Wednesday, October 26, 2022

"నామం హృదయంలో చేసుకోండి" - (సూర్యకాంతమ్మ గారు)

నాన్నగారి వద్దకు వచ్చే, నిగూడ భక్తులలో సూర్యకాంతమ్మ గారు ఒకరు. వీరి పుట్టినిల్లు గుమ్మలురు గ్రామం. పుట్టింటి వారి ద్వారా నాన్నగారు ఆమె జీవితంలోకి ప్రవేశించారు. ఆమె చిన్నప్పటి నుండి కృష్ణ భక్తురాలు. ఆమెకు తరచూ కృష్ణడు స్వప్న దర్శనం అయ్యేది. ఒకసారి, కృష్ణుడు స్వప్నంలోకి వచ్చి, నా నిజరూప దర్శనం చూపించమంటావా అని అడిగి, ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నానని చెప్పి, అలాగే పరమాణువు కంటే చిన్నగా కూడా ఉన్నానని వివరించాడట. ఆ చెప్పే క్రమంలో, సురేకాంతమ్మ గారికి కూడా తనని తాను కోల్పోతున్న భావన కలిగి కృష్ణా! నాకు భయం వేస్తొంది అని అరిచారట. ఇప్పుడు నీకు వివరించినా అర్థం కాదు; నీకు 40వ సంవత్సరం వచ్చిన తరువాత, మరలా నీ వద్దకు వచ్చి చెబుతాను, అప్పుడు నీకు అర్థమవుతుందని చెప్పాడట. సరిగ్గా ఈమెకు 40 సంవత్సరాలు వచ్చిన తరువాత, నాన్నగారి ప్రవచనం కాపవరంలో విన్నారట. నాన్నగారు, కాంతమ్మ గారిని ఆయన ప్రక్కనే కూర్చోబెట్టుకుని కృష్ణుడు గురించి చెబుతూ, మధ్య మధ్యలో మీకు కృష్ణుడు కనిపించాడు కదా! అని అన్నారట. అప్పుడు కాంతమ్మ గారి మదిలో, ఆనాడు స్వప్నంలో కనిపించిన కృష్ణుడే, ఈనాడు నాన్నగారి రూపంలో వచ్చి బోధిస్తున్నారు అనే స్పురణ కలిగిందట. ఒకసారి కాంతమ్మ గారు, నామం పైకి ఉచ్చరిస్తూ నాన్నగారి ఇంటి ప్రాంగణంలోకి వెళ్ళారట. అప్పుడు నాన్నగారు, కాంతమ్మ గారు నామం మనసులో జపించండి, శబ్దాన్ని పైకి రానివ్వద్దు, ఆ శబ్దం ఎక్కడినుండి వస్తోందో గమనిస్తూ ఉండండి అని చెప్పారట. ఆనాటి నుండి, ఆమె జీవితంలో ఎన్నో ఆధ్యాత్మిక అనుభవాలు కలిగాయి. తుది శ్వాస విడిచే వరకు భగవాన్ చెప్పిన విచారణ మార్గంలోనే ఉంటూ.. శ్రావణ శుక్రవారం రోజున, దేహం వదిలారు.

 

No comments:

Post a Comment