Monday, August 31, 2020

"నడిచే భగవద్గీత" - పరమపదించిన రమేష్ గారు

భగవంతుడు ఎలా జీవించమని చెప్పాడో అలా జీవించిన వారిలో రమేష్ గారు ప్రముఖులు, శ్రేష్ఠులు.

రమేష్ గారి పూర్తిపేరు: "యలమంచిలి బండి రమేష్" ఈయన 1972 జనవరి 29 న జన్మించారు. ఈయన తండ్రి దక్షిణామూర్తి శర్మ, తల్లి పుష్పావతి. ఈయనకు ఆధ్యాత్మిక జీవితం కుటుంబ వారసత్వంగా రాలేదు. ఆ కుటుంబంలో నుంచి ఆయన ఒక ప్రత్యేక వ్యక్తిగా లోకానికి తెలియబడ్డారు. తల్లి ద్వారా ఈయన భగవద్గీత నేర్చుకున్నారు. తరువాత ఆధ్యాత్మిక జీవితంలో అంచెలంచెలుగా విస్తరించారు.

ప్రారంభంలో సుందరచైతన్యానంద ప్రవచనాలు ఆయన ఆధ్యాత్మిక జీవితానికి పునాదిలాగ తోడ్పడ్డాయి. అప్పటినుంచీ ఆయన భౌతిక జీవితాన్ని భగవంతుని సేవకే వినియోగించాలని నిర్ణయించుకుని, ఉద్యోగ విరమణ చేసారు. వివాహం కూడా చేసుకోలేదు. ఏవిధమైన స్వార్థం లేకుండా ఇతరులకోసమే జీవించారు.

1995 లో భగవద్గీత అధ్యయనం చేయడం ప్రారంభించి ఒక సం॥ లో కంఠస్థం చేసి, చిన్న జీయరు స్వామి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ తీసుకున్నారు. రమేష్ గారు "బ్రహ్మశ్రీ అప్పలసోమేశ్వర శర్మగారి శిష్యులు" వారివద్ద భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలను అధ్యయనం చేసారు.

2010 లో షణ్ముఖశర్మ గారి ప్రవచనంలో "నరసింహ ఆవిర్భావ ఘట్టం" వినడం జరిగింది. తరువాత ఆయనకి నరసింహస్వామి దర్శనం అయింది. అప్పట్నించీ సింహాచల క్షేత్రంలో ప్రహ్లాదుని వైభవాన్ని ప్రచారం చేయడానికి విశేషమైన కృషిచేసారు. సింహాచల క్షేత్ర ఆవిర్భావానికి కారకుడైన "భక్త ప్రహ్లాదుని" యొక్క విగ్రహ ప్రతిష్ఠ చేయాలనే సంకల్పంతో పాటు, ఆ క్షేత్ర ప్రజలలో ప్రహ్లాదుని భక్తితత్వాన్ని ప్రచారం చేయాలని కూడా నిర్ణయించుకున్నారు. అప్పుడు 2015 జనవరి నెలలో వారం రోజులపాటు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచేత "శ్రీ ప్రహ్లాద నృసింహ సర్వస్వం" అనే అంశము మీద ప్రవచనాలు ఏర్పాటు చేసారు. ఆ ప్రవచనాలను 2016 మే లో "భక్త ప్రహ్లాద చంద్రిక" అనే పుస్తకంగా రూపొందించారు. 2016 అక్టోబరులో విజయదశమి నాడు భక్త ప్రహ్లాదుని విగ్రహ ప్రతిష్ఠ చేయించారు. రమేష్ గారు నిర్వహించిన "ప్రహ్లాద విగ్రహ ప్రతిష్ఠ" కు నాన్నగారు సింహాచలం వెళ్ళడం కూడా జరిగింది.

తరువాత 2019 జనవరి లో సింహాచల క్షేత్రంలో ముకుందకరావలంబమ్ ప్రవచనాలు షణ్ముఖశర్మగారితో చెప్పించారు. ఆ సందర్భంగా ముకుందకరావలంబ స్తోత్రాలకు, గ్రంథాల ఆధారంగా అద్భుతమైన వ్యాఖ్యానం రాసి, పుస్తక రూపంలో వెలుగులోకి తెచ్చి వాటిని అందరికీ పంచారు. 2018 జనవరి 23 న ఆయన హృదయంలో నుండి జ్ఞానం వాక్యరూపంలో ప్రవాహంలా మొదలై 1200 వాక్యాలు "ప్రహ్లాద జ్ఞాన వీచికలు" రూపంగా వెలుగు చూసి భక్తులందరికీ అందాయి.

తాను జీవితాంతం నేర్చుకున్న భగవద్గీత, రామాయణం, భారతం, భాగవతం శంకరుల అద్వైత సిద్ధాంతాలను ప్రహ్లాద తత్వంతో సమన్వయం చేసి - వాటిని భక్తి, జ్ఞాన, వైరాగ్యాలతో బోధించేవారు. అవి విన్నవారంతా బ్రహ్మానందాన్ని అనుభవించేవారు.


సద్గురు శ్రీ నాన్నగారి ద్వారా దైనందిన జీవితంలో నడవడిక ఎలా ఉండాలి అనేది నేర్చుకునేవారు. 2002 లో మొదటిసారి అరుణాచల యాత్ర చేసారు. రమణతత్త్వంపై కూడా ఆయనకి ఆసక్తి కలిగింది. అప్పటినుండి నాన్నగారితో అనుబంధం పెరిగింది. నాన్నగారు రమేష్ గారిని "నడిచే భగవద్గీత" అనేవారు. రమేష్ అంటే నాన్నగారికి చాలా ఇష్టం. ఆయన శాస్త్ర పాండిత్యాన్ని కలిగి ఉండడంతో పాటు సంపూర్ణమైన భక్తి, వివేకాలతో జీవించేవారు. ఆధ్యాత్మిక గ్రంథాలన్నింటిమీదా, ద్వైతం, అద్వైతం అనే అంశాల మీద నాన్నగారు రమేష్ తో చాలా ఇష్టంగా చర్చించేవారు. ఎవరైతే నేను చెప్పింది అవగాహన చేసుకుని, దానిని అందరికీ అర్థమయ్యేలా బోధిస్తారో వాళ్ళు నాకు అత్యంత సన్నిహితులు అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన విధంగా రమేష్ జీవించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో రమేష్ గారు చేసే కృషికి నాన్నగారు మెచ్చుకుంటూ, ఎంతో ప్రోత్సాహాన్ని అందించేవారు. ఈయన 1998 నుండి సంపూర్ణంగా భగవంతుడి కోసమే జీవిస్తూ, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఆయన అనుకున్నది అనుకున్నట్టుగా చేసుకుంటూ వెళ్ళారు.

ఈయన బోధ 2010 లో పూర్ణానంద సమాజంలో 10, 15 సం॥ల లోపు పిల్లలతో మొదలైంది. తరువాత విధ్యాప్రకాశానందగిరి పేరుతో, భగవద్గీత క్లాసులు 2010 లో జనవరిలో ద్వారకానగర్ లో, శ్రీ సంపూర్ణానందస్వామి చేతులమీదుగా ప్రారంభమయ్యాయి. వాటిని తరువాత ఆ సంవత్సరం ఆగస్టు 5 నాటికి శివానంద ఆశ్రమంలోకి మార్చడం జరిగింది. అక్కడనుండి ఆయన సత్సంగాలు విస్తరించాయి. వారానికి 5 రోజులు క్లాసులకి, రెండు రోజులు సింహాద్రి నాథుడి దర్శనానికి కేటాయించేవారు. భక్తులతో సింహాచలం పౌర్ణమి ప్రదక్షిణలు చేస్తూ కూడా బోధించేవారు. భక్తులకు ఫోన్లద్వారా కూడా సందేహనివృత్తి చేసేవారు. భగవద్గీత, రామాయణం, ఆదిశంకరుల అద్వైతగ్రంథాలు, రమణగ్రంథాలను బోధించేవారు. ఆయన చివరగా రమణుల "నేనేవడును" గురించి ప్రవచించారు.

గీతా ప్రచారసమితి, గీతా సత్సంగం అనే సంస్థలు నిర్వహించే త్రైమాసిక, అర్థసంవత్సర, వార్షిక, భగవద్గీత పోటీలకు ( చిన్నపిల్లల దగ్గరనుండి పెద్దవారి వరకూ ) రమేష్ ను న్యాయ నిర్ణేతగా పిలిచేవారు.

ఒక భక్తుడికి ఉండవలసిన లక్షణాలన్నీ రమేష్ గారిలో కనపడేవి. వినయంగా, సౌమ్యంగా, ఎవరినీ నొప్పిచకుండా మాట్లాడేవారు. వైజాగ్ భక్తులకు ఆయన ఎంతో ఆప్తులుగా ఉండేవారు. ఆయన పొందిన అనంత వస్తు జ్ఞానాన్ని అందరికీ పంచుతూ, అందరిచేతా "ఓం అనంతాయనమః" అని స్మరణ చేయించేవారు. ఆయన పొందిన జ్ఞానాన్ని భక్థి, జ్ఞాన, వైరాగ్యాలతో సమన్వయం చేసుకుంటూ ఆయన దగ్గర చేరిన చిన్నవయసు యువకులకు, ఎందరో భక్తులకు ప్రతిరోజూ ప్రవచనాలద్వారా బోధించేవారు. ఆయన సంపూర్ణంగా, ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడిపి అందరికీ ఆదర్శప్రాయులయ్యారు. తను వచ్చిన పని పూర్తి చేసుకుని, ఆ దేహాన్ని ఆనందంగా విడిచిన మహనీయుడు శ్రీ రమేష్ కుమార్.

1 comment:

  1. సత్యాసత్య వివేకాన్ని అవస్థాత్రయంతో తేలికగా అర్ధమయ్యేలా నిరంతరం బోధిస్తూ... భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను అందించిన గురువరేణ్యులు 🙏 🙏🙏

    ReplyDelete