Sunday, February 13, 2022

"సాక్షాత్తు భగవంతుని స్వరూపులు, శ్రీ నాన్నగారు" - (By లేట్ అప్పలనరసమ్మ గారు)

అప్పలనరసమ్మగారికి, నాన్నగారికి మధ్య ఉన్న అనుబంధం గురించి ఆమె మేనకోడలు అయిన వేణమ్మగారు తెలియచేసిన విషయాలు :

మా మేనత్త గారైన అప్పలనరసమ్మ గారి భర్త తన రెండవ సంతానం కడుపులో ఉన్నప్పుడే చనిపోయారు. ఆ కారణంగా తన పుట్టినిల్లయిన జిన్నూరులో మా ఇంటికి తీసుకువచ్చారు. మేమందరం కలిసి ఉండేవాళ్ళం. అలా తన జీవితమంతా జిన్నూరులోనే కొనసాగింది. తన ఇద్దరు పిల్లలు ఇంకా నేను, నా తమ్ముడు మొత్తం నలుగురము కూడా తన ఆధ్వర్యంలోనే పెరిగాము. అందరినీ చాలా సమానంగా చూసేవారు. ఇంకా మా బంధువుల పిల్లలు అందరూ కూడా జిన్నూరు స్కూల్లో చదువుకోవడం వల్ల మా ఇంటికి వస్తూ ఉండేవారు. అలా మొత్తం ఒక పది మంది పిల్లలం ఉండేవాళ్ళం. ఆవిడ ఉదయం నుండి సాయంత్రం వరకు అలసిపోకుండా చిరునవ్వుతో మా అందరికీ అవసరమైనవి చేసి పెడుతూ ఉండేవారు. బేదభావన అనేది లేకుండా అందరినీ సమానంగా చూసేవారు. మాది చాలా పెద్ద కుటుంబం అవటం వలన తరచు బంధువులు వస్తూ ఉండేవారు. వారందరికి ఆవిడే వంట చేసి పెట్టేవారు.

ఆమె కుమార్తె అయిన సత్యవతి కూడా నాన్నగారికి చాలా ఉత్తమమైన భక్తురాలు. తన కొడుకు జిన్నూరులోనే ఉంటారు. ఆయన కూడా సమాజ సేవ బాగా చేస్తారు. అందువలన నాన్నగారు ఆయనని చాలా ఇష్టపడేవారు. నాన్నగారిపట్ల ఆయనకి కూడా చాలా గౌరవం, ప్రేమ ఉన్నాయి. మా మేనత్త ఎవరి మధ్యవర్తిత్వం లేకుండానే నాన్నగారిని కలుసుకున్నారు. నాన్నగారిని సంపూర్ణంగా విశ్వసించారు. మా మేనత్త ఎప్పుడూ ఎవరి మాట కాదనేవారు కాదు. కానీ ఒక్క నాన్నగారి విషయంలో మాత్రం, ఆయన దగ్గరికి వెళ్ళవద్దు అని ఎవరైనా చెప్పినా ఆమె వినేవారు కాదు. అది నా వ్యక్తిగత విషయం అన్నట్టు ఉండేవారు. నాన్నగారి ఇంటి నుండి మా ఇంటికి ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది. మా ఇంటి దగ్గర నుండి నాన్నగారి ఇంటికి నడిచి వెళుతూ మధ్యలో ఉండే వారందరి ఇంటి తలుపులు కొట్టి, "మీకు తెలియటం లేదు సాక్షాత్ భగవంతుడే నాన్నగారి రూపంలో వచ్చారు", అంటూ అందరికీ చెబుతూ వెళ్ళేవారు.

ఎవరైనా కష్టంలో ఉన్నారు అని తెలిస్తే వాళ్లని ఆ కష్టాల్లో నుండి బయటకు తీసుకు రావటానికి తన వంతు ప్రయత్నం తను చేసేవారు. నాన్నగారు ఎన్నోసార్లు అప్పలనరసమ్మ గారు ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు తన చీరచెంగుతో వారి కన్నీళ్లను తుడుస్తారు అని చెప్పేవారు. ఆవిడ నాన్నగారి దగ్గరికి అందరిని రమ్మని చెప్పినా కానీ వారు రాకపోతే, "నాన్నగారు భగవత్ స్వరూపులని వీళ్ళు గుర్తించటం లేదు, వీళ్ళు ఎందుకు పుట్టారో వీరికి అర్థం కావట్లేదు అని బాధపడుతూ ఉండేవారు. ఆ మాట వినేసరికి నాకు ఇప్పటికీ వెన్నులో వణుకు వస్తుంది. అత్తయ్యకి భౌతికంగా ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ, తన దృష్టి ఎప్పుడూ నాన్న గారి మీద చెక్కుచెదరకుండా ఉంచుతూ భగవంతుడే నాన్నగారుగా వచ్చారు అన్న విశ్వాసంతో జీవించారు. అందుకే అంత శాంతిగా ఉండగలిగేవారు. ఇది అంతా జరిగి దాదాపు ౩౦ సంIIలు అయ్యి ఉంటుంది. అప్పట్లో స్త్రీలు బయటకు ఎక్కువగా వచ్చేవారు కాదు. అందువలన ఆమె కొడుకుకి ఆవిడ నాన్నగారి ఇంటికి వెళ్ళటం ఇష్టం ఉండేది కాదు.

హాల్లో తన కొడుకు తిడుతున్నా సరే, లోపల అష్టోత్తరం చదువుకుంటూ ఒక్కొక్క పువ్వు నాన్నగారి ఫోటో మీద వేసి పూజ చేస్తూ ఉండేవారు. నాన్నగారి విషయంలో మాత్రం పూర్తి స్వేచ్ఛ తనకు తనే తీసుకున్నారు. నాన్నగారి దగ్గరకు వెళ్తున్నందుకు ఆ రోజుల్లో ఎంతోమంది ఎన్నో మాటలు అనేవారు. అయినా అవేమీ పట్టించుకోకుండా నవ్వి ఊరుకునేవారు. నాన్నగారి గురించి వారికి తెలియటం లేదు అనేవారు.

నాన్నగారి 60 వ పుట్టినరోజుకి నాకు మా మేనత్త ఫోన్ చేసి ఈరోజు నాన్నగారి పుట్టినరోజు జరిగింది. సుదర్శనమ్మ గారు సావిత్రమ్మ గారి చేత దండలు పంపించి నాన్నగారిని, కన్నమ్మ గారిని వేసుకోమన్నారు. వారు ఇద్దరు ఆ దండలని వేసుకొన్నారు అని చాలా ఆనందపడుతూ, ఆ ఆనందంతో చెప్పలేక చెబుతూ, ఆ విషయం గురించి పదినిమిషాలు మాట్లాడారు. తన దృష్టిలో నాన్నగారంటే ఒక మానవ రూపం కాదు, సాక్షాత్ భగవంతుడే! ప్రతిరోజు ఆవిడ నాన్నగారి ఇంటికి వెళుతూ ఉండేవారు. అప్పట్లో కొన్ని కారాణాల వలన ఒక్కొక్కసారి నాన్నగారి ఇంట్లోకి వెళ్ళటం కుదేరేది కాదు. అలా కుదరకపోతే నాన్నగారి ఇంటి చుట్టూ, అంటే నాన్నగారు ముందు వీధిలో నుండి వెనక వీధికి తిరుగుతూ అలా మూడు సార్లు ఆ ఇంటికి ప్రదక్షణ చేసి నమస్కారం చేసుకొని వచ్చేవారు. ఒక్కొక్కసారి మాకు దర్శనం ఇవ్వటానికి నాన్నగారు టవల్ ఆరేసుకునే వంకతో బయటికి వచ్చి మాకు దర్శనం ఇచ్చారు అని ఆనందపడుతూ చెప్పేవారు. ఆ ఆనందానికి అవధులు ఉండేవి కావు.

ఒకసారి అత్తయ్య నాన్నగారి ఇంటి గుమ్మం దగ్గర నిలబడి దుఃఖ పడుతూ ఉన్నారట. నాన్నగారు గుమ్మానికి ఉన్న కర్టెన్ తీసుకుని బయటకు వచ్చి అప్పలనరసమ్మ గారూ మీరు దేవుడ్ని చూసారా..? అని అడిగారట. దుఃఖ పడటం వలన నోటి నుంచి మాటరాక చూడలేదు అని తల ఊపారట! అప్పుడు నాన్నగారు నేను భగవంతుడిని చూశాను.

నేను చూసిన భగవంతుడిని మీకు చూపిస్తాను అన్నారట. ఈ సంఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్న స్నేహితురాలు తరువాత నాకు చెప్పారు.

ఒకసారి నాన్నగారికి ఆపరేషన్ అయినప్పుడు నాన్నగారిని చూడటానికి అత్తయ్య హైదరాబాద్ వచ్చారు. వారమ్మాయి, నేను హైదరాబాదులో ఉంటాము. నాన్న గారి దగ్గరికి తీసుకు వెళ్ళమని నన్ను చాలా బలవంతం చేసారు. నాకు నాన్నగారిని ఇబ్బంది పెట్టడం పెద్దగా ఇష్టం ఉండదు. ఎంత చెప్పినా వినకపోయేసరికి సరే అని ఆ హాస్పిటల్ దగ్గరికి తీసుకువెళ్లి, తరువాత వచ్చి తీసుకెళ్తాను అని చెప్పి వచ్చేసాను. అక్కడ కూర్చుని దుఃఖ పడుతూ ఉన్నారట. నాన్న గారు బయటకు వచ్చి ఏంటి అప్పల నరసమ్మ గారూ మీరు ఇక్కడ ఉన్నారు ఏమిటి? అని అడిగారట. మిమ్మల్ని చూసి వెళదామని వచ్చాను నాన్నగారూ అని చెప్పారట. నేను బానే ఉన్నాను అని నాన్నగారు సర్దిచెప్పి పంపించారట. తరువాత ఈ విషయం నాన్నగారే స్వయంగా చెప్పారు. ఒకసారి మా చిన్న మేనత్త భర్త చనిపోయారు. వాళ్ళు అమలాపురంలో ఉంటారు. ఆయన అప్పలనరసమ్మ గారికి మరిది అవ్వటం వలన ఆవిడ చెల్లెలు ఇంటికి వెళ్లారు. అప్పుడు రావులపాలెంలో నాన్నగారి ప్రవచనం జరిగింది. మా మేనత్త ఆ ప్రవచనానికి వెళ్ళారు. నాన్నగారు అక్కడ మా మేనత్త ని చూసి, మరిది గారు చనిపోతే అప్పలనరసమ్మ గారు ఇక్కడ ఉన్నారు ఏమిటి, అని చాలాసార్లు అన్నారట. ఈ విషయం నాన్న గారే చెప్పారు. తర్వాత అప్పలనరసమ్మ గారు తన చెల్లిని పుట్టినిల్లు అయిన జిన్నూరు తీసుకువచ్చారు. ఆ సమయంలోనే తనకి కొంచెం ఆరోగ్యం భాగాలేకపోవటం వలన పాలకొల్లు హాస్పత్రిలో జాయిన్ చేశారు. అక్కడ నుండి హైదరాబాదు తీసుకువచ్చారు. హైదరాబాద్ వచ్చిన తరువాత నాన్నగారికి నన్ను హైదరాబాదు తీసుకొచ్చినట్టు తెలుసో లేదో అన్నారు.

అదే ఆవిడ మాట్లాడిన ఆఖరి మాట! ఆ రోజే అత్తయ్య దేహం వదిలేసారు. ఆ సమయానికి నాన్నగారు కోయంబత్తూర్ లో ఉన్నారట. నాన్నగారు భోజనం చేద్దామని చెయ్యి కడుక్కుని చాలా సేపు నిలబడి అప్పలనరసమ్మ గారు ఏంటి నాకు చెప్పకుండా వెళ్ళిపోయారు అన్నారట. తర్వాత రోజు నాన్నగారికి ఫోన్ చేశాను. ఏంటమ్మా అత్తయ్య మనతో చెప్పకుండా వెళ్ళిపోయారు అన్నారు. తను ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా నాన్నగారిని మనసులో నింపుకుని చేసేవారేమో అనిపించేది నాకు.

భర్తలేకపోయినా, తన ఇద్దరు పిల్లలను పెంచి పెద్ద చేసినా, పైకి కష్టపడినట్టు కనిపించేవారు కాదు. అంటే ఆవిడ జీవితానికి నాన్నగారే సర్వస్వం అయ్యారు. నాన్న గారిని నాన్నగారు అని కూడా అనేవారు కాదు, సాక్షాత్తు భగవంతుడు అనేవారు. తను చనిపోయినప్పుడు నాన్నగారు కోయంబత్తూరులో భక్తులతో అన్న మాటలు : “అప్పల నరసమ్మ గారు ఇలా వెళ్లిపోయారు ఏమిటి? అప్పలనరసమ్మ గారికి ఇప్పుడు శరీరంతో సంబంధం తెగిపోయింది, బంధువులతో సంబంధం తెగిపోయింది, అందరితోనూ సంబంధం తెగిపోయింది, ఇపుడు గురువు పని మొదలవుతుంది. చీకటి లోకాలకు వెళ్ళకుండా గురువు వెలుగులోకి తీసుకు వెళ్తారు. అప్పల నరసమ్మ గారికి ఇంక ఒకటి రెండు జన్మలు మాత్రమే మిగిలి ఉన్నాయి" అన్నారు.

జిన్నూరులో ఒకసారి ప్రవచనం జరిగినప్పుడు అప్పలనరసమ్మ గారి కోసం ఈ లడ్డూలను పంచుతున్నాను అన్నారు. దానికి అప్పలనరసమ్మ గారి కుమారుడు లడ్డూలకు నేను డబ్బులు ఇస్తాను నాన్న గారూ అంటే, అది నీకు సంబంధం లేదు. నా కోసం నేను పంచిపెడుతున్నాను అన్నారు. నాన్నగారు అప్పలనరసమ్మ గారి ఫోటో ఒకటి తెప్పించి, ఆశ్రమంలో ఆయన గదిలో పెట్టుకున్నారు.

తరువాత నాలుగైదు ప్రవచనాలలో ఒక పది నిమిషాలు అప్పలనరసమ్మ గారి గురించి మాట్లాడారు. ఒకసారి నాన్నగారు నాతో మీ నాన్నగారు పొలిటీషియన్ అవ్వడం వలన మీ అమ్మగారు బిజీగా ఉండేవారు.

మొత్తం కష్టమంతా అప్పల నరసమ్మ గారిదే అమ్మా! తను ఎంత కష్టపడ్డారో నీకు ఏమి తెలుసు? నేను చూశాను... నేను చూశాను... అన్నారు. జిన్నూరులో చాలామంది అప్పల నరసమ్మగారు మా జీవితాలకి నాన్నగారిని ప్రసాదించారు అని చాలా కృతజ్ఞతగా ఉంటారు.

No comments:

Post a Comment