Thursday, September 16, 2021

"నాన్నగారి ప్రేమ - విశ్వ ప్రేమ" - (రాజశ్రీ గారు)

నాన్నగారు మన జీవితంలోకి వచ్చిన తరువాత మనం ఒక్కసారి వెనుకకు తిరిగి చూసుకుంటే మన జీవితం అంతా నాన్నగారే ఉంటారు. అంటే మన భౌతిక జీవితం మరియు ఆధ్యాత్మిక జీవితం ఆయన ఆధీనంలోకి వెళ్ళిపోతాయి. ఎంతో ప్రేమగా మనల్ని సవరిస్తూ, మనల్ని శాంతిలో నిలబెడుతూ మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముందుకు తీసుకు వెళ్ళుతున్నారు.

నా ఆధ్యాత్మిక ప్రయాణం మా అమ్మగారి ద్వారానే మొదలైంది. అందువల్ల ఆమె నాకు తొలి గురువు. మా అమ్మగారు రాజమండ్రిలో ఉండేవారు. ఒకసారి నాకు ఫోన్ చేసి, ఉపదేశసారంలో ఉన్న మొట్టమొదటి శ్లోకాన్ని చెబుతూ నన్ను ఒక పేపర్ మీద రాసుకోమన్నారు. 'కర్తురాజ్ఞయా, ప్రాప్యతే ఫలం' అని రాయించారు. మా అమ్మగారు ఎక్కువ జ్ఞాన మార్గాన్ని ఇష్టపడేవారు. అదేవిధంగా జీవించి కూడా చూపించేవారు. మాకు ఎప్పుడూ ప్రవర్తన సరిగ్గా ఉండాలి అని చెబుతూ, రామాయణంలో రాముడు ఫలానా సంఘటన ఎదురయితే అలా ప్రవర్తించాడు అని అలా అందరి పుణ్య పురుషుల గురించి మాకు చెబుతూ, మీరు అలా సవరించుకుంటూ ఉండాలి అని బోధించేవారు. శాస్త్ర ప్రమాణంగానే నీ జీవితాన్ని సరిదిద్దుకో అని నాకు సలహా ఇస్తూ ఉండేవారు. ఒకసారి సుందర చైతన్య గారు రాజమండ్రిలో ఉపదేశసారం బోధించారు. అది మా అమ్మగారు విని, మహర్షి పట్ల చాలా ఆకర్షితులయ్యారు. తరువాత కొద్ధి రోజులకే బంధువులతో కలిసి అరుణాచల యాత్రకు వెళ్ళారు. అక్కడ రమణాశ్రమం చూసి వచ్చి చాలా ఆనందపడ్డారు. నేను నా భర్త ఎక్కడికైనా యాత్రలకు వెళ్ళాలి అంటే, ఏదో ఒక పుణ్యక్షేత్రాన్నిదర్శించుకోవటానికి వెళ్ళేవాళ్ళం. మా అమ్మగారు అరుణాచలం చూసి వచ్చిన తరువాత, నువ్వు మీ భర్త పుణ్యక్షేత్రాలకు వెళుతూ ఉంటారు కదా! ఈసారి అలా వెళ్ళినప్పుడు అరుణాచలంలో రమణాశ్రమాన్ని తప్పక దర్శించుకోండి అని చెప్పారు.

తరువాత నా భర్తతో కలిసి అరుణాచలం వెళ్ళాను. రమణాశ్రమం గేటు చూడగానే, నాకు తెలియకుండానే దుఃఖం వచ్చేసింది. ఆ దుఃఖం పూర్వజన్మ అనుబంధం వలన వచ్చింది అని, నాన్నగారి దగ్గరకు వచ్చిన తరువాత అర్థమయ్యింది. గిరి ప్రదక్షిణ చేసిన తరువాత, మా అమ్మాయికి కొంచెం ఆరోగ్యం బాగా లేనందువలన నా భర్త, మా అమ్మాయి కిందనే ఉండిపోయారు. నేను, మా అబ్బాయిని తీసుకుని గిరిపైకి వెళ్ళాను. అప్పుడు మా అబ్బాయి గిరి పైకి వెళితే, రమణమహర్షి కనిపిస్తారా? అని అడిగాడు. కనిపిస్తారు అని చెప్పి - మా అబ్బాయిని తీసుకు వెళ్ళాను. మధ్య దారిలో ఒక వృద్ధ సాధువు మమ్మల్ని ఆపి, 'రమణ మహర్షి జీవిత కథ కొద్దిగా ఇంగ్లీషులో చెప్పారు'. అది విని మా అబ్బాయి నిజంగానే రమణమహర్షి ఈ సాధువు రూపంలో వచ్చారు అని భావించి చాలా ఆనందపడ్డాడు. తిరిగి వచ్చేటప్పుడు సూరి నాగమ్మ గారి లేఖలు పుస్తకం తెచ్చుకున్నాను. ఆ గిరి, ఆ రమణాశ్రమం, నా మనసుని చాలా ఆకట్టుకున్నాయి. అరుణాచలం నుండి వచ్చిన తరువాత ఒక నలభై రోజులు సూరి నాగమ్మ గారి లేఖలు మొత్తం చదివాను. ప్రతిరోజు నా దైనందిన దినచర్య పూర్తి అయిన తరువాత, లేఖలను చదువుతూ ఉండేదాన్ని. రమణ మహర్షి గారి జీవిత వైభవం, ఆ సబ్జెక్టు నా మనసుని బాగా హత్తుకుని, చాలా ఆనందం అనిపించింది.
మేము అరుణాచలం వెళ్ళి వచ్చిన రెండు సంవత్సరాలకి నా భర్తని , అకస్మిక మరణంతో అరుణాచలేశ్వరుడు తీసుకు వెళ్ళిపోయాడు. ఆయన చనిపోయారు అని కబురు తెలిసి మేము నా భర్త పనిచేసే నర్సింగ్ హోమ్ కి వెళ్ళాము. అక్కడ అయన దేహాన్ని చూడగానే, ఆయన హృదయం పైన నా తలని పెట్టుకోగానే నాకు తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాను. మా అన్నయ్య నన్ను పిలవగానే నాకు మెలకువ వచ్చి, భర్త చనిపోతే నిద్ర వస్తుందా! అనే సందేహం వచ్చింది కానీ, ఆ సందేహాన్ని నివృత్తి చేసేవారు లేరు. నా భర్త చనిపోయిన తరువాత ఎందుకో తెలియదు కానీ నాకు కలగవలసిన అంత దుఃఖం కలుగలేదు. భగవంతుడు దగ్గర మాత్రమే నాకు తెలియకుండా కన్నీరు వచ్చేసేది. ఆయన చనిపోయిన రెండు నెలలకు ఆయన పని చేసే హాస్పటల్ లోనే నాకు ఉద్యోగం వచ్చింది. భవిష్యత్తులో బిడ్డలు జీవితం వారికి ఏర్పడుతుంది కాబట్టి మనం ఏదో ఒక ఆధ్యాత్మిక సంస్థని పట్టుకొని ఉండాలి అనిపించి, అవకాశం ఉన్నప్పుడల్లా చాలా పుస్తకాలు చదివి, చాలా ఆధ్యాత్మిక కేంద్రాల చుట్టూ తిరిగాను. నా భర్త చనిపోయిన సంవత్సరానికి మా కుటుంబ సభ్యులు అందరం కలిసి అరుణాచలం వెళ్ళాము. అక్కడ 'అరుణాచలేశ్వరుడిని చూడగానే గోలక్ష్మి తన సంతానాన్ని తీసుకువచ్చి భగవాన్ ఎదుట ఉంచి నీదే భారం అని భగవాన్ ఎదుట బోర్లాసాచి పడుకుంటుంది. ఈ వాక్యం లేఖలలో ఉంటుంది. అది నా మనసుకు స్ఫురించి, అరుణాచలేశ్వర గిరి వైపు చూస్తూ నా బిడ్డలను తీసుకువచ్చి నీకు అప్పజెప్పాను. నీదే భారం అనుకొని నేను తల్లి వేషం వేస్తాను. నువ్వే చూసుకో అని ఆయనకు అప్పగించేసాను'. అరుణాచలం నుండి తిరిగి వచ్చేస్తుంటే, ఆ గిరిని వదిలి వస్తూ ఉంటే, ఎప్పటి నుండో నా మదిలో దాగి ఉన్న దుఃఖం అంతా కట్టలు తెంచుకుని వచ్చేసింది. బస్సులో కూర్చుని ఆ గిరి వైపు చూస్తూ ఉంటే, తల్లిదండ్రులు తమ కూతురు అత్తవారి ఇంటికి వెళుతూ ఉంటే కన్నీటితో సాగనంపుతారు కదా! అదేవిధంగా గిరి కూడా నా కోసం కన్నీరు పెట్టుకుంటూ నన్ను సాగనంపుతున్నట్టు అనిపించింది. 'తండ్రి నువ్వు నాకు చాలా దూరంగా ఉన్నావు. నేను నీ దగ్గరకు రావాలంటే చాలా సమయం పడుతుంది. నిన్ను విడిచి ఉండలేను. ఎలా నీ దగ్గరికి రాగలను అంటూ దుఃఖ పడుతూ ఉన్న సమయంలో మా అమ్మగారు రమణ మహర్షి గారి శిష్యులు 'నాన్నగారు' అని ఒకరు జీవించే ఉన్నారట ఆయనతో మనము సాన్నిత్యం పెంచుకోవాలి అని నాకు చెప్పారు.

మా అమ్మగారు మరియు నాన్నగారు భక్తురాలైన ఝాన్సీగారి తల్లిగారు అనుకోకుండా కలవటం, వారి మాటల మధ్యలో మా అమ్మాయి నాన్నగారు దగ్గరకు వెళుతుంది అని చెప్పటం అలా నాన్నగారు భక్తురాలైన ఝాన్సీగారు ద్వారా నాన్నగారు మా జీవితంలోకి ప్రవేశించారు. ఝాన్సీగారి ఇల్లు నేను పనిచేసే ఆఫీస్ కి దగ్గరగా ఉండటం వలన ఒకసారి వెళ్ళాను. ఝాన్సీ గారు నాకు ఒక అరడజను క్యాసెట్లు, రమణ సంభాషణలు అనే పుస్తకాన్ని కూడా ఇచ్చి, ఇవి చదువుతూ ఉండండి నాన్నగారు వచ్చినప్పుడు మీకు చెబుతాను దర్శనం చేసుకోవచ్చు అని చెప్పారు. ఒకరోజు ఝాన్సీగారు ఫోన్ చేసి, ఫలానా చోటికి నాన్నగారు వస్తున్నారు అని నన్ను రమ్మని చెప్పారు. నా ఆఫీసు అయిపోయిన తరువాత మధ్యాహ్నం నుండి ఝాన్సీ గారు చెప్పిన అడ్రస్ కి వెళ్ళాను. అక్కడ కొంతమంది భక్తులు పువ్వులు కడుతున్నారు. భానుగారి పద్మ గారు సత్సంగం చెబుతున్నారు. ఆ మాటలు విని ఎంత అద్భుతంగా చెప్తున్నారో అని నాకు చాలా ఆనందం అనిపించింది. మా అమ్మాయి కాలేజ్ నుండి ఇంటికి వచ్చే సమయం అయినందువలన ఈ రోజుకి నాన్నగారు దర్శనం నాకు కలగదు ఏమో! అనుకొని, ఝాన్సీగారితో నేను బయలుదేరుతాను అండి అని చెప్పాను. అప్పుడు ఆమె మొదటిసారి వచ్చి నాన్నగారి దర్శనం చేసుకోకుండా ఎలా వెళ్తారు అని, నన్ను నాన్నగారి దగ్గరకు తీసుకువెళ్ళి, ఈమెకు ఈ మధ్యనే భర్త చనిపోయారు నాన్నగారు అని చెప్పారు. అప్పుడు నాన్నగారికి నాకు సంభాషణ ఈ విధంగా కొనసాగింది:

నాన్నగారు : ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా?
భక్తురాలు (రాజేశ్వరిగారు) : (అప్పటికే మా అబ్బాయి చదువుకి కొంచెం ఇబ్బంది ఉంది అని మనసులో మెదులుతూ ఉన్నా అందరి ముందు చెప్పలేక) 'భగవంతుడి దయవలన ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవు నాన్నగారు'.
నాన్నగారు : 'అలాగా!'
నాన్నగారిని చూడటం అది మొదటిసారే అయినప్పటికీ, నాన్నగారు 'అలాగా' అనేసరికి నా మనసుకి "నీకు ఆర్థిక ఇబ్బందులు ఏమీ ఉండవు అని నన్ను ఆశీర్వదించినట్టు అనిపించింది".
భక్తురాలు (రాజేశ్వరి గారు) : నాన్నగారు! నా భర్త చనిపోయినప్పుడు, ఆయన దేహం మీద నా తలవాల్చుకోగానే, నాకు మౌనం వచ్చేసింది. (అని నాకు తెలియకుండానే నాన్నగారితో చెప్పేసాను).
నాన్నగారు : కొద్ది క్షణాలు మౌనంగా ఉండి, 'నువ్వు తరిస్తావు' అమ్మా!
భక్తురాలు (రాజేశ్వరిగారు) : నాకు భృకుటి లో ఏదో తెలుస్తోంది అది మనస్సేనా?
నాన్నగారు : 'అవును' మనస్సే అమ్మా.
భక్తురాలు (రాజేశ్వరి గారు) : నాన్నగారు! భృకుటి మీద దృష్టి నిలపవచ్చా?
నాన్నగారు : నీ ఇష్టం అమ్మ! నీకు ఎక్కడ భావుంటే అక్కడ దృష్టి నిలుపు.
భక్తురాలు (రాజేశ్వరి గారు) : భృకుటి మీద ధ్యాస పెడితే మహిమలు వస్తాయి అంటారు కదా! నాన్నగారు.
నాన్నగారు : 'ఆ మహిమలు గొడవ మనకి ఎందుకమ్మా!'
నాన్నగారు నన్ను తరిస్తావు అమ్మ అని ఆశీర్వదించారు అని నాకు పట్టరాని ఆనందం వచ్చేసింది. ఆ తరువాత నాకు నేను ఇన్ని రోజులు ఏదో ఒక ఆధ్యాత్మిక సంస్థలో స్థిరపడాలని చాలా ఆధ్యాత్మిక కేంద్రాలు చుట్టూ తిరిగాను, అలా ఎందుకు తిరిగాను అంటే! 'నాన్నగారి ఆశీర్వచనం పొందటం కోసం తిరిగాను' అని అర్థమయ్యి, "ఆధ్యాత్మిక కేంద్రాన్ని పట్టుకుని తిరగడం నా లక్ష్యం కాదు. నేను తరించటమే నా జీవిత లక్ష్యం అని నాకు అవగతమైంది". అలాగే నాకు ఏమి కావాలో నా కంటే ఎక్కువ ఈయనకే తెలిసింది కాబట్టి 'నాన్నగారే నా భౌతికమైన గురువు' అని ఆ రోజు నాకు అర్థం అయింది.

నాకు ఆఫీసు ఉండటం వలన ఎక్కువ సత్సంగానికి వెళ్ళటం కుదిరేది కాదు. అవకాశం ఉన్నప్పుడు మాత్రము సోమవారం ఎస్ ఆర్ నగర్ లో సత్సంగానికి వెళుతూ ఉండేదాన్ని. తరువాత నాన్నగారు ఒకసారి శ్రీనగర్ కాలని వచ్చినప్పుడు, ఆఫీసులో ఒక గంట పర్మిషన్ తీసుకుని - ఉదయాన్నే నాన్నగారి దగ్గరకు వచ్చాను. నేను వచ్చేసరికి హాలంతా భక్తులతో నిండిపోయి ఉంది. నేను తిరిగి ఆఫీస్ కి వెళ్ళాలి అనే ఉద్దేశంతో నాన్నగారికి కనిపించే లాగా బయట కూర్చుని ఉన్నాను. నాన్నగారు చెబుతూ ఉంటే ఏదో వ్యక్తిగతంగా మాట్లాడుతారు అనుకున్నాను కానీ, ప్రవచనం చెబుతున్నారని అప్పటికి నాకు తెలియదు. ఆరోజు నాన్నగారి ప్రవచనం వింటుంటే! చాలా అద్భుతంగా అనిపించి, నా మనసు బాగా ఎంజాయ్ చేసింది. కానీ ఆఫీస్ కి వెళ్ళే సమయం అవ్వటం వలన ప్రవచనం వదిలి వెళ్ళవలసి వస్తోంది అని దుఃఖం వస్తూ, ఒకవైపు ఆఫీసు ఉండటం మరియు పిల్లల బాధ్యతలు వలన అందరిలా నాకు నాన్నగారి దగ్గరకు రావటం కుదరటంలేదు. ఎంత దౌర్భాగ్యమైనది నా ఈ జన్మ, అంత అద్భుతమైన సబ్జెక్ట్ ని వినటానికి అవకాశం లేని జన్మ కదా! అని దుఃఖిస్తూ లేచి నిలబడ్డాను. అప్పుడు నాన్నగారు 'వారం రోజులు నీతో ఉండే గురువుని నువ్వు ఏమి పట్టుకుంటావు? హృదయంలో నిరంతరం ఉండే గురువుని పట్టుకో అని చెప్పారు'. నాన్నగారు ఆ వాక్యం చెప్పగానే నా హృదయానికి బాగా హత్తుకొని అప్పటిదాకా ఉన్న దుఃఖం అంతా ఆనందం కింద మారిపోయి ఆఫీస్ కి వెళ్ళటానికి బయలుదేరాను. ఒకసారి నా స్నేహితురాలు Retirement తీసుకున్నారు. అప్పుడు ఆమెతో మీరు రిటైర్ అయిపోతున్నారు కదా! రేపటి నుండి ఎస్సార్ నగర్ సత్సంగానికి వెళుతూ ఉండవచ్చు అన్నాను. ఆ తర్వాత రోజు ఇద్దరం కలిసి ఎస్.ఆర్.నగర్ వెళ్ళాము. అక్కడ నాన్నగారు అంతకు ముందు రోజే జిన్నూరు వెళ్ళిపోయారు అని తెలిసింది. ఆ మాట వినగానే నాన్నగారిని చూసే అర్హత నాకు లేదా? అని చాలా దుఃఖం వచ్చేసింది. తరువాత అనుకోకుండా మేము అరుణాచలం వెళ్ళాము. అక్కడికి నాన్నగారు వస్తున్నట్లు మాకు తెలియదు. కానీ నాన్నగారు దర్శన భాగ్యం మాకు అరుణాచలంలో కలిగింది. నాన్నగారిని మా బాబు,పాప అరుణాచలంలోనే మొదటిసారి దర్శనం చేసుకున్నారు. నాన్నగారు హైదరాబాద్ వస్తుంటే, నాకు తెలియటం లేదు. నాన్నగారు భక్తులలో ఎవరో ఒకరిద్దరితో పరిచయం ఏర్పడితే నాన్నగారు వచ్చినప్పుడు చెబుతారు కదా! అనుకొని ప్రత్యేకించి వారితో మాట్లాడి, నాన్నగారు వచ్చినప్పుడు చెప్పమనేదాన్ని. వారు చాలా శ్రద్ధగా నాన్నగారు వచ్చినప్పుడల్లా నాకు చెబుతూ ఉండేవారు. అప్పటినుండి నాన్నగారు హైదరాబాదు వచ్చిన ప్రతీసారి తరచూ వస్తూ ఉండేదాన్ని.

తరువాత ఒక ఐదు సంవత్సరాలకి నాకు అనారోగ్యం వచ్చింది. అప్పటికే మా పిల్లలు ఇద్దరూ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అందువల్ల నేను నా ఉద్యోగానికి సెలవు పెట్టేసాను. అదే సమయంలో నాన్నగారు ప్రతి రెండు నెలలకు ఒకసారి హైదరాబాదు నాకోసమే వస్తున్నట్టు వచ్చి, పది రోజులు ఉండేవారు. నాకు నాన్నగారు అంటే ఇష్టం వలన మా పిల్లలు కూడా నాన్నగారి దగ్గరకు వెళ్తానంటే ఏమీ అనేవారు కాదు. అందువలన నాన్నగారు ఉన్న పది రోజులు కూడా ఉదయాన్నే వచ్చేసి, సాయంత్రం వరకు ఉండేదాన్ని. నాన్నగారు చెప్పే ప్రవచనాలు చాలా అద్భుతంగా ఉండేవి. నాన్నగారు జిన్నూరు వెళ్ళిపోయిన తరువాత కూడా ప్రతి సోమవారం ఎస్సార్ నగర్ సత్సంగానికి తప్పకుండా వెళ్ళేదాన్ని. ఆ సత్సంగాలకి క్రమం తప్పకుండా వెళ్ళటం వలన నాకు ఆ వాక్యాలు విలువ తెలియటం మొదలైంది.

ఒకసారి సత్సంగంలో 'లౌకికులు మన ఇంటికి వస్తే వారితో మీరు ఏమీ మాట్లాడకుండా, మీకు ఏమైనా పని ఉంటే చేసుకుంటూ ఉండండి అని వారితో ఎలా ప్రవర్తించాలో చెప్పారు'. ఆ వాక్యం వినగానే, వారితో అలా ప్రవర్తించాలా అనుకుంది నా మనసు. అదే వారంలో మా ఇంటికి లౌకికులు రావటం జరిగింది. నాకు ముందు నుండి వారితో మాట్లాడటం పెద్దగా ఇష్టం ఉండేది కాదు. మంచితనంలో చిన్న పిరికితనం ఉంటుంది కదా! ఆ పిరికితనం వలన వారిని భరిస్తూ వచ్చేదాన్ని. ఆ వారంలో వారు వచ్చినప్పుడు నాన్నగారి వాక్యం నా హృదయంలో వారితో ఎలా ప్రవర్తించాలి అనేది స్ఫురించి, వారికి మర్యాద చేయవలసింది చేసి, మౌనంగా కూర్చుని ఉన్నాను. వారు కూడా ఒక గంట కూర్చుని మాకు కూడా పని ఉంది వెళ్ళి వస్తాము అని చెప్పి వెళ్ళిపోయారు. నేను ఏమీ మాట్లాడలేదు అని, వారికి నా మీద కోపం రాలేదు. ఆ సంఘటన నాకు చాలా వింతగా అనిపించింది. అలా నా జీవితంలో నాన్నగారి వాక్యాన్ని పట్టుకొని జీవించటం ప్రారంభమయింది. అప్పుడు 'నాకు మనకు అవసరమైనప్పుడు గురువు వాక్యం రూపంలో మన దగ్గరకు వచ్చి మనల్ని అనుగ్రహిస్తాడు అనిపించింది'.

మరొక సారి సత్సంగానికి వెళ్ళినప్పుడు 'బంధువులలో బంధువై ఉండు, స్నేహితులలో స్నేహితురాలివై ఉండు అని చెప్పారు'. ఈరోజు ఇలా చెప్తున్నారు ఏమిటి అనుకుని ఇంటికి వచ్చేసాను. తరువాత నాలుగు రోజులకి బంధువులు వచ్చారు. వారు రాగానే, నాన్నగారు చెప్పిన బంధువులలో బంధువై ఉండు అనే వాక్యం స్ఫురించి, వారికి నచ్చినట్టు ప్రవర్తించి వారిని పంపించేసాను. అలా నెమ్మదిగా వాక్యం పట్టుకొని జీవించటం మొదలయ్యింది.వాక్యాన్ని ఆచరణలో పెడుతూ ఉంటే, నాకు చాలా ఆనందం అనిపించేది. అప్పటినుండి వాక్యాలు విలువ నాకు అర్ధమయ్యి, ప్రతిరోజు నాన్నగారు ప్రవచనం వింటూ ఉండేదాన్ని.

నా స్నహితురాలు అయిన స్వర్ణ భర్త చనిపోయారు. నేను అరుణాచలం వెళ్ళేసరికి ఆమె కూడా అరుణాచలంలోనే ఉన్నారు. ఆమె చాలా భక్తి కలవారు అని నాకు ముందుగానే తెలుసు. ఆమె నన్ను అరుణాచలంలో చూసి గట్టిగా పట్టుకొని దుఃఖపడ్డారు అదే సమయంలో నాన్నగారు కూడా అరుణాచలంలోనే ఉన్నారు కానీ ఆమెని నేను కలిసే సమయానికి నాన్నగారు రెస్ట్ లోకి వెళ్ళిపోయారు. అందువలన ఒక్కసారి మీరు రేపు నాన్నగారి దర్శనం చేసుకోండి మీకు దుఃఖం అంతా నశిస్తుంది అని చెప్పాను. కానీ ఆమె మరుసటి రోజు బెంగుళూరు వెళ్ళిపోవలసి వచ్చింది. ఆ తరువాత నాన్నగారు హైదరాబాద్ వచ్చినప్పుడు, ఆమెకు చెబితే వచ్చి నాన్నగారిని దర్శనం చేసుకున్నారు. నాన్నగారు పాదాలు పట్టుకోగానే ఆమెకు చాలా శాంతి వచ్చేసింది. నాన్నగారు కూడా ఆమెను ఎదురు వెళ్ళి పలకరించి చాలా శ్రద్ధగా వస్తున్నావు అమ్మ అనేవారు. తరువాత నాన్నగారు హైదరాబాద్ నుండి శ్రీశైలం బయలుదేరేరుతున్నారు. అదే సమయంలో ఒక భక్తుడు వచ్చి, 'True Love' గురించి అడిగారు. ఆ ప్రశ్న వినగానే నాన్నగారు ఇది చెప్పటానికి ఒక రోజు సమయం పడుతుంది అని True Love గురించి రామకృష్ణుడిని ఉదహరిస్తూ చాలా అద్భుతంగా చెప్పారు. అప్పుడు రామకృష్ణుడు గురించి చెప్పటం మొదలు పెట్టి, ఆ తరువాత రెండు మూడు సంవత్సరాలు నాన్నగారు రామకృష్ణుడు గురించి చెబుతూ రామకృష్ణుడు అయిపోయారు. నాన్నగారు ఆ True Love గురించి చెబుతూ, అనుగ్రహం వర్షం కురిపించేసారు. అప్పుడు నా మనసును అంతర్ముఖము అయ్యి, నాన్నగారి అనుగ్రహ వర్షంలో తడవటం అనేది అదే మొదటిసారి. నాన్నగారు లేచి లోపలికి వెళ్ళి పోయినా నేను కళ్ళు తెరవలేకపోయాను. ఆరోజు నాన్నగారు అంటే ఏమిటో నాకు అనుభవంలోకి వచ్చింది.

నాన్నగారు శ్రీశైలం నుండి వచ్చిన తరువాత వేరే చోటికి వెళుతున్నారు అని నా స్నేహితురాలు అయిన స్వర్ణ గారితో కలిసి వెళ్ళాను. అక్కడ నాన్నగారు ఆమెను చూసి చాలా చనువుగా పలకరించారు. నాన్నగారు అలా ఆమెను పలకరించగానే, నేను నాన్నగారి దగ్గరకు వచ్చి ఆరు సంవత్సరాలు అయింది కానీ, నన్ను ఎన్నడూ ఇలా పలకరించలేదు అనుకున్నాను. తరువాత నాన్నగారు వేరే వారి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కుడా అదేవిధంగా ఆమెని పలకరించారు. తరువాత మేము ఇద్దరం బయటకి వచ్చినప్పుడు ఆమెను మీకు జ్ఞానం వచ్చింది కదా! అని అడిగాను. ఆమె మౌనంగా ఒక చిరునవ్వు నవ్వారు. వెంటనే ఆమె పాదాలకు నమస్కరించి నన్ను కూడా అనుగ్రహించండి అన్నాను. అలాంటిది ఏమీ లేదు రాజేశ్వరి అన్నారు.

'రామకృష్ణుడు వివేకానందుడుని చూడగానే, వీడికి జ్ఞానం వచ్చేసింది అని తెలిసిపోయింది. అలాగే నా స్నేహితురాలికి జ్ఞానం వచ్చినట్టు నాన్నగారికి తెలిసిపోయింది కాబట్టి, నాన్నగారు రామకృష్ణుడే అన్నమాట అని అర్థమయింది. నాకు చిన్నప్పటినుండి రామకృష్ణుడు అంటే చాలా ఇష్టం. మా అమ్మగారు కూడా మా చిన్నప్పుడు రామకృష్ణుడు గురించి చెప్పేవారు, అలాగే రామకృష్ణడి జీవిత సంగ్రహం కూడా చదివాను.

'ముందురోజు నాన్నగారు True Love గురించి చెబుతూ, రామకృష్ణుడిని ఉదహరించారు. అప్పుడే నా మనసు అంతర్ముఖము అయ్యింది. తర్వాత రోజు నా స్నేహితురాలు స్థాయి నాన్నగారికి తెలిసింది కాబట్టి నా గురువు రామకృష్ణుడు అనుకొని నాన్నగారు, రామకృష్ణుడు ఒక్కరే అని బాగా నిర్ధారణకు రావటం జరిగింది'. ఆ తరువాత నుండి నెమ్మదిగా నాన్నగారు అంటే ఏమిటి అనేది నాకు బాగా అర్థమవుతూ ఉండేది. అప్పటినుండి నాన్నగారు అంటే ఇష్టం వచ్చి, బాగా చనువు ఏర్పడి, సబ్జెక్ట్ లో ఏ సందేహం వచ్చినా, నాన్నగారిని అడగటం మొదలుపెట్టాను.

నాన్నగారిని ఏ సందేహం వచ్చి అడిగినా, అలా కళ్ళల్లోకి చూస్తూ రెండేసి గంటలు చెప్పేవారు. నా భర్త పోయిన తరువాత భగవద్గీతలో శ్లోకాలు కాకుండా దాని తాత్పర్యం ఎక్కువ చదివేదాన్ని. అందువలన భగవద్గీత పట్ల బాగా ఇష్టం ఏర్పడింది. అందులో 'ఫలితం నీ చేతిలో లేదు, నా మీద భారం వెయ్యి' అనే వాక్యాలు బాగా మనసుకి హత్తుకునేవి. భగవద్గీతలో ఉన్న సంశయాలు అన్నీ నాన్నగారిని అడుగుతూ ఉండేదాన్ని.

నాన్నగారు ప్రవచనం వినే ముందు ప్రతి రోజూ విష్ణు సహస్రనామాలు వినేదాన్ని. అందులో 'శ్రీరామ రామ రామేతి మనోరమే' అనే శ్లోకం మూడుసార్లు చదువుతారు. ఆ శ్లోకం మూడుసార్లు చదవటానికి ఒక 90 సెకన్లు సమయంపడుతుంది. నాన్నగారు చచ్చిపోయినట్టు జీవించమన్నారు కదా! అని ఆ 90 సెకన్లు అలా ఉండటానికి ప్రయత్నించేదాన్ని. కానీ, నాన్నగారు ఆ సమయంలోనే ఎక్కువ పరీక్షలు పెట్టేవారు. అదే సమయంలో బయటినుండి ఎవరో ఒకరు వచ్చి తలుపు కొట్టేవారు. మొదట్లో రియాక్ట్ అయ్యిపోయేదాన్ని కానీ చనిపోయిన వాడికి రియాక్షన్ ఉండదు కదా! అని బాహ్య సంఘటనలకు రియాక్ట్ అవ్వడం మానేసాను. కానీ లోపల తలంపులు మాత్రం నిరవధికంగా వస్తూనే ఉండేవి. నాకు ఆ తలంపులు అన్నీ తగ్గి కేవలం ఆ 'నామంతోనే ఏకాగ్రంగా తాధాప్యం పొందటానికి రెండు సంవత్సరాల సమయం పట్టింది'. నాన్నగారు చనిపోమంటున్నారు ఈ సమయానికి చనిపోవటానికి నేను సిద్ధంగా ఉన్నానా లేదా అనుకొని ప్రతిరోజూ ఆ 90 సెకన్లు అలా అభ్యాసం చేయించారు. అలా నాన్నగారు వాక్యంలో నన్ను జీవించేటట్లు చేశారు.

ఒకసారి నాన్నగారు హైదరాబాదు నుండి వెళుతూ, ఈ హోలీ కంపెనీలో ఒకే ఒక మైనస్ పాయింట్ ఉంది. అది ఏమిటంటే, విడిపోయేటప్పుడు దుఃఖం వస్తుంది అన్నారు. నాన్నగారు దేహం జిన్నూరు వెళ్ళి పోయినా, హృదయంలో గురువు ఉన్నారు కదా! హృదయంలో ఉన్న గురువుని పట్టుకుందాము అనుకున్నాను. ఆ రోజు సాయంత్రం నాన్నగారు జిన్నూరు వెళ్ళిపోతుంటే, నాంపల్లి స్టేషన్ కు వెళ్ళాను. నాన్నగారు ట్రైన్ ఎక్కే సమయానికి నాన్నగారు జిన్నూరు వెళ్ళిపోతున్నారు రేపటినుండి మనకు దర్శనాలు ఉండవు అనే తలంపు వచ్చి, నాకు చాలా దుఃఖం వచ్చేసింది. మరొకవైపు హృదయంలో ఉన్న గురువుని పట్టుకుంటాను అన్నావు కదా! అని నాన్నగారు లోపల నుండి స్పురింప చేస్తున్నారు. ఒకవైపు దుఃఖం వస్తు ఉంది, మరొకవైపు వాక్యం స్పురిస్తూ ఉంది. నువ్వు హృదయంలో ఉన్న గురువుని పట్టుకోగలవా? అని నాన్నగారు నన్ను గట్టిగా అడిగినట్లు నా మనసుకి అనిపించింది. ఒక మూడు నిమిషాల తరువాత నాన్నగారు ట్రైన్ గుమ్మం దగ్గర కళ్లుమూసుకుని నిలబడ్డారు, నాకు కూడా కళ్ళు మూసుకో అని హృదయంలో నుండి స్పురింప చేసి, ఒక్క నిమిషం మనస్సును అంతర్ముఖం చేశారు. అప్పుడు పూర్తిగా దుఃఖం నశించి, మన తెలివితేటలు, సబ్జెక్ట్ జ్ఞాపకాలతో దుఃఖం ఆగదు గురువు దయతో మాత్రమే దుఖం ఆగుతుంది అని ఆ సంఘటన నాకు జీవితానికి సరిపడా గుణపాఠం నేర్పించి అప్పటి నుండి మనసు శరణాగతి చెందటం మొదలుపెట్టింది.

సత్సంగానికి వెళ్ళేసరికి, ఆ వారంలో నాకు వచ్చే పరీక్షలకి సమాధానాలు ముందుగానే వచ్చేసేవి. అందువలన నాకు పరీక్షాసమయం వచ్చేసరికి, గురువు దయవలన ఆ వాక్యం స్పురణకు వచ్చి, దానిని ఆచరణలో పెట్టించేసేవారు. అలా నిత్యజీవితంలో వాక్యాన్ని అనుసంధానం చేసుకొని జీవించటానికి బాగా ఉపయోగపడింది. గురువు దయవలన ఏ సమయానికి ఏ వాక్యం అవసరమో, అది స్పురణకు వచ్చేది. అంతేకాకుండా! ఆ వాక్యాన్ని ఆచరించే శక్తి కూడా గురువే ఇచ్చేవారు. ఆచరించిన తరువాత దానికి ఫలితంగా శాంతియుత పరిష్కారం లభించేది. అలా 'నెమ్మదిగా నాన్నగారు శక్తిని, ప్రేమని నా మనసు చాలా ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టింది'.

మా అమ్మాయి పెళ్ళికి అంతా నాన్నగారే చూశారు, నాన్నగారు ఎస్ అంటేనే సంబంధం ఖాయం చేశాము. ఆహ్వాన పత్రిక ఇవ్వటానికి నాన్నగారి దగ్గరకు వెళ్ళాను. ఆహ్వాన పత్రిక ఇచ్చి వచ్చేస్తుంటే, నేను, నాన్నగారు మాత్రమే అరుగు మీద ఉన్నాము. అప్పుడు నన్ను నాన్నగారు నువ్వు సబ్జెక్ట్ చెప్తావా? అని అడిగారు. నేను నోటితో సమాధానం చెప్పకుండా, తల అడ్డంగా చెప్పను అని ఊపాను. ఎందుకు చెప్పను అన్నాను అంటే, నాకు అక్కడ రెండు వాక్యాలు గుర్తుకు వచ్చాయి.

మొదటది : ప్రతి ఒక్కరికి హృదయంలో ఈశ్వరుడితో డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది. ఈమధ్య వర్తిత్వం ఎందుకు అంటారు భగవాన్. అది నేను సూరి నాగమ్మగారి లేఖలు లో చదివాను.
రెండవది : ఇతరులు ఎవరున్నారు బోధించడానికి అని కూడా అంటారు భగవాన్. ఈ రెండు వాక్యాలు నాకు అక్కడ గుర్తుకు వచ్చాయి. అందుకని నేను చెప్పను అని తల అడ్డంగా ఊపాను. నాన్నగారు కూడా ఏమీ మాట్లాడలేదు. మా అమ్మాయి వివాహం అయిపోయింది. నిజంగా చెప్పాలి అంటే, అమ్మాయి వివాహం రోజున నాకు నేను లేదు. మర్నాడు నాకు నేను వచ్చిన తరువాత తెలిసింది నిన్న నాకు నేను లేను అని. ఇదంతా గురువు దయ అని నాకు చాలా స్పష్టంగా తెలిసింది. ఈ సంఘటనతో నాన్నగారి మీద నాకు విపరీతమైన నమ్మకం వచ్చేసింది. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, దయామయుడు ఇవి అన్నీ నాకు అనుభవంలోకి వచ్చి ఆయన మీద ఉన్న విశ్వాసం నెమ్మదిగా బలపడుతోంది
అమ్మాయి వివాహం అయ్యి వెళ్ళిపోయిన తర్వాత తన ఫోటో చూస్తూ, ధారలుగా కన్నీరు కారుస్తూ ఉండేదాన్ని. మనసులో చాలా బెంగగా ఉండేది. నాకు తెలియకుండానే మా అమ్మాయి మీద ఇంత మమకారం ఉందా అని నాకే ఆశ్చర్యం వేస్తూ ఉండేది. ఈలోపు అదృష్టవశాత్తూ నాన్నగారు హైదరాబాద్ వచ్చారు. వెంటనే, నాన్నగారు దగ్గరకు వెళ్ళిపోయి, 'పాప పెళ్లి అయ్యి వెళ్లిపోయింది కదా! మమకారంతో చాలా దుఃఖం వచ్చేస్తోంది నాన్నగారు అని చెప్పి, నన్ను మామకారం నుంచి విడుదల చేయండి నాన్నగారు అని అడిగేసాను. వెంటనే, నాన్నగారు పెద్ద నవ్వు నవ్వి రెండు చేతులు పైకిపెట్టి ఆశీర్వదించి, అలాగే అన్నట్టుగా సంకేతం ఇచ్చారు". నా బలహీనత లో నుండి నన్ను విడుదల చేయమని అడిగితే నాన్నగారు ఇంతగా ఆనంద పడతారా అనిపించి, నాన్నగారిని ఇలా అడగవచ్చు అని నాకు ఒక దారి దొరికినట్టు అయ్యింది. ఇంటికి వచ్చేసిన తరువాత దుఃఖం ఎక్కువ అయిపోయింది. అమ్మాయి ఫోటో చూడటం ఏడవటం ఇదే జరుగుతోంది. నన్ను ఇలా ఏడిపిస్తూ ఆ బలహీనతలో నుండి విడుదల చేస్తున్నారు అనే స్ఫురణని కూడా నాన్నగారు కలిగించారు. ఒక వారం రోజులకి నాన్నగారు జిన్నూరు వెళ్ళిపోయారు. ఆ తరువాత నుండి నాకు కన్నీళ్ళు రాలేదు. ఫోటో చూడాలి అనిపించలేదు. అప్పుడు నాకు అర్థం అయ్యి, నాన్నగారు మమకారపు దుఃఖం నుండి నన్ను విడుదల చేసారు అని అనుభవంలో తెలిసింది. అప్పటి నుండి నాలో ఉన్న బలహీనతలని చూసుకొని నాన్నగారిని విడుదల చేయమని అడగేదాన్ని అలా 'ప్రార్థనే మన సాధన' అని అర్థమయింది. అక్కడ నుండి వాలు గాలిలో సైకిల్ తొక్కినట్టు అయింది. రాగం లోంచి, ద్వేషం లోంచి, భయం లోంచి, మమకారం లోంచి ఇంకా అన్నిటిలో నుంచి ఏది ఉంటే అది చూసుకొని, నాన్నగారిని ప్రార్థించే దాన్ని. నాన్నగారు ఒకసారి నేను పళ్ళు ఇవ్వడానికి వెళ్తే నన్నుఅక్కడే నిలబెట్టి పక్కవారితో రామకృష్ణుడు వివేకానందుడుని బోధించమని చెబితే,నేను భోదించను అని చెప్పాడు అప్పుడు నువ్వు బోధించకపోతే నీ ఎముకలు బోధిస్తాయి అని అన్నాడు అని నాన్నగారు చెబుతున్నారు. ఆ మాట వినగానే, ఏంటి! నన్నే అంటున్నారా అనిపించింది నాకు. వెంటనే నా బుద్ధి నీకు పొగరెక్కిందా! ఆయన వివేకానందుడి గురించి చెప్తున్నారు వాళ్లతో నిన్ను నువ్వు పోల్చు కొంటావా! ఆని నా బుద్ధి నన్ను తిట్టింది. ఊరుకున్నాను. నాన్నగారు అదే మాటను మరలా 3 సార్లు చెప్పారు. అలా చెప్పేసరికి నన్నే అంటున్నారు అని అనుకుంటున్నాను. అవును, నిన్నే అని నాకు సంకేతము ఇచ్చినట్టుగా నాన్నగారు నా చేతిలో ఉన్న పండ్లని తీసుకున్నారు. అప్పుడు ఆ మాట నన్నే అంటున్నారు అని అర్థమైయ్యి, అప్పుడు నాకు విపరీతమైన స్ట్రగుల్ వచ్చేసింది. నా భర్త మరణింతో నేను ఇంటాబయటా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాను. నన్ను సబ్జెక్టు చెప్పమంటారు ఏమిటి? అనుకొని, నా మనసులో చాలా తిట్టుకున్నాను. పూర్వం ఒకసారి మెడిటేషన్ చేస్తే నా మనసు అరెస్టయింది అది దృష్టిలో పెట్టుకుని మెడిటేషన్ లోనే మనస్సు అరెస్ట్ అవుతుంది అనే అపోహ నాకు అప్పట్లో ఉండేది. పని చేసుకుని ఒక గంట కళ్ళు మూసుకుని కూర్చొవటానికే నాకు సమయం సరిపోవడం లేదు, నన్ను రాయమంటారు ఏమిటి, నన్ను చెప్పమంటారు ఏమిటి అని నా మనసు చాలా ఎదురు తిరిగింది. ఎంత పోరాటం అంటే 30 గంటలు చాలా స్ట్రగుల్ అయ్యాను. నా బుద్ధి ఎమో ఒకవైపు, మనసుని శరణాగతి చేశాను అంటున్నావు గురువు మాట వినవా? అని నన్ను అంటోంది. గురువు దయ ఉంటే! మన మనసులో ఉన్న వాసనలు ఏ పాటివి, చివరకి ఒక చిన్న పుస్తకంలో నాలుగు మాటలు రాసుకొని వెళ్ళాను. నాన్నగారు వచ్చి నా ముందు మౌనంగా రెండు నిమిషాలు నిలబడ్డారు అలా నాకు శక్తిని ఇచ్చానట్టు అనిపించింది. ఆ తరువాత నుండి మరలా ఎప్పుడూ రాయటం మానలేదు. మరునాడు తెల్లవారుజామున నాలుగు గంటలకు ధ్యానంలో కూర్చుంటే నా ప్రయత్నం లేకుండానే నా మనసు అరెస్టయింది. 'నువ్వు రాయడం మూలంగానే ఈ స్థితి వచ్చింది అని నాకు స్పురింప చేశారు నాన్నగారు'. "అప్పుడు తండ్రి! నన్ను భాగు చెయ్యటం కోసం నాతో ఎన్ని తిట్లు తిన్నావు అనుకొని, బాగా దుఃఖం వచ్చేసింది. అప్పటినుండి పూర్ణ శరణాగతి చేశాను".

మా బాబుకి దుబాయిలో జాబ్ వచ్చింది వెళ్ళిపోయాడు. అప్పుడు నాన్నగారు, అమ్మా! ఇప్పుడు నీకు ఏకాంతంగా ఉండటానికి అవకాశం వచ్చింది. కాలాన్ని సద్వినియోగం చేసుకో, సత్సంగాలకు వెళ్ళు, కాఫీ దొరకలేదని ఏండ్రిన్ తాగము కదా! ప్రసంగాలు దొరకకపోతే లౌకికంలోకి వెళ్ళకు, భగవంతుడు కాల రూపంలో ఉన్నాడు అని నాన్నగారు వేలు పెట్టి నన్ను చూపించి చెప్పారు.నాన్నగారు అలా చెప్పగానే లోపల నుండి నా ప్రయత్నం లేకుండానే కాలాన్ని సద్వినియోగం చేసుకునేలా అనుగ్రహించు తండ్రి, నా ప్రయత్నంతోనే అవ్వదు,నీ అనుగ్రహంతోనే అవ్వాలి అని ప్రార్థన వచ్చింది.

సత్సంగం చెప్పడానికి వెళ్ళాలి, సత్సంగం వినటానికి వెళ్ళాలి, సత్సంగం రాయడానికి వెళ్ళాలి, హృదయంలో సత్సంగం చేయాలి, నాన్నగారి దగ్గరికి వెళ్ళాలి ఇలా ఐదు రకాల సత్సంగాలు. నాన్నగారు చెప్పిన సబ్జెక్టు రాస్తే, ఎవరో ఒకరు భక్తులు వచ్చి మీరు సబ్జెక్టు రాశారు అంట కదా! ఒకసారి చదవండి అని అడిగేవారు, అలా రోజూ ఎవరో ఒకరు అడిగేవారు. వారందరికీ చదివి వినిపించడంలో సబ్జెక్ట్ నాకు మననం అయిపోయేది. అలా మెల్లగా నాకు తెలియకుండానే నాన్నగారు నాకు టీచింగ్ లో ట్రైనింగ్ ఇచ్చారు. తరువాత ఉదయాన్నే నాన్నగారు ఈ రోజు నన్ను ఏమి సాధన చేసుకోమంటారు,అని మనసులో నాన్నగారిని అడిగి, ఉపన్యాసం పెట్టుకునేదాన్ని. నువ్వు గతంలోకి వెళ్ళి, మనసుకు పుండు చేసుకోకు అని ఒక రోజు, నిన్ను నువ్వు పొగుడుకోకు అని ఒకరోజు, ఎదుటి వాళ్లతో పోల్చుకోకు, ఎదుటివారిని విమర్శించకు, అందరిలో ఉన్న ఈశ్వరుడిని చూడు, అని అలా రోజుకు ఒక వాక్యం నాకు నచ్చేది. ఆ వాక్యాలు అన్నీ రోజు ప్రాక్టీస్ చేసేదాన్ని. ఈ రోజు గతంలోకి వెళ్ళవద్దు అన్నారు కదా! నాన్నగారు అనుకొని ఈరోజు గతం గుర్తు వస్తోంది ఏంటి, అని విచారణ చేసుకుని, అక్షరమణమాల, ఉపదేశసారము, నాన్నగారు నామము చేసుకుంటూ మనసుని నిరోధించేదాన్ని. మరాలా కాసేపటకి బయటకి వెళ్ళిపోయేది, మళ్లీ నాన్నగారు గుర్తుకు వచ్చేవారు, మళ్లీ సాధన చేసేదాన్ని అలా రోజుల్లో పది సార్లు ఆ వాక్యం గుర్తుకు వచ్చేది, మరుసటి రోజు ఇంకొక వాక్యం, ఆ రోజంతా ఆ వాక్యం మీదే సాధన.

"నాన్నగారిని అవినయం రాకుండా ఆశీర్వదించండి, - నాన్నగారు మీరు మరుపు రాకుండా ఆశీర్వదించండి, - పొగిడితే నాకు వికారం రాకుండా ఆశీర్వదించండి అలా నాలో ఉన్న బలహీనతలు అన్నిటినీ చూసుకొని ప్రార్థించేదాన్ని. నేను మొదటసారి జిన్నూరు వెళ్ళినప్పుడు నాన్నగారు నా వైపు చూడాలి, నాన్నగారు నన్ను పలకరించాలి అని మనసులో కోరుకునేదాన్ని. ఇంతలో నాన్నగారు ఇంట్లో వారిని పలకరించడం అవసరమా! అని ఎవరితోనో అంటున్నారు. అప్పటి వరకు పలకరిస్తే బాగుండును అనుకున్న మనసు, నాన్నగారు నన్ను పలకరించకుండా ఉంటే బాగుండును అనుకుంది. అలా నన్ను ఎక్కువగా పలకరించేవారు కాదు. నాన్నగారి దయ నాకు మౌనంగానే తెలిసేది. నాన్నగారితో మాట్లాడవలసిన పని లేదు, హృదయంలో ఉన్న గురువుతోనే నాన్నగారు అని చెప్పేసుకుంటే సరిపోయేది.

ఒకసారి ఒక భక్తురాలు భర్త చనిపోయారు అని వచ్చారు. నాకు ఆమెను చూసి అయ్యో! నా భర్త చనిపోయే సమయానికి నేను నాన్నగారు దగ్గరకి లేకపోతే, ఆ జీవుడుని కూడా ఆశీర్వదించేవారు కదా!, ఆ జీవుడు కూడా పవిత్రులు అయ్యేవారు కదా! మంచి జరిగేది కదా! అనుకున్నాను. వెంటనే, నాన్నగారు అమ్మా! డాక్టర్ గారు ఎప్పుడు చనిపోయారు అని అడిగారు.అంటే మన మనసులో ఉన్నది ఆయనకు తెలిసిపోతుంది కదా, మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మన జీవితంలో నాన్నగారే ఉంటారు మనం ఉండము. ఎప్పుడైతే, పిల్లల్ని కొండకు అప్పచెప్పానో అప్పటి నుండి నాన్నగారే పిల్లల్ని చూసుకున్నారు. 'రూపు దాల్చిన గిరి మన నాన్నగారు'. లేకపోతే కొండకు పిల్లల్ని అప్పగిస్తే, ఈయన చూసుకున్నారు కదా. నాన్నగారిలో జ్ఞానులు అందరినీ దర్శింప చేశారు. అలా క్రమంగా నాలో మార్పు తీసుకు వచ్చి, ఈ సత్సంగాలు అన్నీ ఆయనే చెప్పిస్తున్నారు, అది కేవలం ఆయన అనుగ్రహం మాత్రమే. నాన్నగారు వివిధ ప్రవచనాలలో మహాత్ముల అందరి గురించి బోధించి ఉన్నారు. అవి అన్నీ ఒక చోట నన్ను తెలుగులో రాయమని విజయ్ నాకు చెప్పారు. అవి తను ఇంగ్లీషులోకి అనువదించుకుని నాన్నగారు అంగీకారంతో వెబ్ సైట్ లో పెట్టారు. ఆ పాయింట్ ల కోసం ప్రవచనాలు వింటూ, నిరంతరం రాసుకోవడం వలన సబ్జెక్ట్ చెప్పటానికి నాకు చాలా సహాయ పడింది. అలా నాన్నగారి దయతో విజయ్ చేసిన జ్ఞానయజ్ఞంలో నన్ను కూడా సమెధను చేశారు. ఒకసారి నాన్నగారు సార్ నాథ్ లో బుద్ధుడు గురించి చెబుతూ, బుద్ధుడు అయిపోయారు. నాన్నగారు మార్గం మనకి చాలా సులభంగా ఉంటుంది. కానీ మనం చేసే ప్రయత్నం చాలా సిన్సియర్ గా చేయాలి. ఎక్కడ మనం ఫెయిల్ అవుతున్నామో చూసుకొని అక్కడ మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. గురువు ఆ ప్రయత్నమే చూస్తాడు.

'గురువుకి నీ జీవితం అంకితం చెయ్యి, గురువు యందు విశ్వాసం చెదరకుండా చూసుకో'. ఈ వాక్యాలు నాకు చాలా ఇష్టమైనవి. అంటే గురువు చెయమన్న పనిచేసి, వద్దు అన్న పని చెయ్యకూడదు. అలా జీవిస్తూ, తండ్రి! నన్ను, నువ్వు చెప్పినట్టు జీవించే విధంగా అనుగ్రహించు. అని ప్రార్థిస్తూ ఉండాలి. నెమ్మదిగా ప్రయాణం చేసినా, గమ్యం మాత్రం మరిచిపోకూడదు. నిరంతరం గురుస్మరణలో ఉండాలి. గురువు మీద విశ్వాసం చెదరకుండా చూసుకుంటూ, గురుస్మరణలో ఉంటే, నీ కర్తవ్య కర్మలు నీవు చెయ్యకూడదు అనుకున్నా, చెయ్యకుండా ఉండలేవు. అలా చేస్తూ ఉంటే ఆయన దయ మనపై ఉండి తప్పనిసరిగా హృదయ సుఖాన్ని పొందుతాము.

సూర్యుడు భూమిపై ఒక భాగాన్ని విడిచి వెళ్ళిపోతూ, నేను వెళ్ళిపోతున్నాను ఈ భాగానికి ఎవరైనా వెలుగుని ప్రసరించగలరా? అని సూర్యుడు అడిగితే, ఒక కిరసనాయిలు దీపం ముందుకు వచ్చి, ఓ సర్యుడా! నువ్వు ఏ విధంగా అయితే వెలుగును ప్రసరింపచేస్తున్నావో, నేను కూడా అదే విధంగా ప్రసరింపచేస్తాను. నువ్వు కోట్ల మందికి వెలుగు ఇస్తే, నేను నలుగురికే ఇస్తాను. నువ్వు వెళ్లి రా, నువ్వు చేసే పని నేను చేస్తాను అందట కిరసనాయిలు దీపం. రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పిన ఈ వాక్యం చాలా బావుంటుంది.

నాన్నగారి ప్రేమ, సూర్యుడి వెలుగులా విశ్వప్రేమ. మనం నాన్నగారిలా కాకపోయినా, కిరసనాయిల దీపంలా ఒక నలుగురిని ప్రేమిద్దాము. అలా ఒక చిన్న ప్రయత్నం చేసి, ఆ ప్రేమించే శక్తిని ఇమ్మని గురువుని ప్రార్థిందాము. అలా చేస్తూ ఉంటే, తప్పనిసరిగా గురువు తన hold లోకి తీసుకుంటాడు. మన అందరము గురువు గర్భంలోనే జీవిస్తున్నాము అనటంలో ఎటువంటి సందేహము లేదు. నాన్నగారు చేయవలసిన పని ఏమీ లేకపోయినా, మనకోసం బోధిస్తూ, పనిచేసి చూపించారు. కాబట్టి ఆయన జీవితమే బోధ అయ్యింది. ఆ భోదే మనకి ఆదర్శం. నాన్నగారు సామాన్య గురువు కాదు, నాన్నగారు మన అందరికీ జ్ఞానం వస్తుంది అని 'అభయమిస్తూ' అనేక రకాలుగా ఆశీర్వదించారు కాబట్టి మనందరం తప్పనిసరిగా తరించి తీరుతాము.

నాన్నగారికి ఒక ఆస్ట్రేలియా భక్తుడు 'ఒక ఉత్తరంలో మీరు నన్ను ఏ విధంగా ప్రేమించారో ఆ ప్రేమను జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటే, ఆ ప్రేమలో నా అహంకారం కరిగిపోతోంది అని ఉత్తరంలో రాశాడట'. అలాగా నాన్నగారి ప్రేమను జ్ఞాపకం తెచ్చుకుని ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉందాము. గురువు జీవించి ఆదర్శంగా చూపించిన రీతిలో యధాతధంగా మనం జీవించటానికి చిన్న ప్రయత్నం చేసి శరణాగతి చేయాలి. నన్ను అలా జీవింపచేయి తండ్రి! అని ప్రార్థించాలి. అప్పుడు మన గురువుకి కృతజ్ఞత చెప్పుకున్నవాళ్ళం అవుతాము. గురువు ఏ చైతన్య స్థాయిలో ఉన్నాడో, ఆ చైతన్య స్థాయికి మనల్ని తీసుకువెళ్ళటానికి సిద్ధంగానే ఉన్నాడు. మనసు నశించే వరకూ ప్రయత్నం విడిచిపెట్టకూడదు. మనసు నశించిన తరువాత ఆ దేహం ద్వారా జరగవలసిన పనులు జరుగుతూ ఉంటాయి.

"తుది పలుకులు" :
అమ్మ! అనారోగ్యం, క్యాన్సర్ అంటున్నారు. శరీరమంతా వ్యాపించేసింది. నాన్నగారు చూసుకుంటారు. "నాన్నగారి అనుగ్రహంతో మనసు చాలా బాగుంది; నాన్నగారిలో ఐక్యం అవ్వటానికి ప్రయత్నం చేస్తోంది. ఈరోజు ఉదయం క్యాసెట్ పెట్టుకుంటే మోక్షం మీ అందరికీ ఇచ్చేస్తాను సందేహపడకండి అని చెప్పారు. ఎవరూ కంగారు పడవద్దు. దేహం నేను కాదు, మనసు నేను కాదు, మన అందరం ఆత్మ స్వరూపులము. అదిగా నిలిచి ఉందాము". నా మనసు చాలా హాయిగా ఉంది. బెంగగా ఉన్నవారు ఎవరైనా ఉంటే! ఈ రాజేశ్వరిని తీసుకుని వెళ్ళి నాన్నగారి సన్నిధిలో అప్పగించండి. కంగారు పడకండి, ఉంటాను. "సబ్జెక్టుకు ఎవరు దూరం అవ్వకండి. సబ్జెక్టే గురువు" "గిరి రూపమో, గురు రూపమో శ్రీ నాన్న పాదమే మాకు శరణ్యము. ఓం శ్రీ గురుభ్యోనమః.

No comments:

Post a Comment