Sunday, September 6, 2020

"నాన్నగారే నా సర్వస్వం" - (By క్రాంతి గారు)

మొదటిసారి నేను నాన్నగారిని 10వ తరగతిలో కలిసాను. ఆయన ఎప్పుడు ట్రైన్ కి వైజాగ్ వెళ్ళినా కూడా, అందరితో పాటు రైల్వే స్టేషన్ కి వెళ్ళి పండ్లు సమర్పించుకుని వచ్చేదాన్ని. మా అమ్మగారికి నాన్నగారంటే చాలా భక్తి. ప్రతిరోజూ సత్సంగానికి వెళ్ళేవారు. ఆరోజులలో నాకు ఆయనతో ఉన్న అనుబంధం అంతవరకే పరిమితం.

కొన్ని సం॥ల తరువాత హైదరాబాదులో ఇంజనీరింగ్ చదువుతున్న రోజులలో ఒకసారి హైదరాబాదు నుంచి మా ఊరు వెళ్తుంటే, ఆశ్చర్యకరంగా నాన్నగారు ట్రైన్ లో మా ఎదురుగా కూర్చుని ఉన్నారు. ఆయన హైదరాబాదు నుంచి జిన్నూరు ప్రయాణం చేస్తున్నారు. ఆయనను చూడగానే నాకు చాలా ఆనందమనిపించింది. ఆయనతో ఉన్న భక్తులు దిగి వెళ్ళిపోయాకా నాతో మాట్లాడ్డం ప్రారంభించారు. నేను ఆయనతో మాట్లాడ్డం అదే మొదటిసారి. నా చదువు, ఫేమిలీ గురించి వివరాలు అన్నీ అడిగారు. భవిష్యత్తులో నాన్నగారితో అనుబంధం ఏర్పడటానికి ఈ సంఘటన .పునాది అయింది. ఆరోజు నా జీవితంలో మరువలేనిది. ఆరోజునుంచి నేను నాన్నగారివైపు ఆకర్షించబడ్డాను. ఆయనంటే ఇష్టం రోజు, రోజుకీ పెరుగుతూ వచ్చింది.

నాన్నగారితో నేను 15 రోజులకొకసారి, నెలకొకసారి మాట్లాడుతూ ఉండేదాన్ని. దీనివల్ల నాకు లోపల ధైర్యం, శక్తి పెరుగుతూ వచ్చాయి. ఆ వయసులో నాకు ఆధ్యాత్మికత గురించి తెలియదు, జీవితం ఎలా గడపాలో కూడా తెలియదు. నాన్నగారు నాకు ఒక ఆధ్యాత్మిక మార్గాన్ని చూపడమే కాక, ఆ దారిలో ఎలా నడవాలో కూడా నేర్పించారు. అయితే నాన్నగారంటే భగవంతుడనే నమ్మకం నాకు ఎప్పుడూ ఉండేది.

నా తండ్రి నాకు 20 సం॥ ల వయసులో చనిపోయారు. ఆయనలేని లోటుని నాకు నాన్నగారు తీర్చారు. నా జీవితంలో ఏ సంఘటన జరగబోతూ ఉన్నాకూడా, ఆ సంఘటన కంటే ఒకడుగు ముందే నాన్నగారు ఉండేవారు. ఆయన ఆ సంఘటనని సరిదిద్దాకా ఆ సంఘటన నా జీవితంలోకి వచ్చిందేమో అనిపించేది. ఇంజనీరింగ్ అయిపోయాకా నాన్నగారి అనుగ్రహంతో అమెరికా వెళ్ళాను. ఆయనతో మానసిక అనుబంధం ఎప్పుడూ ఉంది, అది ఇంకా పెరుగుతూ వచ్చింది. అమెరికా నుండి వచ్చి ఆయనను కలిసినప్పుడు, ఫోన్లో ఆయనతో మాట్లాడినప్పుడు కూడా నాకు మంచి బుద్ధిని ప్రసాదించండి నాన్నగారూ అని అడిగేదాన్ని. అప్పుడు ఆయన "బుద్ధి అనేది కారుకి డ్రైవర్ లాంటిది, మన బుద్ధి కరెక్ట్ గా ఉంటే అది మనల్ని క్షేమంగా ఇంటికి చేరుస్తుంది" అన్నారు.

2007 లో నా వివాహం నిశ్చయమైంది. నాకు తండ్రీ, దైవం అన్నీ నాన్నగారే కాబట్టి, నాన్నగారిని రమ్మని పిలిచాను. దానికి ఆయన ఒప్పుకున్నారు. నన్ను పెళ్ళి కూతుర్ని చేసినప్పుడు తలమీద అక్షింతలు వేసి ఆశీర్వదించారు. అప్పుడు నేను ఆయన పాదాలకు నమస్కరించడానికి వంగినప్ఫుడు, నా తలపై ఉన్న అక్షింతలు కింద పడుతూఉంటే ఆయన దోసిలి పట్టి, అక్షింతలు కింద పడకూడదని చెబుతూ, మళ్ళీ వాటిని నా తలపై వేసారు. నా వివాహ ముహూర్తం అర్థరాత్రి సమయం అవడమే కాకుండా, ఆ సమయంలో విపరీతమైన వర్షం పడింది. భక్తులు నాన్నగారితో ఈ సమయంలో వివాహానికి బయలుదేరడం మంచిది కాదని చెప్తున్నా ఆయన వినకుండా వివాహానికి హాజరయ్యారు.


మా అబ్బాయికి చిన్నప్పుడు ఆరోగ్య విషయంలో చిన్న సమస్య వచ్చింది. నాన్నగారు నాతో మాట్లాడి ధైర్యం చెప్పి, కొంతకాలానికి అది తొలగిపోయేలా చేసారు. కుటుంబంలో వచ్చిన చిన్న, చిన్న సమస్యలను కూడా తొలగించారు. భౌతిక జీవితంలో అన్ని విదాలా సహకరిస్తూ, నన్ను ఆధ్యాత్మికం వైపు నడిపించారు. 2017 నుంచి నా ఆధ్యాత్మిక ప్రయాణం వేగవంతమైంది. ఆ సం॥ రం గురుపౌర్ణమికి నేను జిన్నూరు వెళ్ళాను. అప్పుడు నాన్నగారు "గురువు అంటే శరీరం కాదు, ఆయన శరీరంలో ఉన్నప్పుడు కూడా శరీరం కాదు. అందుచేత, ఆయన శరీరంతో ఉన్నా లేకపోయినా కూడా నీకు సహాయం అందుతుంది. నీ సంసారంలో కానీ, ఆర్థికంగా కానీ వేరే ఏ సమస్య వచ్చినా, నువ్వు ఎప్పుడు, ఎక్కడ ఏ ఊరిలో ఉన్నా, అమెరికాలో ఉన్నా కూడా నీవు గురువుతో మానసిక సంబంధం పెట్టుకుంటే నీకు సహకారం అందుతుంది" అన్నారు. అప్పుడు నేను, మీ పట్ల అకారణ ప్రేమ, భక్తి కలిగేలా అనుగ్రహించండి అని అడిగాను. ఆయన ఆశీర్వదించారు. అప్పట్నించీ, నాన్నగారు చెప్పినట్టు కుడిచేయి ఎడమచేతిని తాకితే స్పర్శ ఎలా తెలుస్తుందో, అంత స్పష్టంగా నాకు ఆయన అనుగ్రహం తాకుతున్నట్టు తెలిసేది. నా లోపల ఉన్న చైతన్యానికి నన్ను దగ్గర చేస్తున్నట్టు కూడా అర్థమవుతోంది.

నా జీవితంలో జరిగిన అనుభవాలకు చెందిన చిన్న ఉదాహరణ: నాకు ఏమైనా పదార్థాలు తిన్న తరువాత (నేను తిన్నా, ఎవరు తిన్నా కూడా) గిన్నెల మీద మూతలు పెట్టే అలవాటు లేదు. ఈ విషయంలో నాభర్తకి, నాకూ మధ్య చాలాసార్లు వాదనలు జరిగాయి. అప్పుడు నేను నాకు అది పుట్టుకతో వచ్చిన చాలా బలీయమైన అలవాటు, నా చావుతోనే అది పోవాలి. మీకు ఈ విషయంలో ఇబ్బందిగా ఉన్నా నేను మార్చుకోలేను అని గట్టిగా అనేసాను. తరువాత 2017 లో నాన్నగారిని కలిసినప్పుడు మాఅమ్మగారు, నేను, కొంతమంది భక్తులు హాలులో నాన్నగారి దగ్గర కూర్చుని ఉన్నాము. అప్పుడు నాన్నగారు వేరే విషయాలు మాట్లాడుతూ మధ్యలో గిన్నెలమీద మూతలు పెట్టే విషయం గురించి కొద్దిసేపు మాట్లాడారు. గిన్నెలమీద మూతలు పెట్టడం ఎంత అవసరమో చెప్పారు. నాకోసమే ఇదంతా చెప్పారనుకున్నాను. ఆ తరువాతనుంచి ఆ అలవాటు ఎలా తొలగిపోయిందో తెలియకుండానే పోయింది. ఒకవేళ ఎప్పుడైనా మూతలు పెట్టడం మరిచిపోయినా నాభర్త నన్ను ఎప్పుడూ ఏమీ అనలేదు. కొన్ని బలీయమైన అలవాట్లలోంచి మనంతట మనం విడుదల పొందలేము. వాటిలోంచి విడుదల చేయడం గురువుకే సాధ్యం.

2017 లో 4 నెలల కాలంలో రెండుసార్లు ఇండియా రావడం జరిగింది. అంత తక్కువ సమయంలో ఇండియాకి రెండుసార్లు రావడం ఎప్పుడూ జరగలేదు. అందరూ చాలా ఆశ్చర్యపోయారు. అనుకోకుండా ఇలా వచ్చే అవకాశాన్ని ఆయనే నాకోసం కల్పించారని అనుకున్నాను. ఆయనను చూసి, ఆయన అనుగ్రహంలో గడిపే అవకాశం వచ్చిందని నేను చాలా ఆనందపడ్డాను. అయితే అప్పుడు నాకు తెలీదు, ఆయన శరీరంతో ఉండగా చూడడం అదే ఆఖరిసారి అవుతుందని! మెల్లగా ఆయన ఆరోగ్యం క్షీణించిపోయింది. నాన్నగారు అంత శారీరకమైన బాధ పడుతూ, మాట్లాడలేని స్థితిలో ఉండి కూడా నా గడ్డం పట్టుకొని నన్ను చూడడానికి వచ్చావా అమ్మా! అని అడిగారు. అంతటి సంపూర్ణ ప్రేమ, దయా స్వరూపులు మన నాన్నగారు.

చివరగా నాన్నగారి గురించి ఒక్క వాక్యంలో చెప్పాలంటే, "ఆయనే నా సర్వస్వం"!

త్వమేవ మాతా చ పితా త్వమేవ 
త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ ! 
త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ 
త్వమేవ సర్వం మమ దేవదేవ !! 
( ఓ భగవంతుడా! మా తల్లీ, తండ్రీ నీవే మా బందువు, స్నేహితుడవు నీవే! మా జ్ఞానము, ధనము నీవే సర్వమూ నీవే దేవదేవ! )

1 comment:

  1. ఓం నాన్న పరమాత్మ నే నమః





    ReplyDelete