Sunday, September 26, 2021

"నాన్నగారి అంతులేని ప్రేమ ప్రవాహం" - (By పద్మ గారు (హైదరాబాద్))

నాన్నగారు రాముడు గురించి చెబుతున్నప్పుడు రాముడిలా, కృష్ణుడి గురించి చెబుతున్నప్పుడు కృష్ణుడిలా అనిపించేవారు. రామకృష్ణుడిలా, షిర్డీసాయిబాబాలా, శంకరాచార్యునిలా బుద్ధుడిలా, భగవాన్ లా ఇలా నాన్నగారు ఎవరి గురించి చెబితే వారి రూపంలా అనిపించేవారు. నాన్నగారిలో అందరి మహాత్ములను దర్శించిన ఆనందం కలిగేది. నాన్నగారి సమక్షంలో చింతామణిలా చింతలు తీరేవి. కల్పవృక్షంలా కోరికలు తీరేవి. చంద్రుని వెన్నెలలా చల్లదనం ప్రసరించేది.

షిర్డీసాయిబాబా నా భక్తులను నా దగ్గరకు తీసుకుంటాను అని చెప్పారు. అంటే మనం ఎక్కడ, ఏ పరిస్థితిలో ఉన్నా గురువుకి తెలుస్తుంది. మేము నల్గొండ జిల్లా రాశి సిమెంట్ ఫేక్టరీ దగ్గర ఉండేవాళ్ళము. అక్కడి నుండి 1992 డిసెంబరు మొదటి వారంలో హైదరాబాదుకి మారాము. ఆ చివరి వారంలో నాన్నగారు పరిచయం అయ్యారు. మేము హైదరాబాద్ రావడం వల్ల ప్రయోజనం ఏమిటంటే, నాన్నగారి సన్నిధికి చేరుకోవడం జరిగింది. ఆయన రప్పించుకున్నారు. ఇది "దైవానుగ్రహం".

మా అత్తగారు, ఆడపడుచు నన్ను నాన్నగారి దగ్గరకు తీసుకువెళ్ళి పరిచయం చేసారు. నాన్నగారు అప్పుడు లక్ష్మీవాళ్ళ నాన్నగారు వరహాలరాజుగారి ఇంట్లో ఉన్నారు. నాన్నగారు నన్ను బాగా పలకరించారు. ఏం చదివావు? ఏం పుస్తకాలు చదువుకుంటూ ఉంటావు? అని అడిగారు. మొదటి దర్శనంలోనే నాకు నాన్నగారంటే బాగా ఇష్టం ఏర్పడింది. రెండు రోజుల్లో త్యాగరాయ గానసభలో "రమణభాషణములు" పుస్తకం ఆవిష్కరణోత్సవం ఉంది రమ్మని ఆహ్వానపత్రిక ఇచ్చారు.

త్యాగరాయ గానసభలో సామవేదం షణ్ముఖశర్మగారితో పాటు వేరే వక్తలు కూడా మాట్లాడారు. అక్కడ నాన్నగారు కూడా అరగంటసేపు మాట్లాడి ఆత్మగురించి చెప్పారు. నాకు సబ్జక్ట్ చాలా కొత్తగా, ఆశక్తిగా ఉంది అనిపించింది. అదే ట్రిప్ లో 1993 జనవరి 1న రేణుకగారి ( Biological ) ఇంట్లో భోజనాల ఏర్పాట్లు, మధ్యాహ్నం నాన్నగారి ఉపన్యాసం చాలా వైభవంగా జరిగాయి.

సంక్రాంతికి మా అత్తగారి ఊరు కోడవల్లి వెళ్ళాము. అక్కడినుండి జిన్నూరు మొదటిసారి వెళ్ళటం జరిగింది. నాన్నగారు అరుగుమీద కూర్చుని ఉన్నారు. ఆయన నాతో చాలా ఆప్యాయంగా మాట్లాడారు. ఏం పుస్తకాలు చదువుతావు? అని అడిగారు. నాన్నగారూ మీ దగ్గరకు వచ్చింది తక్కువే కాని మీ కేసెట్స్ బాగా విన్నాను అని చెప్పాను. నీ డైలీ లైఫ్ కి ఏమైనా ఉపయోగపడుతున్నాయా? అని అడిగారు. నేను ఇంతవరకూ జపం చేసుకోవాలి, పుణ్యం చేసుకోవాలి అనుకున్నాను. మీరు చెప్పిన Aim high & Aim at the highest అని చెప్పింది చాలా నచ్చింది. God realisation ultimate destination అని తెలిసింది అన్నాను. మా అత్తగారితో, పార్వతమ్మగారూ మీ కోడలు చాలా త్వరగా ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి వస్తుందని చెప్పి నాన్నగారు నన్ను బ్లెస్ చేసారు.

1993 వ సం ॥ రం డిసెంబరు ఆఖరి వారంలో మొదటిసారిగా అరుణాచలం వెళ్ళాము. అప్పుడు నాన్నగారు మోరీ గెస్ట్ హౌస్ లో ఉన్నారు. మాకు అక్కడ పక్కనే ఒకరూమ్ ఇచ్చారు. నాకు అరికాళ్ళలో Corns ఉండటం వల్ల చెప్పులు లేకుండా ఇంట్లోకూడా నాలుగు అడుగులు వెయ్యలేకపోయేదాన్ని. ఆ కారణంగా గిరిప్రదక్షిణ చెప్పులు లేకుండా చెయ్యటం అసాధ్యం అనిపించి చెప్పులతో ప్రదక్షిణకి బయలుదేరాను. నాన్నగారు మమ్మల్ని కుబేరలింగం దగ్గర ఉండమని, ఆయన అక్కడకు వచ్చి కాసేపు కూర్చుని వెళ్ళిపోయారు. తరువాత మేము గిరి ప్రదక్షిణ పూర్తిచేసి తిరిగి వచ్చాము. ఆ సాయంత్రం నాన్నగారు నాతో నువ్వు ఈ రోజు భోజనం చేయవద్దు, రామారావుగారు పండ్లు తెచ్చి ఇస్తారు అవే తీసుకో అన్నారు. చెప్పులతో గిరి ప్రదక్షిణకు వెళ్ళినందుకే నాన్నగారు భోజనం మానేసి పండ్లు తినమన్నారేమో అనిపించింది. అందువల్ల మరుసటిరోజు ఉదయం చెప్పులు లేకుండానే గిరిప్రదక్షిణ చేసాను. నాన్నగారు అలా అని ఉండకపోతే నేను చేయలేకపోదును. ఆ తరువాత నాన్నగారు నువ్వు ఇంక ఒకసారి కూడా తిరగవద్దు. ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తే కారులో వెళ్ళి, ఎక్కడయినా కూర్చోవాలనిపిస్తే కాసేపు కూర్చుని వచ్చేయి అన్నారు. నాన్నగారు ఏదైనా ఒకసారి వద్దు అంటే దానిమీదకు నా మనసు పోయేది కాదు.

నాన్నగారు పరిచయమైన కొత్తలో నేను నాన్నగారితో, అందరూ భగవాన్, భగవాన్ అంటున్నారు. వర్కు అంతా చేసేది మీరయినా, మీరు కూడా అంతా భగవాన్ చేసారంటున్నారు. మీకు భగవాన్ గురువు అవ్వచ్చు కానీ మాకు భగవాన్ గురువు ఎలా అవుతారు? మాకు అన్నీ తెలియజేసి బోధించేది మీరే కదా! మాకు మీరే గురువు అన్నాను. అప్పుడు నాన్నగారు నవ్వుతూ, నీలాంటివాడే పండరీపురంలో ఒకడు ఉన్నాడు. ఇద్దరు గురుశిష్యులు ఉండేవారు. గురువుగారు అరుగుమీద కూర్చున్న సమయంలో పాండురంగడి ఊరేగింపు వచ్చింది. అప్పుడు గురువుగారు శిష్యుడితో, పెరుమాళ్ వెళ్ళిపోతున్నాడు తొందరగా వచ్చి చూడమని పిలిచారు. అప్పుడు ఆ శిష్యుడు మీ పెరుమాళ్ వెళ్ళిపోతే మీరు చూసుకోండి, నేను నా పెరుమాళ్ కి పాలు కాచుకుంటున్నాను, నేను రాను అన్నాడు. అంటే ఆ శిష్యుడికి గురువుగారే పెరుమాళ్ అన్నమాట!

ఒకసారి మా నాన్నగారితో కలిసి రవీంద్రభారతిలో అనూప్ జలోటా బజన్స్ ఉంటే వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి అర్థరాత్రి అయిపోవడం వల్ల అమ్మగారింట్లో ఉండిపోయాను. మర్నాడు ఉదయం మా హౌస్ ఓనర్ సిద్ధయ్యగారు ఫోన్ చేసి మా ఇంట్లో దొంగలు పడ్దారని చెప్పారు. వెళ్ళి చూస్తే కొంత డబ్బు, బంగారం పోయాయి. మా ఎదురింటి సాయిగారి భార్య నాగేశ్వరి, సిద్ధయ్యగారు, సంధ్య, ఇంటి ప్రక్కవారు అందరూ వచ్చారు. నేను బీరువాలో చూసి మా గురువుగారి కేసెట్స్ సేఫ్ గా ఉన్నాయి అని ఆనందపడ్డాను. వారు డబ్బు, బంగారం పోయాయని బాధ పడకుండా కేసెట్స్ చూసి ఆనంద పడుతున్నారు, ఆ కేసెట్స్ లో ఏముంది? అని అడిగారు. మా గురువుగారి ప్రవచనాలు ఉన్నాయని చెప్పాను. మా ఇంట్లో అన్ని గదుల్లో నాన్నగారి ఫొటోలు ఉన్నాయి. ఈ ఫొటోలో ఉన్నది ఎవరని అడిగారు. మా గురువుగారు, నాన్నగారు అంటారు అని చెప్పాను. ఆ తరువాత నాన్నగారు వచ్చినప్పుడు వారందరూ వచ్చి దర్శనం చేసుకున్నారు. నాన్నగారి అంగీకారంతో అశోక్ నగర్ లో మా ఇంట్లో సత్సంగం పెట్టుకున్నాము.

అశోక్ నగర్ లో త్యాగరాయ గానసభ మా ఇంటికి దగ్గరగా ఉండేది. సిద్ధయ్యగారు నాన్నగారి ఉపన్యాసం త్యాగరాయ గానసభలో పెట్టుకోవచ్చుకదా అని సలహా ఇచ్చారు. నేను నాన్నగారిని త్యాగరాయ గానసభలో ఉపన్యాసం పెట్టుకుందామని అడిగాను. నాన్నగారు అంగీకరించారు. "శ్రీ నాన్నగారి ఆధ్యాత్మిక ప్రవచనం" అని చిన్న పేపర్ ప్రకటన ఇచ్చాను. ఆ హాలు మొత్తం జనంతో నిండిపోయింది. కార్యక్రమం చాలా బాగా జరిగింది. మేము అశోక్ నగర్ లో ఉన్న రోజుల్లో, నాన్నగారి ఉపన్యాసం త్యాగరాయ గానసభలో పెట్టుకుందామని అడిగేదాన్ని. నాన్నగారు అందుకు అంగీకరించేవారు. నాన్నగారు వస్తే పెద్ద పండుగలా ఉండేది. నాన్నగారు హైదరాబాద్ వచ్చిన ప్రతిసారీ మేము ఆయన దగ్గరకు వెళ్ళేవాళ్ళము. అప్పుడు నాన్నగారు మదురానగర్ లక్ష్మిగారి ఇంటిలో ఉండేవారు. నల్లకుంట సావిత్రి మామ్మగారి ఇంటికి కూడా వచ్చేవారు. ప్రవచనం చేసేటప్పుడు ఏదైనా పుస్తకం చదువుతూ చెప్పేవారు. ఆ పుస్తకం నా చేతికి ఇచ్చి చదవమనేవారు. రెండు లైన్లు చదివాక దానిమీద వివరణ ఇచ్చేవారు. నేను ఎప్పుడైనా వెనక కూర్చున్నా ముందుకు రమ్మని పుస్తకం ఇచ్చేవారు. అలా చాలాకాలం నాకు ముందు కూర్చునే అవకాశం లభించింది. ముందురోజు చెప్పిన ఉపన్యాసంలో ప్రశ్నలు అడిగేవారు. ఒకసారి సనత్ కుమారుడు గురించి చెబుతూ సనత్ కుమారుడే భగవాన్ గా జన్మించాడని చెప్పారు. మర్నాడు భగవాన్ సనత్ కుమారుడిగా ఉండగా ఏమి చెప్పాడమ్మా అని అడిగారు. ఎవరూ మాట్లాడలేదు. మన నిజ స్వరూపం బ్రహ్మం, మన స్వరూపం ఆత్మ. కానీ మనలో ఉన్న బ్రహ్మం మనకి అందాలంటే అది ఎలా అందాలో సనత్ కుమారుడు చెప్పాడు. ఏమి చెప్పాడంటే ఎవరూమాట్లాడటం లేదేమిటి? అన్నారు. అప్పుడు ఆహార శుద్ధి వలన ఇంద్రియ శుద్ధి అన్నాను. నాన్నగారు అవును అని నావైపు తిరిగారు.
ఆహారశుద్ధి వల్ల - ఇంద్రియశుద్ది
ఇంద్రియశుద్ధి వల్ల - మనశ్శుద్ధి
మనసుశ్శుద్ధి వల్ల - అంతఃకరణశుద్ధి
అంతకరణశుద్ధి వల్ల - ఆత్మానందం అందుతుంది అని సనత్ కుమారుడు చెప్పాడు, నాన్నగారూ అన్నాను. అప్పుడు నాన్నగారు నవ్వుతూ Very Good. You are born teacher, you are not made teacher అన్నారు. ఒకసారి ఈశ్వరునికి మరోపేరేమిటి? అని అడిగారు.
"కర్మఫలదాత" అని చెప్పాను.

ఒక సందర్భంలో నాన్నగారు మనం పూర్వజన్మలో ఈ దేహం నిజం, ఈ సంఘటనలు నిజం, ఈ కుటుంభసభ్యులు నిజం అనుకున్నాము. ఈ జన్మలో కూడా ఈ దేహం నిజం, ఈ సంఘటనలు నిజం. ఈ కుటుంబ సభ్యులు నిజం ... ఇలాగే అనుకుంటున్నాము. వచ్చే జన్మలో కూడా అలాగే అనుకుంటాము అని చెప్పి ఈ సంసారం గురించి భగవాన్ ఎమన్నారో చెప్పారు. తరువాత దాని గురించి అడుగుతూ భగవాన్ ఈ సంసారాన్ని ఏమన్నారు? అని అడిగారు. భగవాన్ ఈ సంసారాన్ని Ever unreal ( ఎప్పుడూ అసత్యమే ) అన్నారు అని చెప్పాను. నీ సబ్జక్ట్ grasping బాగుంది. గడియారం ముల్లు ఎంత accurate గా తిరుగుతుందో అలా ఉంది. అంత accurate గా ఉంది నీ సబ్జక్ట్ అన్నారు. అక్కడ నేను చేసిందేమీ లేదు. నాన్నగారు చెప్పిన మాటలే తిరిగి చెప్పేదాన్ని. అయినా నాన్నగారు నన్ను మెచ్చుకుంటూ టీచింగ్ కి బాగా ప్రోత్సహించేవారు.

ఒకసారి నాన్నగారిని భక్తియోగం ఒకటి సరిపోతుంది కదా నాన్నగారూ అని అడిగాను. "భక్తియోగం అంతా అక్కరలేదు. "సర్వభూతహితేరతాహః" ఈ ఒక్క వాక్యం చాలమ్మా! భాగవతంలో రంతిదేవుడు అనే భక్తుడు ఉన్నాడు. రంతి దేవుడు భోజనం చేసేటప్పుడు తనకి ఆకలిగా ఉన్నా ఎవరైనా అడిగితే వారికి బిక్ష కాదనకుండా ఇచ్చేవాడు. మంచినీళ్ళు తాగేటప్పుడు అడిగితే ఆ నీరు కూడా ఇచ్చేసేవాడు. అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమై ఏమైనా వరం కోరుకోమంటాడు. అప్పుడు ఆ భక్తుడు నేను అందరి హృదయాలలో ఉండాలి. అలా ఉండి ఏ జీవికైనా దుఃఖం వస్తే ఆ దుఃఖాన్ని వారు అనుభవించకుండా నేనే అనుభవించేస్తాను. అప్పుడు జీవకోటి దుఃఖం లేకుండా సుఖంగా ఉంటారు. అలాంటి వరం ఇమ్మని అడిగాడు. అలా అన్ని భూతాల క్షేమం కోరేవారికి మోక్షం ఇవ్వకుండా ఎవరూ ఆపలేరు అన్నారు.

నాన్నగారి మనవడు వర్మగారు srinannagaru.com పేరుతో Website start చేసి wonderful work చేస్తున్నారు. దేశ, విదేశాలలో ఉండే భక్తులు అందరూ నాన్నగారి పుట్టినరోజుకి, గురుపూర్ణిమకి వెళ్ళలేకపోయాము అనే బాధ లేకుండా audio, video లద్వారా అన్ని ఉపన్యాసాలు వినగలిగేలా, చూడగలిగేలా అవకాశాన్ని కల్పిస్తూ అందుబాటులోకి తీసుకువచ్చారు. ఒకసారి నాన్నగారితో నేను వర్మకి వ్యక్తి భావన లేదు కదా నాన్నగారూ! అని అడిగాను. అవునమ్మా కరెక్టుగా చెప్పావు. వర్కు చేస్తాడు కానీ వ్యక్తి కనపడడు అని నాన్నగారు వర్మని మెచ్చుకున్నారు.

కనస్ట్రక్షన్ వర్క్ రీత్యా మా కుటుంబం హైదరాబాదునుండి చెన్నైకి మారవలసి వచ్చింది. అప్పుడు నాన్నగారు పద్మ మద్రాసు వెళ్ళడంవల్ల హైదరాబాదుకి నష్టం, మద్రాసుకి లాభం అన్నారు. నాన్నగారు హైదరాబాదులో లక్ష్మి ఇంటికి వచ్చేవారు. లక్ష్మి నాన్నగారికి బాగా సేవ చేసేవారు. భక్తులను కూడా చాలా ప్రేమగా ఆదరించేవారు. సహనంతో, నవ్వుతూ అందరినీ పలకరిస్తూ ఉండేవారు. ఆమెని చూసినప్పుడు గురువు సేవచేసుకోవడం ఎంత అదృష్టం? అనిపించేది. నాన్నగారు నాకు ఆ కోరిక మద్రాసులో తీర్చేసారు. 2000 సం॥ రం నుండి 2003 వరకు మూడు సం॥ రాలు నాన్నగారు అరుణాచలం వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు మా ఇంటికి వచ్చి ఉండేవారు. నాన్నగారితో నాకు కారులో అరుణాచలం వెళ్ళే అవకాశం వచ్చేది. కారులో కూడా సబ్జక్ట్ చెబుతూనే ఉండేవారు. ఖన్నా, శాంతి, వడివేలు, సంగీత విద్వాంసులు మణిగారు, వారి భార్య .... చెన్నై భక్తులంతా వచ్చేవారు. కొంతమంది మన భక్తులు కూడా వచ్చేవారు. అలా మా హాలు మొత్తం నిండిపోయేది. మద్రాసులో నాన్నగారితో నేను గడిపిన రోజులు నాకు Golden days.

నాన్నగారు కోయంబత్తూరు, కొత్తగూడెం వెళ్ళినప్పుడు నాన్నగారికి ఫోన్ చేసి నేను రావచ్చా అని అడిగితే రామ్మా పద్మా అనేవారు. కొత్తగూడెం వెళ్ళినప్పుడు అక్కడ సౌకర్యంగా ఉంటుందని రమ్మనేవారు. అక్కడ అంతా ఆచార్యులవారి సబ్జక్ట్ చెప్పేవారు. ఎంత అందంగా చెప్పేవారు అంటే, సముద్రపు కెరటంలో ఒక బుడగ పగిలిపోతే ఆ బుడగ నీరుగా మారుతుంది. బుడగగా అసత్యం కానీ నీరుగా సత్యం. బంగారపు వడ్డాణం కరిగిస్తే వడ్డాణం కరిగిపోతుంది కానీ బంగారంగా మిగులుతుంది. మట్టి కుండను పగలగొడితే కుండ రూపాన్ని కోల్పోతుంది కానీ మట్టిగా మిగిలి ఉంటుంది.
బుడగ అసత్యం - నీరుగా సత్యం.
వడ్డాణంగా అసత్యం - బంగారంగా సత్యం.
కుండగా అసత్యం - మట్టిగా సత్యం.
దేహబుద్ధి, జీవబుద్ధి నశిస్తే బ్రహ్మాకారం చెందుతాం. జీవబుద్ధి అసత్యం, బ్రహ్మపదార్థం సత్యం. అప్పుడు limitations దాటి Every thing అయిపోతాం అని చెప్పేవారు.

"మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయః! అంటే అసలు మనిషి జన్మదొరకటం, జ్ఞానం పొందాలనే కాంక్ష కలగడం, కలిగినా దానిని నెరవేర్చే గురువు అనుగ్రహం దొరకడం ఇవి మూడూ దైవానుగ్రహం అన్నారు శంకరాచార్యుల వారు. అంటే అనేక వేల జన్మల పుణ్యఫలం ఉంటేనే గానీ అవి దొరకవు. అందులోనూ ఒక మహాగురువు ఆశ్రయం దొరకితే ఇక నీకు దశ తిరిగిందిలే అనేవారట ఆచార్యులవారు.

నాకు ఆరోగ్యం బాగోలేకపోయినా గురువుగారు దేహంతో ఉన్నంతకాలం ఆయనతో గడిపినందుకు చాలా సంతృప్తిగా ఉంది. దేహం వచ్చినందుకు ప్రారబ్ధం ఎలా ఉన్నా, ఒక మహాత్ముని చుట్టూ 25 సం ॥ లు సన్నిహితంగా తిరిగే అవకాశం లభించింది. ఎప్పుడూ నాన్నగారి ధ్యాసతోనే గడిపేవాళ్ళము. ఆ ధ్యాసలో పిల్లలు పెరగటం, వాళ్ళ చదువులు, పెళ్ళిళ్ళు ఎలా జరిగాయో అవేమీ గుర్తులేవు. నిరంతరం నాన్నగారి సబ్జక్ట్, సత్సంగం అంతే! కొన్నిసార్లు సత్సంగానికి వినటానికి వెళ్ళేవాళ్ళము. కొన్నిసార్లు చెప్పటానికి వెళ్ళేవాళ్ళం. ఎలా అయినా మొత్తంగా సత్సంగాలచుట్టూ, నాన్నగారిచుట్టూ తిరిగేవాళ్ళం. అలా మన దృష్టి ఎటూ మళ్ళకుండా సబ్జక్ట్ చుట్టూ ఉండేలా ఆయన చేసారు.

కష్ణుడు అంటే ఇష్టం ఉండటం వేరు. కృష్ణుడు చెప్పిన భగవద్గీత యొక్క వైభవాన్ని అర్థం చేసుకుని కృష్ణుని ఇష్టపడటం వేరు అని చెప్పారు నాన్నగారు. అలా నాకు నాన్నగారి సబ్జక్ట్ వినేకొలది లోపల నాన్నగారంటే ఇష్టం, గౌరవం పెరుగుతూ వచ్చాయి. అది జ్ఞాని వైభవం. నాన్నగారి సబ్జక్ట్ ఒక మహా సముద్రం. మనం అందులో ఒక నీటి బిందువు లాంటివాళ్ళం. నాన్నగారి గురించి నేను తెలుసుకున్నది కూడా ఆ నీటి బిందువు అంత మాత్రమే అనిపిస్తుంది.

నాన్నగారు ఒకసారి ప్రవచనంలో ఏమి చెప్పారంటే, Theory మొత్తం అంతా వింటాము కానీ, ఆ సబ్జక్ట్ లోతుల్లోకి మాత్రము దిగము. అంటే చెరువులోకి దిగకుండా అలా చెరువుగట్టు మీద కూర్చునే ఉంటాము. అది చూసి, చూసి గురువు ఒక్క తోపు తోస్తాడు. అప్పుడు నీటిలో పడిపోతాము. మనం చేయాలని స్నానం చేయకపోయినా, అందులో పడిపోయాము కాబట్టి స్నానం అయిపోతుంది. అలా గురువుకి "One kick is enough" అని చెప్పారు. మనం నీటిలో పడకుండా అలా కాలక్షేపం చేస్తూ ఉంటే గురువు ఎప్పుడో ఒక తన్ను తన్నితే లోపలికి వెళ్ళిపోతాము.

నాకు 24 సం ॥ ల వయసులో Auto - Immune disorder ( One type of arthritis ) వచ్చింది. డాక్టర్స్ పెద్దగా hope ఇవ్వలేదు. ఒకసారి కారులో నాన్నగారితో అరుణాచలం వెళ్తూ ఉంటే నాన్నగారు "అమ్మా పద్మా 1984 వ సం ॥ లో నాకు అనారోగ్యం కలిగినప్పుడు డాక్టర్స్ నేను చనిపోతాను అని చెప్పారమ్మా! డాక్టర్స్ అందరూ నాకు కేన్సర్ అనుకున్నారు. అప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏమిటంటే, ఈ దేహంలో ఉండగా ఇంక మరలా అరుణాచలం చూడలేనేమో అని తలంపువచ్చింది" అని చెప్పారు. అప్పుడు నేను నాన్నగారితో, నా అనారోగ్యం గురించి డాక్టర్స్ చెప్పినప్పుడు నాకు వచ్చిన తలంపు ఏమిటంటే, నాన్నగారి సమక్షాన్ని కోల్పోతాను అనిపించింది అన్నాను. దానికి నాన్నగారు జ్ఞానం పొందే అవకాశం మిస్ అయిపోతాను అనిపించిందా? అని అడిగి మౌనం వహించారు. కానీ ఆ తరువాత నాకు 25 సం ॥ రాలు ఆయన సమక్షంలో ఆనందంగా గడిపే అవకాశాన్ని కలుగజేసారు. ఇది ఆయన నాకు ప్రసాదించిన వరం.

నాకు కాశీ వెళ్ళాలని ఉండేది. కాకపోతే ట్రైన్ లో వెళ్ళాలంటే సమయం ఎక్కువ పడుతుంది, నాకు ప్రయాణం చేయటం కష్టమవుతుంది అనుకున్నాను. నాన్నగారు ఆ కోరిక కూడా తీర్చేసారు. అప్పటికే నాన్నగారు రెండుసార్లు కాశీ వెళ్ళారు. మళ్ళీ కాశీ వెళుతున్నారని తెలిసింది. నాన్నగారూ ఈ సారి మీరు హైదరాబాదు వచ్చేయండి. ఇక్కడనుండి అందరం ఫ్లైట్ లో వెళదాము అని అడిగాను. సరేనమ్మా అయితే అన్నారు. అలా నాన్నగారు హైదరాబాద్ వస్తే ఫ్లైట్లో వెళ్ళాము. తొమ్మిది రోజులు నాన్నగారితో కాశీలో గడిపాను. కాశీలో 20 మందికంటే ఎక్కువ పట్టని బోటులో నాన్నగారు భక్తులతో కలిసి బయలుదేరారు. ఒడ్డున ఉన్న రాయిమీదనుండి బోటులోకి దూకాలి. కొంతమంది ఎక్కగలిగిన వాళ్ళు దూకేసారు. నాకు దూకే పరిస్థితిలేదు కనుక ఆగిపోయాను. బోటు బయలుదేరి వెళ్ళిపోతుంటే నాన్నగారు పద్మ ఏది? అని అడిగారట. అదేంటి పద్మని ఎక్కించుకోవద్దా అని ఉషని అడిగి మళ్ళీ వెనక్కి వెళ్దాం పదండి అన్నారట. అప్పుడు బోటు మాకోసం తిరిగిరాగానే, రాయిమీద నుండి బోటులోకి ఎక్కలేను అనుకున్నదానిని నాకు తెలియకుండానే ఎక్కేసాను. నాతోపాటు మరో ఇద్దరు భక్తులు విజయ్ కుమార్ గారు, ఆయన భార్య ఇందిర గారు కూడా ఎక్కారు. ఆరోజు నాన్నగారు నదిలోనుండి నీరుతీసి బోటులో ఉన్న భక్తులందరిమీదా చల్లుతూ చాలా ఆనందంగా గడిపారు. పక్కనే వేరే బోట్ లో ఉన్న భక్తులు కూడా నాన్నగారూ మామీద కూడా చల్లండి అంటే వారిమీద కూడా నీళ్ళు చల్లారు. నాన్నగారు భద్రాచలం వెళ్ళినప్పుడు నాకు కుదరలేదు. కానీ వెళ్తే బావుండును అనుకున్నాను. తరువాత నాన్నగారితో మూడుసార్లు భద్రాచలం వెళ్ళే అవకాశం కలిగింది! రెండుసార్లు శ్రీశైలం కూడా వెళ్ళాను.

కాలడి వెళ్ళినప్పుడు పూర్ణానదిలో స్నానంచేసి, అక్కడ చిన్ని కృష్ణుడి గుడి ఉంటే నాన్నగారితోపాటు దర్శనానికి వెళ్ళాము. బయటికి వచ్చిన తరువాత అమ్మా పద్మా కృష్ణుడిని చూసావా? కృష్ణుడి దర్శనం అయ్యిందా? అని చాలా ఆనందంగా అడిగారు. నేను మామూలు విగ్రహాన్ని చూసానంతే! నాన్నగారు నిజంగా కృష్ణుడి దర్శనం అయినట్టు ఇంత ఆనందంగా అడుగుతున్నారు ఏమిటి అనుకున్నాను.

నాన్నగారితో కోయంబత్తూరు వెళ్ళినప్పుడు కొంతమంది భక్తులు వెళ్ళిపోయినా నేను చివరి వరకూ ఉండిపోయాను. అప్పుడు రంగరాజుగారు నాన్నగారితో, ఈసారి వేరే ప్రదేశాలు చూద్దాము అన్నారు. నాన్నగారు, నేను, రామచంద్రరాజు గారు, రంగరాజుగారు, ఆయన భార్య అందరం కారులో బయలుదేరాము. మధురై, భగవాన్ జన్మస్థలమైన తిరుచ్చుళి, కుమారస్వామి క్షేత్రమైన తిరుప్పరకుండ్రం వెళ్ళాము. ప్రతి గుడిలోకి వెళ్ళి వచ్చిన తరువాత ఇది పద్మ డెస్టినీలో ఉంది అనేవారు. భగవాన్ ఆత్మానుభవం పొందిన స్థలానికి తీసుకువెళ్ళి ఇక్కడే భగవాన్ ఆత్మానుభవం పొందారు. నువ్వు ఇక్కడ కాసేపు కూర్చో పద్మా అన్నారు. తిరుప్పరకుండ్రం గుడికి వెళ్ళినప్పుడు, మధురై ఈశ్వరుని గుడికి వెళ్ళినప్పుడు, అక్కడి పూజారులు నాన్నగారు ఎవరో తెలియక పోయినా, దేవుడికి అలంకరించిన పూలమాల తీసి నాన్నగారి మెడలో వేసారు. ఏమీ తెలియనివారిని కూడా ఆకర్షించే వైభవం "జ్ఞాని వైభవం."

ఒకసారి నాన్నగారితో అరుణాచలం నుంచి కారులో పాండిచ్ఛేరి వెళ్ళాము. అక్కడ అరబిందో ఆశ్రమానికి తీసుకువెళ్ళారు. సమాధితో పాటు అక్కడన్నీ చూపించారు. అరబిందో 40 సంవత్సరాలు బయటికి రాకుండా ఒకే గదిలో ఉండిపోయారు. వాకింగ్ కూడా ఆ గదిలోనే చేసేవారు. సావిత్రి లాంటి పుస్తకాలు రచించారు. మనకి రెండురోజులు మనుషులు కనపడకపోతే ఉండలేము. భగవాన్ ని ఎక్కడికయినా వెళదామని భక్తులు అడిగితే, ఎక్కడికి వెళ్ళినా పంచభూతాలే! గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశం. ఇంక ఆరోభూతం ఏమీ లేదని చెప్పేవారు అన్నారు. నాన్నగారు చెప్పిన ఈ రెండు మాటలూ నాకు బాగా స్ఫూర్తినిచ్చాయి. కోయంబత్తూరులో రోజూ ప్రారబ్ధాన్ని, ఏకాంతవాసాన్ని ఎంజాయ్ చెయ్యాలని, కష్టసుఖాలను ప్రసాద బుద్ధితో స్వీకరించాలని చెప్పారు. జ్ఞాని ప్రారబ్ధాన్ని మామిడి రసం తాగినట్టు, చెరుకురసం త్రాగినట్టు అనుభవిస్తారని చెప్పారు. రెండు సం ॥ ల నుండి నేను ఎక్కడికీ వెళ్ళలేకపోయినా నాకు ఏమీ అనిపించలేదు. నాన్నగారి అనుగ్రహంలో అదంతా సహజంగా జరిగిపోతూ వచ్చింది.

అహం వైశ్వానరో భూత్వా
ప్రాణినాం దేహమాశ్రితః|
ప్రాణాపానసమాయుక్తః
పచామ్యన్నం చతుర్విధమ్ ॥
"నేను అందరి హృదయాలలో ఉన్నాను. జఠరాగ్ని రూపంలో కూడా ఉన్నాను. జఠరాగ్ని రూపంలో ఉండి తినే ఆహారాన్ని జీర్ణం చేసేది నేనే" అన్నాడు కృష్ణుడు.

మీరు సుబ్బారావు అనే వ్యక్తికి భోజనం పెట్టారనుకోండి! నేను సుబ్బారావుకి భోజనం పెట్టాను, సుబ్బారావుకి భోజనం పెట్టాను అనుకోకండి. ఆయనకి ఆకలిగా లేకపోతే మనం పెట్టినా తినలేడు. ఎవరికైనా భోజనం పెట్టినా ఈశ్వరుడికి పెట్టాను, ఈశ్వరుడే తిన్నాడనుకోండి. సుబ్బారావులో జఠరాగ్నిరూపంలో ఉండి జీర్ణమయ్యేలా చేసేది ఈశ్వరుడే! తిన్న ఆహారం జీర్ణమయ్యేలా చేసేది నేనే అన్నాడు కదా! భగవంతుడు మన హృదయానికి అంత దగ్గరగా ఉండటం వలన, మనం పాపకర్మలు చేయకుండా పవిత్రంగా ఉండాలి అన్నారు.

ఆహారం విషయంలో పాటించవలసిన నియమాలు :
1. మనం కష్టపడి, న్యాయంగా సంపాదించిన సొమ్ముతో కూడినదై ఉండాలి.
2. సాత్వికమైన శాఖాహారం తీసుకోవాలి.
3. భగవంతుని ప్రార్థన చేసిన తరువాత ఆహారం తీసుకోవాలి.
4. ఆహారమును ఎక్కువ, తక్కువ కాకుండా యుక్తముగా తీసుకోవాలి.

బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్ర్బహ్మాగ్నౌ
బ్రహ్మణా హుతమ్ |
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మసమాధినా॥

ఇచ్చేవాడు బ్రహ్మము, పుచ్చుకునే వాడు బ్రహ్మము. ఇవ్వబడుతున్న క్రియ బ్రహ్మము. ఇచ్చే వస్తువు బ్రహ్మము. మనం ఎవరికైనా మామిడి పండు ఇస్తే - మామిడి పండు ఇచ్చేవాడు బ్రహ్మము. మామిడి పండు పుచ్చుకునేవాడు బ్రహ్మము. మామిడి పండు బ్రహ్మము. అలా బ్రహ్మ భావనతో అన్నీ చేసేవాడు చివరికి బ్రహ్మమునే పొందతాడు అని నాన్నగారు చాలా అద్భుతంగా చెప్పారు.

వైజాగ్ లో మా వదిన ( వైజాగ్ పద్మ ) గారి ఇంటికి నాన్నగారు వచ్చినప్పుడల్లా వదిన నన్ను రమ్మనేవారు. అక్కడ నాన్నగారితో సన్నిహితంగా గడపడానికి మంచి అవకాశం లభించేది. నాన్నగారు వైజాగ్ శ్యామల గారి ఇంట్లో ఉన్నప్పుడు ఒకరోజు ఏసుక్రీస్తు గురించి చెప్పారు. ఏసుక్రీస్తు దగ్గరకు ఒక శిష్యుడు వచ్చి నీవు ప్రభువువి, దేవుడివి అంటూ ఉంటే ఏసుక్రీస్తు - నువ్వు మూడు రోజుల్లో నన్ను 30 నాణాలకు పట్టిస్తావు అన్నారంట. అప్పుడు ఆ శిష్యుడు అదేమిటి ప్రభూ? అలా అంటారు అన్నాడట. అవును అది అంతే అన్నారట. అప్పుడు నేను ముందే క్రీస్తు చెప్పినందుకైనా ఆ శిష్యుడు అలా చేయకుండా ఉండవలసింది నాన్నగారూ అన్నాను. అదేంటమ్మా పద్మా? విధి బలీయమైనది! వాసన బలీయమైనది! ఆ శిష్యుడికి ధన వాసన ఉంది. ధనం అనగానే దానికి లొంగిపోయాడు. తరువాత జీసస్ కి శిలువ వేయడం చూసి, నా వల్లే ఇదంతా జరిగింది అని ఆ నాణాలు అక్కడే పడేసి ఉరివేసుకుని చనిపోయాడు. కానీ ఆ సమయానికి వాసన వలన లొంగిపోయాడు అని చెప్పారు. ఆ నాలుగు రోజులూ సత్సంగంలో విధి బలీ .... యము! వాసన బలీ .... యము! అంటూ చాలా ఉదాహరణలు చెప్పారు.

రావణాసురుడు సీతని తీసుకొచ్చినప్పుడు, మండోదరి రావణాసురుడితో ముందే చెప్పింది. నువ్వు తీసుకొచ్చింది సీతను కాదు నీ మృత్యువుని! సీతను తిరిగి రాముడికి అప్పజెప్పు. రాముడుకి శరణాగతి చెందు అని చెప్పినా రావణాసురుడు వినలేదు. అలాగే వాలితో తార చెబుతుంది. నీ చేతిలో చావు దెబ్బలు తిని వెళ్ళిన సుగ్రీవుడు, మళ్ళీ ఇంత త్వరగా యుద్ధానికి వస్తున్నాడంటే, వెనక ఏదో బలగంతో ( శక్తితో ) వస్తున్నాడు వెళ్ళొద్దని చెబుతుంది. కానీ విన్నాడేంటి? విధి బలీ...యము! అన్నారు.

వాలి భార్య తార వాలి చనిపోయిన తరువాత రాముడితో, భార్యా వియోగం ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా! నువ్వు బాధ పడుతున్నావు. మరి భర్త వియోగం నాకు ఎందుకు కలుగజేసావు? అని అడిగింది. అప్పుడు రాముడు తారకి ఒక రహస్యం చెప్పాడు అన్నారు నాన్నగారు. సృష్టి మొదలైన దగ్గర్నుండి ఈనాటి వరకూ ఈశ్వరుడి సంకల్పానికి వ్యతిరేకంగా ఏ సంఘటనా జరగలేదు. ఈశ్వరుడి సంకల్పం ఒకలా ఉంటే, ఇంకొకరకంగా చేయడానికి అసలు అవకాశమే లేదు. ప్రారబ్ధమనే ఇరుసులో నువ్వూ, నేనూ, అందరం బంధీలం అమ్మా తారా! ఇక్కడ ఎవరూ స్వతంత్రంగా వ్యవహరించలేరు. వాలి చనిపోవడం కూడా ప్రారబ్ధంలో భాగమే!

ఈశ్వరః సర్వభూతానాం
హృద్దేశేర్జున తిష్ఠతి |
భ్రామయన్ సర్వభూతాని
యంత్రారూఢాని మాయయా ||

భగవద్గీతలోని ఈ శ్లోకం అంటే నాన్నగారికి చాలా ఇష్టం. "ఈశ్వరుడు అందరి హృదయాలలోనూ తిష్టవేసుకుని కూర్చున్నాడు. మామూలుగా కూర్చోలేదు, తిష్టవేసుకుని కూర్చున్నాడు. యంత్రాన్ని తిప్పేవాడు యంత్రాన్ని తిప్పినట్టు బొమ్మలన్నింటినీ తిప్పుతున్నాడు. పిచ్చివాడి చేతిలో రాయి ఉంటే ఎటు విసురుతాడో తెలీదు. అలా పిచ్చివాడిలా తిప్పట్లేదమ్మా! వారి వారి ప్రారబ్ధానుసారం తిప్పుతున్నాడు." అన్నారు.

ఇందిరాగాంధీ దగ్గర ఉండే సెక్యూరిటీలో సిక్కులు ఉంటే ప్రమాదం తీసేద్దామన్నారట! నాకు అందరూ సమానమే అందట. ఆ సిక్కుల చేతిలోనే ఆమె చనిపోయింది. అలా ఎవరయినా చెప్పినా బుద్ధి ( మాయ ) విననివ్వదు. అలాగే రాజీవ్ గాంధీ విషయంలో ఒక అమ్మాయి హ్యూమన్ బాంబ్ పెట్టుకుని పూలమాలతో వస్తే ఎస్. ఐ ఆపేసాడు. రాజీవ్ గాంధీ అదిచూసి పంపించమన్నాడు. ఆ అమ్మాయి వచ్చి దండేసి బాంబ్ పేల్చేసింది. అంటే డెత్ ని ఆహ్వానించటమే! ఎస్. ఐ ఆపినప్పుడు ఆగాలి కదా! వచ్చేయమన్నాడు. మాయ విననివ్వదమ్మా! అని చెప్పి ఇంకో అద్భుతమైన మాట చెప్పారు. "మాయ విననివ్వకపోవడం కాదు, అసలు ఈశ్వరుడే విననివ్వడు." అంటే వాడి ప్రారబ్ధానుసారం ఆడించేయాలి కదా! విధి బలీయము! అన్నారు. అయితే ఈశ్వరుడే మాయలో పెట్టేసి, ఈశ్వరుడే విననివ్వకుండా చేసేస్తే మనం మాయలో పడి కొట్టుకోవడమేనా? ఏంటి పరిస్థితి? అని నాన్నగారే ప్రశ్నించి, ఆయనే సమాదానం చెబుతూ దీనికి పరిష్కారం కూడా కృష్ణుడు చెప్పాడు అన్నారు.

తమేవ శరణం గచ్ఛ
సర్వభావేన భారత !
తత్ప్రసాదాత్ పరాం శాంతిం
స్థానం ప్రాప్స్యసి శాశ్వతమ్ !!

అన్ని విధాలా ఆయన్నే శరణు పొందు. ఆయన అనుగ్రహం వల్ల పరమశాంతిని, శాశ్వతమైన స్థానాన్నీ పొందుతావు. అంటే ఈశ్వరుడి పాదాలను ఆశ్రయించి జీవించాలి. చేపలు పట్టేవాడు వల విసిరినప్పుడు తెలివైన చేపలు, చేపలు పట్టేవాడి పాదాల దగ్గరకు వెళ్ళిపోతాయి. వల విసిరినప్పుడు ఆ చేపలు అతని వలలో పడవు. అలాగే ఈశ్వరుడి పాదాలను ఆశ్రయించిన వాళ్ళు మాయ వలలో పడరు. ఈశ్వరానుగ్రహం కలిగితే ప్రయోజనం ఏమిటి? ఈశ్వరానుగ్రహం కలిగితే మన జేబులో డబ్బులు పెట్టి వస్తువు కొనుక్కోవటం ఎంత సులభమో, మోక్షం అంత సులభంగా వరిస్తుంది. అప్పుడు మనం ఆయన స్వరూపాన్ని పొందుతాము. అది శాశ్వత ఆనందం అన్నారు.

"మనం కలెక్టరు గారి ఇంటికి వెళ్ళామనుకోండి. వాచ్ మెన్ మనల్ని బయటే ఆపేస్తాడు. కలెక్టరుగారు బాల్కనీలోంచి చూసి లోపలికి పంపమన్నారనుకోండి, వాచ్ మెన్ లోపలికి పంపిస్తాడు. అలా పలానవాడికి దారి ఇవ్వు అని ఈశ్వరుడు చెబితే మాయ దారి ఇస్తుంది. అంటే మాయాధిపతి ఎవరు? ఈశ్వరుడే!" అన్నారు.

రాజశేఖర రెడ్డి ఫ్లైట్ ఎక్కేముందు ఫైలెట్ వద్దండి వాతావరణం బాలేదన్నాడు. అప్పుడు రాజశేఖరరెడ్డి నీకు డెత్ అంటే అంత భయమా? పద వెళ్దాం అన్నారట. అంటే విధి బలీ....యము! అన్నారు.

వరలక్ష్మిగారి అమ్మాయి విజయ వాళ్ళింట్లో ( కొంపెల్ల ) I am that
I am గురించి అద్భుతంగా చెప్పారు.
I am అంటే బ్రహ్మము (Truth ). అది అందరి హృదయాలలోనూ ఉంది. అందరం బ్రహ్మ స్వరూపులం అయ్యే ఉన్నాము.
I am అంటే సద్వస్తువు. That I am అంటే "అది నేనయి ఉన్నాను" అనేది ఇక్కడ ముఖ్యం. దానిలోనే మొత్తం అంతా ఉంది! చీమలోనూ, ఏనుగులోనూ... అన్ని జంతువులలోనూ సద్వస్తువు ఉంది. దేవుడు ఉన్నాడని చేప్పేవాడిలోనూ దేవుడు ఉన్నాడు. దేవుడు లేడని చేప్పేవాడిలోనూ దేవుడు ఉన్నాడు. మనకు తెలిసినా తెలియకపోయినా I am అనేది అందరిలోనూ ఉంది. అసలు ముందు That I am అది నేనయి ఉన్నాను అని గ్రహించాలి. అది అనుభవంలోకి రావాలి. క్రీస్తు చెప్పిన I am That I am అనేది భగవాన్ కి కూడా నచ్చింది. ఈ వాక్యాన్ని ఆయన బాగా ఎంజోయ్ చేసేవారని నాన్నగారు అన్నారు.

రెడ్డిగారు అనే ఆయన ప్రతి ఆదివారం భగవాన్ దగ్గరికి వెళ్ళిపోయేవారు. అప్పుడు గాంధీగారు అన్నారట. ఇప్పుడు రమణ మహర్షిలో ఎముందో నాలోనూ అదే ఉంది. నీలోనూ అదే ఉంది. Truth అందరిలోనూ సమానంగానే ఉంది. మరి రమణ మహర్షి దగ్గరకు పరిగెడతావెందుకు? అన్నారట. Truth మీలోనూ ఉంది. నాలోనూ ఉంది. కానీ ఆయనలో ఉన్నది ఆయనకు అనుభవంలోకి వచ్చింది. మనలో ఉన్నది మనకు అనుభవంలోకి రాలేదు అన్నారట. ఆ సమాదానానికి గాంధీగారు కూడా సంతోషించారు అన్నారు.

I am that I am అనేది క్రీస్తు రియలైజ్ అయ్యాడు. భగవాన్ కి, ఆచార్యులవారికి, బుద్ధుడికి .... అనుభవంలోకి వచ్చింది. I am that
I am అనగానే వాళ్ళలా మనం రియలైజ్ అవ్వలేము కాబట్టి క్రీస్తు,
సాత్వికులు ధన్యులు - వారు స్వతంత్రించుకుందురు.
సమాదాన పరుచువారు ధన్యులు - వారు దేవుని అనుగ్రహానికి పాత్రులగుదురు.
హృదయశుద్ధి గలవారు ధన్యులు - వారు దేవుని చూచెదరు అని చెప్పాడు.
(సమాదాన పరుచువారు: ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరుగుతున్న సమయంలో, కొంతమంది పట్టుకుంటామని వచ్చి పడగొట్టేస్తూ ఉంటారు. అదే సమాదాన పరుచువారు అయితే, అక్కడికి వెళ్ళి గొడవ పెరగకుండా అడ్డుకుని సర్ధిచెబుతారు. అటువంటి వారు దేవుని అనుగ్రహానికి పాత్రులు అవుతారు.) డబ్బులు ఉన్నవారు ధన్యులు, అధికారం ఉన్నవారు ధన్యులు అని క్రీస్తు చెప్పలేదు. ఏయే లక్షణాలు ఉంటే భగవంతుడు అనుభవానికి వస్తాడో అవన్నీ చెప్పాడు. ఆధ్యాత్మికమైన బోధలన్నీ హృదయంలోనికి వెళ్ళటానికే! కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన 700 శ్లోకాలు కూడా మనం హృదయంలోకి వెళ్ళటానికే! మనకు అది అనుభవంలోకి రావాలంటే ముఖ్యంగా ఫ్యూరిటీ ఉండాలి అన్నారు నాన్నగారు. దీనికి ఒక ఉదాహరణ చెప్పారు.

జిన్నూరులో ఒక అబ్బాయికి కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేసారు. ఆయితే కొత్త ఆర్గాన్ ని మన శరీరం రిజెక్ట్ చేస్తుంది. అందుకని స్టెరాయిడ్స్ ఇచ్చేస్తారు. ఇమ్యూనిటీని సప్రెస్ చేసేస్తారు రిజెక్ట్ చేయకుండా! అయితే ఆ అబ్బాయి body కిడ్నీని రిజెక్ట్ చేసేసింది. అతను చనిపోయాడు. మనలో 99 % purity ఉండి 1 % impurity ఉంటే, మనం బ్రహ్మంలో ఐక్యం అయిపోదామని అనుకున్నా బ్రహ్మం మనల్ని రిజెక్ట్ చేస్తుంది. ఆ అబ్బాయి body కిడ్నీని ఎలా రిజెక్ట్ చేసిందో, అలా బ్రహ్మం మనలో 1 % impurity ఉన్నా కూడా తనలో ఐక్యం చేసుకోకుండా రిజెక్ట్ చేస్తుంది. మనం 100 % Purity ని పొందినప్పుడు బ్రహ్మం తనలో ఐక్యం చేసుకుంటుంది. అందుకే క్రీస్తు ప్యూరిటీ పొందమని ఇవన్నీ చెప్పుకొచ్చాడు అన్నారు.

నను బోలు దీనుల నింపొందకాచుచు
చిరంజీవివై బ్రోవు మరుణాచలా!

అంటే నా లాంటి రమణులు వస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. ఈ రమణుని అనుగ్రహిస్తేనే సరిపోదు. నిన్ను ఆశ్రయించిన జీవకోటి అంతటినీ మోక్షం వచ్చేవరకూ అనుగ్రహిస్తూ చిరంజీవివై ఉండి బ్రోవుము అరుణాచలా! అన్నారు భగవాన్. అని నాన్నగారు చెపుతూ, మనమేంటమ్మా! మన పిల్లాడికి ఫస్ట్ రేంక్ రావాలి, మన పక్కింటివాళ్ళ పిల్లాడికి ఫస్ట్ రేంక్ రాకూడదు. ఇంకా విచిత్రమైన మాట చెప్పారు. మన పొలంలో వర్షం పడాలి, పక్కవాడి పొలంలో వర్షం పడకూడదు. ఇంక మనకి మోక్షం ఎలా వస్తుందమ్మా? అందరి శ్రేయస్సు కోరుకునేవాడికి మోక్షం వద్దన్నా వచ్చి వరిస్తుంది అన్నారు. నేను అనగానే ఎవరూ చెప్పక్కర్లేకుండానే మనకు దేహం స్ఫురిస్తోంది. అలా నేను అనగానే ఎవరికయితే బ్రహ్మం స్ఫురిస్తోందో వాళ్ళకి అది కడసారి జన్మ అన్నారు.

నైనం ఛిందంతి శస్త్రాణి
నైనం దహతి పావకః |
న చైనం క్లేదయంత్యాపో
న శోషయతి మారుతః ॥

అంటే ఆత్మను శస్త్రం ఖండించలేదు. అగ్ని దహించలేదు. నీరు తడపలేదు. గాలి ఎండింపచేయలేదు. అంటే ఆత్మ అవినాశి. అది సర్వవ్యాపి. సర్వకాల సర్వావస్థలలోనూ ఉండేది. ఆత్మను ఎవరూ ఏమీ చేయలేరు. నువ్వు ఇప్పుడే, ఇక్కడే Truth ని రియలైజ్ చెయ్యగలిగితే గొడవే లేదు. అది శాశ్వత ఆనందం. ఒకవేళ నువ్వు ఆస్థాయిని అందుకోలేకపోయినా, ఆత్మ పుడుతూ, చస్తూ ఉంటుందని ఒకవేళ అనుకున్నా కూడా నీకు మళ్ళీ పునర్జన్మ వస్తుంది. ఈ దేహం పోతే ఇంకో కొత్త దేహం ఇస్తాడు. అందుచేత చావుకి ఎవరూ భయపడక్కర్లేదు.

జాతస్య హి ధ్రువో మృత్యుః
ధ్రువం జన్మ మృతస్య చ
తస్మాదపరిహార్యేర్థే
న త్వం శోచితుమర్హసి ॥

అంటే పుట్టినవాడు చనిపోవడం ఎలాగూ తప్పదు. చనిపోయినవాడు పుట్టడం ఎలాగూ తప్పదు. కాబట్టి నువ్వు భయపడక్కర్లేదు. నీకు ఇంకో కొత్త దేహాన్ని, ఇంకో కొత్త తల్లితండ్రులను నిర్ణయించిన తరువాతే ఈ దేహంలోంచి నీ ప్రాణం తీస్తాడు. ఇంకో కుటుంబం నిన్ను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంటుంది అన్నారు. నాన్నగారి భక్తులమయిన మనమందరం అసలు భయపడక్కర్లేదు. ఎందుకంటే నాన్నగారు మనందర్నీ పస్ట్ క్లాస్ పాసింజర్స్ అన్నారు. నేను కాశీ లో బోటు ఎక్కలేకపోయినా, ఆయన వెనక్కి వచ్చి నన్ను ఎక్కించుకుని వెళ్ళారు.

పోస్టాఫీసు మీటింగులలో నాన్నగారు బల్లగుద్ది మరీ చెప్పిన మాటలు : "ఎవరయితే తమ శక్తిని, ఐశ్వర్యాన్ని .... అన్నిటినీ త్రికరణశుద్ధిగా 100 % ఉపయోగించుకుంటూ, బ్రహ్మంకోసం ప్రయత్నం చేస్తూ, ఆ ప్రయత్నంలో బ్రహ్మాన్ని పొందకుండా గనక మరణిస్తే, ఆలస్యం చేయకుండా మహాయోగులు, మహాత్ములు ఉన్న ఇంట్లో ఆ జీవుడిని తీసుకువెళ్ళి నేను ప్రవేశపెడతాను అర్జునా అన్నాడు కృష్ణుడు."

నేను హైదరాబాదు వస్తున్నానని తెలియగానే బంధువులు, భక్తులు అందరూ స్టేషన్ కి రిసీవ్ చేసుకోవడానికి వస్తారు. అలాగే మరి మనం చనిపోయినప్పుడు మన జీవుడిని రిసీవ్ చేసుకోవడానికి ఎవరయినా వస్తారా అంటే వస్తారు. ఇక్కడ మనం మాట్లాడిన మంచి మాట, మంచి తలంపు, మనం చేసే మంచి పని ఏదీ వృధా కాదు. ఆ సత్కర్మ మనల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చి మనల్ని చీకటి లోకాలకు తీసుకెళ్ళకుండా వెలుగున్న లోకాలకు తీసుకెళ్తుంది. జీవుడి కోసం ఎవరూ రారని అనుకోవద్దు అని నాన్నగారు అన్నారు.

నాన్నగారు ఎవరినైనా చూసి ఏదైనా అంటే ఆయన అనుగ్రహం వలన అది జరుగుతుంది. పటేల్ కి ఎంత ధైర్యం ఉందో పద్మకి అంత ధైర్యం ఉంది అనేవారు. ఒకసారి ఏదో చిన్న సంఘటన జరిగింది. నిజానికి ఆ సంఘటనకి నాకు రియాక్షన్ వచ్చింది. కానీ నాన్నగారు పద్మ అసలు ఈ చిల్లర విషయాలు పట్టించుకోదు అన్నారు. నాన్నగారు అలా అనగానే అయితే నాన్నగారు నన్ను చాలా ఉన్నత స్థాయిలో చూడాలనుకుంటున్నారు అనుకున్నాను. అంటే యాక్షన్ ఉండాలి కానీ, రియాక్షన్ ఉండకూడదు అని నాన్నగారు గైడ్ చేసారు.

"సత్యజ్ఞానములేని ఈ జన్మ ఫలమేమి యొప్పగ రావేల అరుణాచలా!"

భగవాన్ అక్షరమణమాలలో చెప్పింది నాన్నగారు ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. సత్యాన్ని తెలుసుకోకుండా, జ్ఞానం పొందకుండా ఈ దేహం చనిపోయింది అనుకోండి ఏం ప్రయోజనం? అంటూ భగవాన్ దగ్గరకి వచ్చిన ఒక వ్యక్తి గురించి చెప్పారు.

ఒక మాష్టారు చాలా సమస్యలు ఉండడంవల్ల చనిపోదామని నిర్ణయించుకుని, చివరిసారిగా దర్శనం చేసుకుందామని భగవాన్ దగ్గరకి వస్తారు. భగవాన్ ఆ సమయంలో విస్తరాకులు కుడుతూ ఉంటారు. ఈ విస్తరాకులు నేను ఎందుకు కుడుతున్నాను? అని అడిగారు. మీరు భోజనం చేయడానికి అని మాష్టారు సమాదానం చెప్పారు. భోజనం చేయకుండానే నేను ఈ విస్తరాకుని పడేసాననుకోండి ఏమిటి ప్రయోజనం? అన్నారు భగవాన్. మీరు కుట్టిన విస్తరాకు వృధా అయినట్టే అని చెప్పిన మాష్టారుకి వెంటనే స్ఫురించింది. నేను చనిపోదామని అనుకుంటున్న విషయం భగవాన్ కి అర్థమయింది, అందుకే విస్తరాకు గురించి ఉదాహరణగా చెపుతున్నారు. జ్ఞానం పొందకుండా చనిపోతే, విస్తరాకులాగే నా జన్మ కూడా వృధా అవుతుందని భగవాన్ తెలియజేస్తున్నారు అని అర్థమై ఆ మాష్టారు ఆత్మహత్యాప్రయత్నం విరమించుకున్నారు. అది మహాత్ముల దర్శనం వల్ల కలిగే ప్రయోజనం!

నాన్నగారు ఒక ప్రవచనంలో, మోక్షం వచ్చేవరకు గురువు వెంటాడుతూనే ఉంటాడు అని చెప్పారు. గురువు దేహంతో కూడానే ఉంటాడా అని అడిగాను. నాన్నగారు "దేహంతో సహా ఉంటాడు" అన్నారు. రామకృష్ణుడు మళ్ళీ పుడతాను అన్నాడు కదా! రామకృష్ణుడు మళ్ళీ పుట్టడం ఏమిటి? రామకృష్ణుడు అనే Individual విడిగా ఉంటుందా? తిరిగి పుట్టడానికి అని అడిగాను. అప్పుడు నాన్నగారు, కృష్ణుడు కూడా చెప్పాడు నేను మళ్ళీ పుడతానని!

యదా యదాహి ధర్మస్య
గ్లానిర్భవతి భారత|
అభ్యుత్థానమధర్మస్య
తదాత్మానం సృజామ్యహమ్॥

పరిత్రాణాయ సాధూనాం
వినాశాయ చ దుష్కృతామ్ |
ధర్మసంస్థాపనార్థాయ
సంభవామి యుగే యుగే ॥

ధర్మమునకు హాని కలిగినప్పుడు, అదర్మం పెచ్చుపెరిగినప్పుడు నన్ను నేను సృజించుకుంటాను. ధర్మ పరిరక్షణ కొరకు నేను ప్రతియుగమునందు అవతరిస్తాను అని కృష్ణుడు అర్జునుడితో చెప్పాడు కదా! వాడు బ్రహ్మమై చెబుతున్నాడు. అంటే రామకృష్ణుడు కూడా బ్రహ్మమై చెబుతున్నాడు నేను మళ్ళీ వస్తాను అని. అంటే వారు దేహాన్ని సృజించుకుంటారు. ఉదాహరణ: వర్షం వచ్చినప్పుడు మన ఇళ్ళల్లో అన్ని తూరలలోంచి నీరు ప్రవహిస్తుంది. అన్ని తూరలలోంచీ వచ్చేది వర్షపు నీరే! అలాగే ఆచార్యులవారై వచ్చినా, రామకృష్ణుడై వచ్చినా.... ఏ రూపంలో వచ్చినా వారిద్వారా ప్రవహించేది మొత్తం బ్రహ్మమే! ఏదో ఒక రూపంలో వచ్చి ఆ ఇంజన్ కి నీ పెట్టె తగిలించేస్తారు అన్నారు. నాన్నగారు కూడా బ్రహ్మమై చెబుతున్నారు నేను మళ్ళీ వస్తానని! మళ్ళీ పుడతాను అంటే అక్కడ నాన్నగారు అనికాదు. బ్రహ్మమే మళ్ళీ పుడుతుంది.

సర్వధర్మాన్ పరిత్యజ్య
మామేకం శరణం వ్రజ|
అహం త్వా సర్వపాపేభ్యో
మోక్షయిష్యామి మా శుచః॥

భగవంతుడికోసం అన్ని ధర్మాలనూ విడిచిపెట్టేయచ్చు. అప్పుడు ఆయన మనలో ఉన్న పాపాలన్నీ కడిగి ఆయన స్వరూపాన్ని ఇస్తాడు. అయితే శరణాగతి చెందడం మనచేయాల్సిన పని.

"వ్యక్తిగతమైన నేను ఉన్నంతసేపు గురువునో, ఈశ్వరుడినో నమ్మవలె" అన్నారు భగవాన్. రమణ భాషణములులో వస్తుంది. ఆ వాక్యము నాన్నగారు నాతో చదివించారు. భక్తిమార్గం safest & surest అన్నారు. అంటే నదిని ఈదుకుంటూ వెళ్ళవచ్చు, పడవలోనూ వెళ్ళవచ్చు. అంటే భక్తిమార్గం పడవలో క్షేమంగా ప్రయాణించినట్టు!

"రమ్మని యనలేదె వచ్చినా వంతివ్వ వెరకు నీ తలవిధి అరుణాచలా"

అని అక్షరమణమాలలో భగవాన్ అన్నారు కదా! అంటే రమ్మని పిలిచావు, నీ కూడా తిప్పుకున్నావు, ఇప్పుడు జ్ఞానం ప్రసాదించవలసిన బాధ్యత కూడా నీదే అని అర్థం. అంటే మనకు మోక్షం ప్రసాదించటం నాన్నగారికి, అరుణాచలేశ్వరుడికి వారి విధి అన్నమాట! అయితే కొంచెం మన ముఖం అటువైపు తిప్పి ఉంచాలి.

చివరిసారిగా నేను వైజాగ్ హాస్పిటల్ కి వెళ్ళి దర్శనం చేసుకున్నప్పుడు, నిండు పున్నమి చంద్రునిలా నవ్వుతూ రెండు చేతులూ ఎత్తి ఆశీర్వదించారు.

ఆయన జీవించి ఉన్నంతకాలం ఆయన సమక్షంలో ఆనందంగా గడిపే భాగ్యం నాకు కలుగచేసారు. అంతులేని ప్రేమ కురిపించారు. సంతృప్తికరమైన జీవితాన్ని ప్రసాదించారు. జ్ఞానబిక్ష పెట్టారు. మరణభయాన్ని దాటించారు. God realisation పొందేవరకూ కూడానే ఉంటానని అభయం ఇచ్చారు.

అన్నీ తానై సులభంగా ఆధ్యాత్మిక ప్రయాణం చేయిస్తూ, లక్ష్యాన్ని చేరుస్తున్న నాన్నగారి పాదపద్మములకు సర్వదా కృతజ్ఞతా పూర్వక ప్రణామములు!

1 comment:

  1. Aunty chala thanks for sharing ur experience with Nannagaru in your life...idhi read chesinantha sepu nenu kuda mitho nannagaritho vunna feeling vachindi...felt the experience of nannagaru presence ...
    Thank you once again..
    Arunachala shiva...

    ReplyDelete