నన్ను తిరుచునాపల్లికి దగ్గరగా ఉండే పుణ్యక్షేత్రాలను ఏమైనా దర్శించుకున్నవా అని ఎంతో ప్రేమతో అడిగి తెలుసుకుంటూ ఉండేవారు.

M.Tech అయిన తర్వాత, మరల భీమవరం కాలేజ్ లో లెక్చరర్ గా జాయిన్ అయ్యాను. నాన్నగారు 2009 లో September లో పుట్టిన రోజు అయిన తర్వాత కాశీ వెళ్ళారు. వారితో పాటు నేను కూడా వెళ్ళాను. సెప్టెంబర్ 28న ఈ దేహం పుట్టినరోజు. అదే రోజు విజయదశమి కూడా వచ్చింది. ఆరోజు ఉదయాన్నే నాన్నగారి ఆశీర్వాదం కోసం వెళ్ళాను. అప్పుడు నాన్నగారు నన్ను నీ వలన అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు తరిస్తాయి అమ్మ అని ఆశీర్వదించారు. నాన్నగారు ఇచ్చిన ఆశీర్వాదం ఎప్పుడు తలచుకున్నా, ఆనందం అనిపించి, ఆ అర్హత కూడా ఆయనే ఇవ్వాలి, అలా ఆయనే ప్రిపేర్ చేస్తారు అనిపిస్తుంది. రాముడు జటాయువుకి అంతిమ సంస్కారం చేసినప్పుడు, “మహాత్ములు, మహర్షులు, గొప్ప,గొప్ప తపస్సులు చేసిన వారు ఏ లోకానికి అయితే వెళ్తారో ఓ జటాయువు నువ్వు కూడా ఆ లోకానికి వెళతావు, ఇది రామాజ్ఞ” అంటారు కదా! అలాగే ఇది నాన్నగారి ఆజ్ఞ. అయితే నాన్నగారు మీద విశ్వాసం మనకు చెక్కుచెదరకుండా ఉండాలి. నేను ఎప్పుడూ కూడా నాన్నగారిని మీ పాదాలను వదలకుండా పట్టుకునేటట్టు అనుగ్రహించండి అని ప్రార్థించేవాడిని. ఆయన పాదాలను పట్టుకుని ఉంటే, ఆయనే తీసుకువెళ్తారు, కాకపోతే ఈ మాయలో పడిపోయి నాన్నగారి పాదాల మీద విశ్వాసం కోల్పోకూడదు. నువ్వు బుద్ధిమంతుడువి నువ్వు తరిస్తావు అమ్మ అని ప్రోత్సహించేవారు.

2009లో కాశీలో నాన్నగారి సమక్షంలో నా పుట్టిన రోజు జరుపుకోవటం అనేది నాకు ఒక మధురానుభూతి. ఒకసారి ఏదో ఒక సమస్య వలన నాకు బాధ కలిగి నాన్నగారికి విన్నవించుకున్నాను. అప్పుడు నాన్నగారు “మనం గుడిలో ఉన్న ఏ దేవుడినీ అయితే పూజిస్తామో, ఆ దేవుడు మన అందరి హృదయాలలో ఉండి వారి ప్రారబ్దం ప్రకారం ఆడిస్తాడు కాబట్టి దాని గురించి మనం చింతించనవసరం లేదు” అన్నారు. నాన్నగారు చెప్పిన ఈ వాక్యము నాకు చాలా శక్తిని ఇచ్చి, నాపై ప్రభావితం చూపింది. నాన్నగారు స్వప్రయత్నం, కాల పరిపక్వం, ఈశ్వర కటాక్షం అంటారు. నాకు స్వప్రయత్నం లేదు, కాల పరిపక్వము గురించి తెలియదు. ఆయన ఏమి చేసుకోవాలనుకుంటున్నారో అది ఆయనే చేసుకోవాలి, అంతా ఆయన అనుగ్రహమే. నాన్నగారు ఇంటి దగ్గర దర్శనం చేసుకోవటం, ఆయన సమక్షంలో ఏకాంతంగా కొద్దిసేపు గడపటం ఇలాంటివి ఎక్కువ నా హృదయానికి హత్తుకునేవి. నా జీవితంలో నాకు ఎదురు అయిన, ప్రతి సంఘటన నాన్నగారితో ముడిపడి ఉంది.

2011 సెప్టెంబర్ 1 వినాయక చవితి అయింది. ఆ రోజు భగవాన్ అరుణాచలంలో అడుగుపెట్టిన రోజు కదా! నాన్నగారు ఐ భీమవరం లో ప్రవచనం పెట్టారు. నేను పనిచేసే చోటు నాకు ఏమైనా ఇబ్బంది ఉంటే అది నాన్నగారితో చెప్పుకునే వాడిని. అలా నేను నా ఉద్యోగ విషయంలో వచ్చిన సమస్యను చెప్పు కున్నప్పుడు, కాలేజీలో పని నేను ఏ విధంగా చేసుకోవాలో కూడా నాన్నగారు నాకు సూచించారు. నువ్వు Administration విభాగంలో ఉన్నావు కాబట్టి, ఎవరు ఏ పనికి సరి పోతారో, కరెక్ట్ గా వారిని ఆ ప్లేస్ లో పెట్టు. అప్పుడు నీకు పని చేసుకోవటం సులభం అవుతుంది అని చెప్పి, అక్కడ ఉన్న వారితో, వీడు వచ్చి నాతో చెప్పుకున్నాడు, వీడికి ఇబ్బంది ఏమీ ఉండదు అలవాటైపోతుంది అనే అభయమిచ్చి, ఆ భారం కూడా ఆయనే వహించారు. అలా నాన్నగారు ప్రతి ఒక్క భక్తుల విషయంలో వారి యోగక్షేమాలను తెలుసుకుంటూ, ఆధ్యాత్మిక జీవితంలోనే కాకుండా బాహ్య జీవితంలో కూడా ఎలా సమన్వయ పరచుకుంటూ జీవించాలో చక్కగా వివరించేవారు. ఒక్కొక్క భక్తుని ఒక్కోరకంగా తరింప చేస్తారు అన్నట్టు ఒకరిని చూపుతో, ఒకరిని మాటతో, ఒకరిని టచ్ తో, అనుగ్రహిస్తూ, నాన్నగారు సహజంగా అందరిని తరింపచేస్తారు. వారి మనస్తత్వాన్ని బట్టి ఏమి చేయాలో నాన్నగారికే తెలుస్తుంది. అలా నాన్నగారు భక్తులు అందరిపై ఎంతో ప్రేమ కురింపించేవారు.

2015 సంక్రాంతి సెలవుల్లో బేలూరు మఠం వెళ్ళాలి అనుకొని, వెళ్ళే ముందు నాన్నగారికి చెప్పాము. నాన్నగారు వెళ్ళి రమ్మని ఆశీర్వదించారు. అక్కడ మూడు రోజులు ఉండి తిరిగి వచ్చి, వెంటనే నాన్నగారి దర్శనానికి వెళ్ళాను. నేను రావడం చూసి నాన్నగారు “రామకృష్ణుడు వస్తున్నాడు” అన్నారు. రామకృష్ణుడు ఫోటో ఒకటి, “రామకృష్ణుడు, శారదామాత, వివేకానందుడు” ముగ్గురు కలిసి ఉన్న ఫోటో ఒకటి, కొన్ని బుక్స్ తీసుకువెళ్ళి నాన్నగారికి ఇచ్చాను. బేలూరుమఠం వెళ్ళి వచ్చిన తరువాత “బుద్ధిమంతుడు” అని సంబోధించడం మొదలుపెట్టారు. “కర్తలేని కర్మ చేసేవాడిని బుద్ధిమంతుడు అంటారు” అని చెప్పారు. కానీ నేనేమో కర్తలేని కర్మను చేయట్లేదు, నాన్నగారు బుద్ధిమంతుడు అంటున్నారు. మనకి అలా చేసే శక్తిని ఆయనే కలగజేయాలి అనుకునేవాడిని. నాన్నగారు ఒకసారి “బేలూరు మఠానికి వెళ్ళి వచ్చావు కదా, అక్కడ ఏమేమి చూసావో! నీ అనుభవం చెప్పు” అని అడిగారు. అప్పుడు “నాన్నగారు, చూడటం అయితే చూసి వచ్చాను గాని లోపల పవిత్రత లేకపోవడం వలన నాకు ఏమీ అర్థం కాలేదు” అని చెప్పాను. అప్పుడు నాన్నగారు “You are right” అన్నారు. అర్హత లేనప్పుడు భగవంతుడు వచ్చి మన పక్కన కూర్చున్నా గుర్తించలేము.

2015 శివరాత్రికి నాన్నగారు భీమవరం వచ్చారు. అక్కడ కూడా నాకు అవకాశం బాగా ఇచ్చేవారు ఏమైనా నాతో మాట్లాడాలా అని అడిగేవారు. అప్పుడు నేను “మీరు కర్తలేని కర్మ చేయమంటున్నారు కదా నాన్నగారు, నేను అది చేయలేకపోతున్నాను” అని చెప్పాను. అప్పుడు నాన్నగారు “కర్తలేని కర్మ చేయటం నీకు అలవాటు అవుతుంది” అని అభయమిచ్చారు. 2015 ఆ సమయంలో జీవుడు అంటే, రాగద్వేషాలు ఉంటాయి కదా! నాకు మా తాతయ్య గారికి కొన్ని మనస్పర్థల కారణంగా, నేను మా తాతయ్య గారి ఇంటికి వెళ్ళే వాడిని కాదు. అలా చాలా రోజులు వెళ్ళలేదు. ఒకసారి నాన్నగారి సమక్షంలో “పరిస్థితి ఇలా ఉంది నాన్నగారు” అని విన్నవించుకున్నాను. ఎందుకు అలా ఉంది అని అడిగారు. “అహంకారం నాన్నగారు” అన్నాను. “ఎవరికి అహంకారం” అని అడిగారు; నాకు, తాతయ్యకు అన్న ఉద్దేశంతో, “ఇద్దరికీ నాన్నగారు” అని చెప్పాను. అప్పుడు నాన్నగారు కొంతసేపు మౌనం వహించారు. తర్వాత కళ్ళు తెరచి “మనమే వదిలేసుకుందాము అమ్మా” అన్నారు. నాన్నగారు చెప్పిన “మనమే వదిలేసుకుందాము” అనే మాట కేవలం మాట కాదు, “ఒక శక్తి తరంగం”. ఆ మాట ద్వారా నాలో శక్తిని నింపి, నన్ను మా తాతయ్య గారి ఇంటికి వెళ్లేట్టు చేసి ఆ పరిస్థితి చక్కదిద్దారు.

ఒకసారి నేను నాన్నగారు దర్శనానికి వెళ్ళేసరికి, అప్పుడే నాన్నగారు వైజాగ్ నుండి జిన్నూరు వచ్చారు. “ఎలా ఉన్నావు, హ్యాపీ గా ఉన్నావా?” అని అంటూ, “స్పిరిచువల్ గా ఎలా ఉన్నావు?” అని అడిగారు. “బాధగా ఉంది నాన్నగారు స్పిరిచువల్ గా ప్రోగ్రెస్ చేయలేకపోతున్నాను” అని చెప్పాను. అప్పుడు నాన్నగారు “నేను నిన్ను హార్ట్ లోకి తీసుకుంటాను” అని చెప్పారు. ఆయన హార్ట్ లోకి తీసుకుంటే మనము కరిగిపోతాము అనిపించింది. 2016, 2017 లో నాన్నగారిని దర్శించుకోవటానికి వర్మగారు, మురళిగారు రూపంలో నాన్నగారు నాకు ఎక్కువ అవకాశం కల్పించారు. అందువలన నాన్నగారు భీమవరం వస్తె, నాకు పండుగ వాతావరణంలా అనిపించేది.

2016 సంక్రాంతికి భక్తులందరూ జిన్నూరులో శ్రీ నాన్న గారి సమక్షంలో కూర్చుని ఉన్నాము. ఆ సమయంలో నాకు అంత తపనగా కూడా ఏమీలేదు. నాన్నగారు ప్రవచనం చెబుతూ ఉంటే, భక్తులు ఎవరో పూలదండ తీసుకు వచ్చి, నాన్నగారి మెడలో వేసారు నేను అప్పుడు చాలా డల్ గా ఉన్నాను. ఆ పూల దండ తీసుకుని నాన్నగారి నా మెడలో వేసి ఎంతో ప్రేమగా అభయం హస్తంతో ఆశీర్వదించి, పండగ కాబట్టి భక్తులు అందరూ ఉన్నారు, అందువలన నువ్వు సబ్జెక్టు చెప్పు అని రెండు మూడు సార్లు అన్నారు నాన్నగారు. మనం ఏమి చెప్పగలము అనుకున్నాను. నాన్నగారితో, “నాన్నగారు నిన్న మీరు ఎండుటాకు చెట్టు నుండి రాలిపోయిన తర్వాత అది గాలికి ఎక్కడ పడినా సరే, ఎటు ఎగిరి వెళ్లినా సరే, ఎవరకి పిర్యాదు చేయదు. అలా మన ప్రారబ్దం ఎలా వున్నా ఈశ్వర సంకల్పానికి వదిలివేయాలి. భక్తులు అలా ఉండాలి అని చెప్పారు కదా! ఆ వాక్యం భాగా నచ్చింది, కానీ నాకు ఆ వాక్యం యొక్క లోతు తెలియలేదు నాన్నగారు” అని చెప్పాను. “లోతు తెలియాలి అంటే ఆ వాక్యాన్ని మనం మననం చేసుకోవాలి” అని నాన్నగారు అన్నారు. బ్రెయిన్లో వాక్యాన్ని మననం చేసుకోగా ఆ వాక్యం యొక్క లోతు అర్థం అవుతుంది అని చెప్పారు. అప్పటికే నాన్నగారు దేహం కొద్దిగా నీరసించటం మొదలైంది.

నాన్నగారు భీమవరంలో ఉండగా రోజు ఉదయాన్నే న్యూస్ పేపర్ పట్టుకుని వెళ్ళేవాడిని. భీమవరంలో మురళిగారి ఇంట్లో నాన్నగారు బ్రష్ చేసుకుంటుంటే, నాన్నగారి దేహం ఒకోసారి తూలుతూ ఉండేది అప్పుడు నన్ను పట్టుకోమనేవారు. కృష్ణుడు మధురాష్టకం ఉంటుంది కదా! “అధరం మధురం, వదనం మధురం” అని అలా నాన్నగారు ప్రతి దినచర్య కూడా “ఆయన బ్రష్ చేసుకోవడం, పౌడర్ రాసుకోవడం, తలకు కొబ్బరి నూనె రాసుకునే విధానం” అంతే మధురంగా ఉండేది అని ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది. 2017 లో ఈ దేహం పుట్టిన రోజుకి ఆయన ఆశీర్వాదం కోసం జిన్నూరు వెళ్ళాను. అంతకు ముందు రోజు నాన్నగారికి ఆరోగ్యం బాగోలేదు అని నాకు తెలియదు. ఆరోజే నాన్నగారికి హైదరాబాద్ ప్రయాణం ఉంది. దేహం అంత నీరసమైన స్థితిలో ఉన్నా Bless చేసి Happiness నింపారు. మరలా తిరిగి హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు భీమవరం వచ్చారు అప్పుడు నాన్నగారికి skin rashes వచ్చాయి. అప్పుడు నాన్నగారు దగ్గర ఉండడానికి నాకు అవకాశం లభించింది. నాన్నగారు మధ్యాహ్నం భక్తులతో కూర్చున్నారు. నాన్నగారికి ఆరోజు స్వప్నంలో రామకృష్ణుడు, శారదామాత కనిపించారట. శారదా మాత ఏమీ అనలేదు కానీ రామకృష్ణుడు నీకు ఇప్పుడే ఇలా రావాలా అన్నాడు అని చెప్పి, రామకృష్ణుడుకి “నేను వెళ్ళడం ఇష్టం లేదు ఇప్పుడు” అన్నారు. అప్పుడు “వెళ్ళడం” అన్న మాటకి నాకు అర్థం తెలియక నాన్నగారు సహజంగానే అన్నారు అనుకున్నాను. అప్పటి నుండి ఆయనే రామకృష్ణుడు అయిపోయారు. ఆయనకు ఆరోగ్యం సహకరించకపోయినా, నిరంతరాయంగా రెండు మూడు గంటలు రామకృష్ణుడు సబ్జెక్ట్ చెప్పేవారు. ఆరోజు నేను కాలేజ్ పని మీద హైదరాబాద్ వెళ్ళవలసి వచ్చింది. నాన్నగారి దగ్గర సెలవు తీసుకుందాము అని వెళ్తే మళ్ళి నన్ను ఆయన పాదాల దగ్గర కూర్చోబెట్టుకుని రామకృష్ణుడు సబ్జెక్ట్ చెప్పారు. నాన్నగారి దగ్గర కూర్చుని అలా మాట్లాడటం అదే ఆఖరిసారి అయింది. తర్వాత దర్శనానికి వెళ్లాను కానీ అంత దగ్గరగా మాట్లాడటం అదే ఆఖరిసారి.

తర్వాత నాన్నగారు వైజాగ్ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన దగ్గర నాలుగైదు రోజులు ఉండే అవకాశం వచ్చింది. నాన్నగారు జిన్నూరు వచ్చిన తర్వాత కూడా అప్పుడప్పుడు వచ్చి నైట్ నాన్నగారి దగ్గర ఉండే అవకాశం కలిగింది. అలా జీవితంలో ప్రతి సంఘటనలోను నన్ను అనుగ్రహిస్తూ, ఎంతో ప్రేమని నింపారు అది ఈ జన్మకి సరిపోతుంది అనిపిస్తుంది. జ్ఞానం,మోక్షం ఎలా ఉన్నా, నాన్నగారి పాదాల మీద విశ్వాసం కోల్పోకుండా ఉంటే చాలు అనిపిస్తుంది. నాన్నగారు హైదరాబాద్ వెళ్తుంటే పాలకొల్లు రైల్వేస్టేషన్లో దర్శనాలు, భీమవరం రైల్వేస్టేషన్ లో దర్శనాలు, అలా ప్రతి క్షణం నాన్నగారి సమక్షంలో ఉండటం అనేది ఒక మహద్భాగ్యం, పూర్వజన్మ సుకృతం. పూర్వజన్మలో ఏ తపస్సు చేశామో తెలియదు కానీ ఈ జన్మలో అయితే నా వైపు నుంచి స్వప్రయత్నం లేదు అని తెలుస్తోంది. 2017 ఆ సమయంలో భక్తుల ముందు “వీడు సేవ చేస్తున్నాడమ్మా” అనేవారు నాన్నగారు. అవకాశం ఇచ్చింది ఆయనే కదా! మనము ఏ పాటి సేవ చేస్తున్నామో మనకు తెలుసు, నాన్నగారికి తెలుసు. అలా ఎందుకు అనేవారో అప్పుడు అర్థం అయ్యేది కాదు కానీ ఇప్పుడు అది గుర్తుకు వస్తూ ఉంటే, ఏమని అనిపిస్తుంది అంటే, “పరీక్షల్లో కాకి బొమ్మ గియ్యమని చెప్పి 4 గీతలు గీసిన తర్వాత, కింద కాకి అని రాస్తే ఏవో మార్కులు వేసి పాస్ చేసేస్తారు కదా టీచర్”. టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న మా లాంటి వారే అలా ఆలోచిస్తే, ఆయన ఆచార్యులు కదా! మనం చేసే చేష్టలకి 4 గీతలు గీసాము ఏమో, మనం కాకి అని కూడా రాయలేదు. నాన్నగారే కాకి అని పేరు రాసి మార్క్స్ ఇచ్చేస్తున్నారు అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. దానికి నాన్నగారు “సేవ” అని పేరు పెట్టారు అని అనుకుంటూ ఉంటాను. శ్వాస పోయినా విశ్వాసం పోకూడదు అంటారు కదా! ఏ సమయానికి ఎలా ఉంటామో తెలియదు. మనకి ఇలాంటి మహా గురువు లబించారు కాబట్టి శ్వాస పోయేవరకు విశ్వాసంగా ఉంటే ఆయనే చూసుకుంటారు. ఈశ్వరుడికి అసాధ్యం లేదు.

No comments:

Post a Comment